(Source: ECI/ABP News/ABP Majha)
ENG vs BANG, Match Highlights: బంగ్లాను చిత్తు చేసిన ఇంగ్లండ్.. ఎనిమిది వికెట్లతో విజయం!
ICC T20 WC 2021, ENG vs BANG: టీ20 వరల్డ్ కప్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లతో విజయం సాధించింది.
టీ20 వరల్డ్ కప్‌లో నేడు సాయంత్రం జరిగిన మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై ఇంగ్లండ్ ఎనిమిది వికెట్లతో ఘనవిజయం సాధించింది. మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్లకు 124 పరుగులు చేసింది. అనంతరం ఇంగ్లండ్ 14.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. జేసన్ రాయ్‌కి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
కుప్పకూలిన బంగ్లాదేశ్
మొదట బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్‌కు ఆరంభంలోనే ఎదురు దెబ్బ తగిలింది. పవర్ ప్లేలోనే బంగ్లాదేశ్.. కీలక బ్యాట్స్‌మెన్ అయిన లిటన్ దాస్, నయీం, షకీబ్ అల్ హసన్‌ల వికెట్లను కోల్పోయింది. ఆ తర్వాత మరో ఐదు ఓవర్ల పాటు వికెట్లు పడకుండా.. ముష్ఫికర్ రహీం, మహ్మదుల్లా నిలవరించారు. దీంతో 10 ఓవర్లలో బంగ్లాదేశ్ మూడు వికెట్ల నష్టానికి 60 పరుగులు చేసింది.
ఆ తర్వాత కూడా వరుస విరామాల్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. దీంతో బంగ్లాదేశ్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 126 పరుగులు చేసింది. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ మూడు వికెట్లు తీయగా.. లియాం లివింగ్ స్టోన్, మొయిన్ అలీ రెండేసి వికెట్లు తీశారు. క్రిస్ వోక్స్‌కు ఒక వికెట్ దక్కింది.
చితక్కొట్టిన రాయ్
125 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇంగ్లండ్‌కు ఓపెనర్ జేసన్ రాయ్ (61: 38 బంతుల్లో, ఐదు ఫోర్లు, మూడు సిక్సర్లు) చెలరేగి ఆడటంతో ఎటువంటి ఇబ్బందీ ఎదురు కాలేదు. మొదటి వికెట్‌కు జోస్ బట్లర్‌తో కలిసి 39 పరుగులు జోడించిన రాయ్, రెండో వికెట్‌కు డేవిడ్ మలన్‌తో కలసి 73 పరుగులు జోడించాడు. లక్ష్యానికి కొంచెం ముందు జేసన్ రాయ్ అవుటయినా.. డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో కలిసి పని పూర్తి చేశారు.
బంగ్లాదేశ్ బౌలర్లలో షోరిఫుల్ ఇస్లాం, నసూం అహ్మద్ చెరో వికెట్ తీశారు. ఈ విజయంతో గ్రూప్-1లో ఇంగ్లండ్ అగ్రస్థానానికి చేరుకుంది.
Also Read: Hardik Pandya Health: హార్దిక్ స్కానింగ్ రిపోర్ట్ వచ్చేసింది.. న్యూజిలాండ్ మ్యాచ్ ఆడగలడా? లేదా?
Also Read: IPL New Teams: ఐపీఎల్‌లో రెండు కొత్త జట్లు ఇవే.. చేజిక్కించుకున్న కంపెనీలు ఏవంటే?
Also Read: Ind Vs Pak: పాక్ పైచేయి సాధించింది అక్కడే.. కాస్త జాగ్రత్త పడి ఉంటే?