IPL Retentions 2022: బుమ్రా, సూర్య, వెంకీ, బట్లర్‌కు అన్యాయం జరిగిందా? ఎక్కువ డబ్బును వదిలేశారా?
ఈ మధ్యే ముగిసిన ఐపీఎల్ రీటెన్షన్‌లో కొందరు ఆటగాళ్లకు పెంచాల్సినంత వేతనం పెంచలేదని అనిపిస్తోంది. ముఖ్యంగా నలుగురు ఆటగాళ్లకు విలువ పరంగా తక్కువే ఇచ్చారని అంచనా వేస్తున్నారు.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ రీటెన్షన్ ప్రక్రియ ముగిసింది. ఫ్రాంచైజీలన్నీ తమకు కావాల్సిన ఆటగాళ్లను అట్టిపెట్టుకున్నాయి. ముఖ్యంగా కుర్రాళ్లకు పెద్ద పీట వేశాయి. కనీసం పదేళ్లు సేవలందించే వారిని ఎంపిక చేసుకున్నాయి. యువ ఆటగాళ్లు భారీ మొత్తమే అందుకుంటున్నా కొందరికి మాత్రం విలువ పరంగా సమాన పెరుగుదల కనిపించలేదు.
పేసుగుర్రం తక్కువ ధరకే!
ముంబయి ఇండియన్స్ ప్రధాన ఆటగాళ్లలో జస్ప్రీత్ బుమ్రా అత్యంత కీలకం. అంతర్జాతీయ క్రికెట్లో బౌలింగ్ పరంగా అతడిని మించిన మ్యాచ్ విజేత లేరనే చెప్పాలి! పవర్‌ప్లే, మధ్య ఓవర్లు, డెత్ ఓవర్లు ఎప్పుడు బంతి అందుకున్నా పరుగులను నియంత్రిస్తాడు. వికెట్లను తీస్తుంటాడు. కెప్టెన్ కోరుకొనే ఆటగాళ్లలో అతడే ముందుంటాడు. ఇప్పటి వరకు 106 మ్యాచులాడిన బుమ్రా 2422 బంతులు విసిరి 7.41 ఎకానమీ, 23.3 సగటుతో 2,995 పరుగులు ఇచ్చాడు. 130 వికెట్లు తీశాడు. ఇప్పటి వరకు రూ.5 కోట్లు అందుకున్న బుమ్రా ఇకపై రూ.12 కోట్లు అందుకుంటాడు. అయినప్పటికీ ఇది విలువ పరంగా తక్కువే! అతడు వేలంలోకి వచ్చుంటే కనీసం రూ.16 కోట్లకు తక్కువ పలకడు.
అయ్యారే.. అనిపించినా!
చివరి సీజన్లో అందరినీ ఆకట్టుకున్న ఓపెనర్ వెంకటేశ్ అయ్యర్. ఈ సారి వేలంలో అతడికి భారీ ధర దక్కుతుందని రికీ పాంటింగ్ సహా ఎంతో మంది అంచనా వేశారు. అతడిని దక్కించుకొనేందుకు నాలుగైదు ఫ్రాంచైజీలు రెడీగా ఉన్నాయి. ఎడమచేతి వాటం కావడం, నిర్భయంగా షాట్లు కొట్టడం, పవర్‌ప్లే ఫీల్డర్ల పై నుంచి బంతిని పంపించడంలో అయ్యర్ అద్భుతం. పైగా బంతితోనూ రాణించగలరు. కోల్‌కతా అయ్యర్ ధరను రూ.20 లక్షల నుంచి రూ.8 కోట్లకు పెంచింది. వేలంలో అదృష్టం పరీక్షించుకొంటే ఇంకా ఎక్కువే వచ్చుండేది!
సూర్యకు మరింత విలువ!
ఈ సీజన్లో సూర్యకుమార్ ముంబయి ఇండియన్స్‌ను వదిలేస్తాడని వార్తలు వచ్చాయి! ఏం జరిగిందో తెలియదు కానీ ఎంఐ అతడిని రూ.3.2 కోట్ల నుంచి రూ.8 కోట్లు చెల్లిస్తూ రీటెయిన్ చేసుకుంది. భారత్‌లో సూర్యలాంటి క్రికెటర్లు అరుదు. ఏ స్థానంలో వచ్చినా అదరగొట్టడం అతడి నైజం! వికెట్లు పడుతుంటే సమయోచితంగా ఆడుతూ భారీ షాట్లు కొడుతూ స్కోరు పెంచేస్తాడు. ఇక అప్పటికే ఉన్న జోరునూ కంటిన్యూ చేస్తాడు. సింపుల్‌గా చెప్పాలంటే అతడు ఏబీ డివిలియర్స్‌లా 360 డిగ్రీ ఆటగాడు. అందుకే అతడు వేలంలోకి వచ్చుంటే కొత్త ఫ్రాంచైజీలు మిడిలార్డర్ బలోపేతం కోసం భారీ ధర పెట్టేవి.
బట్లర్‌కు ఇంకా వచ్చేదే!
పొట్టి క్రికెట్లో జోస్ బట్లర్ ఇప్పుడు హాట్ ఫేవరెట్! వేలంలోకి వస్తే అతడిని కళ్లకు అద్దుకొని తీసుకుంటారు. ఓపెనింగ్ నుంచి డౌన్ ద ఆర్డర్ వరకు అతడు ఆడగలడు. ఎలాంటి ప్రత్యర్థినైనా, ఎలాంటి బౌలర్‌నైనా అతడు వణికించగలడు. ఐపీఎల్‌లో అతడి సగటు 35, స్ట్రైక్‌రేట్ 150గా ఉంది. పవర్‌ప్లేలో అతడి షాట్లు అద్భుతంగా ఉంటాయి. పిచ్‌లు కఠినంగా ఉంటే నిలకడగా ఆడుతూ ఆఖర్లో వేగం పెంచగలడు. రాజస్థాన్ అతడి ధర రూ.4.4 కోట్ల నుంచి రూ.10 కోట్లకు పెరిగింది. బహుశా వేలంలో రూ.12-15 కోట్ల వరకు పలికేవాడని అంచనా.
Also Read: IPL Retention: కేఎల్ రాహుల్, రషీద్ ఖాన్‌లపై ఏడాది నిషేధం తప్పదా..! గతంలో స్టార్ ఆల్ రౌండర్‌పై వేటు
Also Read: SRH Retention 2022: కథ మళ్లీ మొదటికే.. ‘0’ నుంచి షురూ చేయాల్సిందే కేన్ మామా!
Also Read: IPL Retention: ధోనీ లేని చెన్నై..! మహీని తీసుకోవద్దంటూ గంభీర్ సూచన!