Jason Roy: కేకేఆర్‌కు షాక్! జేసన్ రాయ్‌కు జరిమానా!
Jason Roy: కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు షాక్! ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించింది. మ్యాచు ఫీజులో పది శాతం కోత పెట్టారు.
Jason Roy IPL 2023:
కోల్‌కతా నైట్‌రైడర్స్ ఓపెనర్ జేసన్ రాయ్‌కు షాక్! ఐపీఎల్ నిర్వాహకులు అతడికి జరిమానా విధించింది. మ్యాచు ఫీజులో పది శాతం కోత పెట్టారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచులో అతడు ఐపీఎల్ నియమావళిని ఉల్లంఘించాడు. 37 బంతుల్లోనే 54 రన్స్ కొట్టిన రాయ్.. విజక్ కుమార్ వైశాఖ్ వేసిన 10వ ఓవర్లో ఔటయ్యాడు.
వైశాఖ్ ఫుల్ లెంగ్తులో స్ట్రెయిట్‌గా వేసిన బంతిని అంచనా వేయడంలో జేసన్ రాయ్ విఫలమయ్యాడు. క్రీజులో షపుల్ అయినా లైన్‌ను కవర్ చేయలేకపోయాడు. దాంతో బంతి నేరుగా లెగ్‌స్టంప్‌ను తాకేసింది. షాట్ ఆడలేకపోయానన్న కోపంలో కింద పడ్డ బెయిల్‌ను రాయ్ తన బ్యాటుతో కొట్టాడు. క్రికెట్ పరికరాలు, సామగ్రిని ధ్వంసం చేసినా.. ఆటగాళ్లను దూషించినా.. క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ప్రవర్తించినా ఐపీఎల్ నియమావళిలోని ఆర్టికల్ 2.2 ప్రకారం శిక్ష విధిస్తారు. తీవ్రతను బట్టి మ్యాచు ఫీజులో కోత విధిస్తారు.
@JasonRoy20 | @chakaravarthy29 pic.twitter.com/pLFTW7AR91
— KolkataKnightRiders (@KKRiders) April 27, 2023
IPL 2023, RCB vs KKR:
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వరుస విజయాలకు తెరపడింది! చిన్నస్వామి స్టేడియంలో కోహ్లీ సేన 21 రన్స్ తేడాతో ఓటమి చవిచూసింది. కోల్‌కతా చేతిలో రెండోసారీ భంగపడింది. 201 రన్ ఛేజ్‌లో ఆర్సీబీ 179/8కి పరిమితమైంది. విరాట్ కోహ్లీ (54; 37 బంతుల్లో 6x4) ఒక్కడే పోరాడాడు. మహిపాల్ లోమ్రర్ (34; 18 బంతుల్లో 1x4, 3x6) అతడికి తోడుగా నిలిచాడు. అంతకు ముందు కేకేఆర్‌లో ఓపెనర్ జేసన్ రాయ్ (56; 29 బంతుల్లో 4x4, 5x6) డిస్ట్రక్టివ్ ఓపెనింగ్ ఇచ్చాడు. వరుసగా రెండో హాఫ్ సెంచరీ కొట్టేశాడు. కెప్టెన్ నితీశ్ రాణా (48; 21 బంతుల్లో 3x4, 4x6), వెంకటేశ్ అయ్యర్ (31; 26 బంతుల్లో 3x4) చక్కని ఇన్నింగ్సులతో మెరిశారు.
రప్ఫాడించిన రాయ్
టాస్ ఓడిని కేకేఆర్ మొదట బ్యాటింగ్‌కు వచ్చింది. తొలి రెండు ఓవర్లు పెద్ద స్కోరేమీ రాలేదు. ఆ తర్వాతే అసలైన ఊచకోత మొదలైంది. ఇంగ్లాండ్ డిస్ట్రక్టివ్ ఓపెనర్ జేసన్ రాయ్.. రఫ్ఫాడించాడు. దొరికిన బంతిని దొరికినట్టే కొట్టాడు. షాబాజ్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్లో అయితే సిక్సర్లు, బౌండరీలు బాదేశాడు. దాంతో 6 ఓవర్లకు కేకేఆర్ 66/0తో నిలిచింది. రాయ్ 22 బంతుల్లోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. మరో ఓపెనర్ నారాయణ్ జగదీశన్ (27; 29 బంతుల్లో)తో కలిసి తొలి వికెట్‌కు 83 పరుగుల భాగస్వామ్యం అందించాడు. అయితే పదో ఓవర్లో 4 పరుగుల వ్యవధిలో వీరిద్దరినీ వైశాక్ పెవిలియన్ పంపించాడు.
రాణా.. అయ్యర్ స్పెషల్
ఓపెనర్లు ఔటయ్యాక కెప్టెన్ నితీశ్ రాణా, వెంకటేశ్ అయ్యర్ స్కోర్ బోర్డును పరుగెత్తించే బాధ్యత తీసుకున్నారు. క్రీజులో అలవాటు పడగానే నితీశ్ రాణా వీరబాదుడు షురూ చేశాడు. చక్కని లాఫ్టెడ్ షాట్లతో అలరించాడు. అయ్యర్ సైతం షాట్లు ఆడేందుకు ప్రయత్నించాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 44 బంతుల్లో 80 పరుగుల పాట్నర్ షిప్ అందించారు. దాంతో కేకేఆర్ 15.6 ఓవర్లకు 150కి చేరుకుంది. ప్రమాదకరంగా మారిన రాణా, అయ్యర్ జోడీని 18వ ఓవర్లో ఒక పరుగు వ్యవధిలో హసరంగ ఔట్ చేశాడు. ఆఖర్లో రింకూ సింగ్ (18*; 10 బంతుల్లో 2x4, 1x6), డేవిడ్ వైస్ (12*; 3 బంతుల్లో 2x6) సిక్సర్లు బాదేసి జట్టు స్కోరును 200/5కు తీసుకెళ్లారు.