Siraj In 100 IPL Wickets Club: వంద వికెట్ల క్లబ్ లోకి సిరాజ్.. సన్ రైజర్స్ పై రెండు వికెట్లతో సత్తా చాటిన మియా భాయ్..
Siraj 100 Wickets: మియా భాయ్ సిరాజ్ సరికొత్త క్లబ్ లోకి ప్రవేశించాడు. ఐపీఎల్ 100 వికెట్లు తీసిన పేసర్ గా స్థానం దక్కించుకున్నాడు. సన్ రైజర్స్ పై సొంతగడ్డ హైదరాబాద్ లో ఈ ఘనత సాధించాడు.

IPL 2025 SRH VS GT Live Updates: హైదరాబాదీ పేసర్ సిరాజ్ మియా సత్తా చాటాడు. ఐపీఎల్లో వంద వికెట్లను పూర్తి చేసుకున్నాడు. ఆదివారం గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో అభిషేక్ శర్మను ఔట్ చేయడం ద్వారా ఈ మైలురాని చేరుకున్నాడు. కెరీర్ లో 97వ మ్యాచ్ ఆడుతున్న సిరాజ్.. రెండు వికెట్లతో సత్తా చాటాడు. అంతగా బౌన్స్ లేని ఈ పిచ్ పై స్టంప్ లైన్ పై బౌలింగ్ చేసి, మంచి ఫలితాన్ని రాబట్టాడు. బ్లాక్ సాయిల్ పిచ్ పై అంతగా బౌన్స్ లేకపోవడం, డ్రై పిచ్ ఉండటం ఫాయిదా పొందాడు. ప్రారంభం ఓవర్లలో ట్రావిస్ హెడ్ ను బోల్తా కొట్టించి, గుజరాత్ కు జోష్ నిచ్చాడు. ఆ తర్వాత జోరుమీదున్న అభిషేక్ శర్మను డిసీవ్ చేసి, మంచి బంతితో బోల్తా కొట్టించాడు. ఊరించే బంతిని వేసి, మిడాఫ్ లో క్యాచౌట్ చేశాడు.
🚨 SIRAJ COMPLETED 100 WICKETS IN IPL HISTORY 🚨 pic.twitter.com/kO0CyUFFIL
— Johns. (@CricCrazyJohns) April 6, 2025
పడిలేచిన కెరటం..
నిజానికి ఈ సీజన్ లో సిరాజ్ కు శుభారంభం దక్కలేదు. పంజాబ్ కింగ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మియా భాయ్ ఘోరంగా విఫలమయ్యాడు. ఆ మ్యాచ్ లో భారీగా 54 పరుగులు సమర్పించుకున్న సిరాజ్.. వికెట్లేమీ తీయలేదు. అయితే ఆ తర్వాత తన అనుభవన్నంతా రంగరించుకున్నాడు. సొంతగడ్డ అహ్మదాబాద్ నరేంద్ర మోడీ స్టేడియంలో ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో జులూ విదిల్చాడు. 34 పరుగులకు రెండు వికెట్లు తీశాడు. ఆ తర్వాత ఆర్సీబీపై విశ్వరూపం చూపించాడు. తనకెంతో పట్టున్న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో 3/19 తో మ్యాచ్ విన్నింగ్ ప్రదర్శనతో ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు.
సన్ రైజర్స్ తోనే అరంగేట్రం..
హైదరాబాదీ సిరాజ్ ప్రతిభను గుర్తించిన సన్ రైజర్స్ టీమ్ మేనేజ్మెంట్ తనకు 2017 అరంగేట్ర చాన్స్ ఇచ్చింది. ఈ సీజన్ లో ఆరు మ్యాచ్ లాడిని మియా భాయ్.. అంతే సంఖ్యలో వికెట్లు తీసుకున్నాడు. ఆ తర్వాత ఏడాది ఆర్సీబీ జట్టులోకి వెళ్లిన సిరాజ్ తిరిగి చూసుకోలేదు. ఆ జట్టు తరపున 87 మ్యాచ్ లాడిన సిరాజ్.. 83 వికెట్లు తీశాడు. ఆ తర్వాత అదే జోరులో జాతీయ జట్టులోకి అరంగేట్రం చేసి మూడు ఫార్మాట్లు ఆడాడు. ఇక తాజాగా కొత్త టీమ్ గుజరాత్ టైటాన్స్ తరపున కూడా ఇప్పటివరకు ఆడిన నాలుగు మ్యాచ్ ల్లో ఏడు వికెట్లు తీశాయి.




















