Neeraj Chopra Beats Dp Manu To Bag Gold Medal With Throw Of: మూడేండ్ల తర్వాత స్వదేశంలో బరిలోకి దిగిన భారత స్టార్ జావెలిన్ త్రోయర్, టోక్యో ఒలింపిక్స్ ‘గోల్డెన్ బాయ్' నీరజ్ చోప్రా(Neeraj Chopra).. ఫెడరేషన్ కప్(Federation Cup 2024)లో సత్తా చాటాడు. భువనేశ్వర్‌లోని కళింగ స్టేడియంలో జరిగిన 27వ ఫెడరేషన్ కప్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో నీరజ్ చోప్రా బంగారు పతకం సాధించాడు. బల్లాన్ని 82.27 మీటర్ల దూరానికి విసిరి పసిడి పతకాన్ని సొంతం చేసుకున్నాడు. నాలుగో ప్రయత్నంలో అతను 82.27 మీటర్లు బల్లెం విసిరి విజేతగా నిలిచాడు. తొలి ప్రయత్నంలో 82 మీటర్ల ప్రదర్శన చేసిన నీరజ్ రెండో రౌండ్లో ఫౌల్, మూడో రౌండ్లో 81.29 మీటర్లు బల్లెం విసిరాడు. అయితే నాలుగో రౌండ్లో నీరజ్ ప్రదర్శనను మిగతా అథ్లెట్లు అధిగమించలేకపోయారు. దాంతో అతను మిగిలి రెండు త్రోలను అసలు ప్రయత్నించాల్సిన అవసరం లేకుండా పోయింది. ఫైనల్స్‌లో
కర్ణాటకకు చెందిన మనును వెనక్కినెట్టి నీరజ్ గెలుపొందాడు. దీంతో మను 82.06 మీటర్లతో రెండో స్థానానికి పరిమితమయ్యాడు. ఇక మహారాష్ట్రకు చెందిన ఉత్తమ్ పాటిల్ 78.39 మీటర్లతో మూడో స్థానంలో నిలిచాడు. అయితే నీరజ్‌తోపాటు పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన కిశోర్ జెనా ఈ ఈవెంట్లో నిరాశపరిచాడు. 75.49 మీటర్ల త్రోతో ఐదో స్థానంతో సరిపెట్టాడు.
2021లో ఇదే టోర్నీలో పాల్గొన్న నీరజ్ మూడేళ్ల తర్వాత దేశవాళీ ఈవెంట్లో బరిలోకి దిగాడు. 2021లో కూడా స్వర్ణం గెలిచాడు. అప్పుడు 87.80 మీటర్లు త్రో చేశాడు. దానితో పోలిస్తే ఇప్పుడు చేసిన త్రో అభిమానులను కాస్త నిరాశ పరచినట్టే. ఇక ఇటీవలే ముగిసిన దోహా డైమండ్ లీగ్‌లో కూడా నీరజ్ పాల్గొన్నాడు. జావెలిన్‌ను 88.36 మీటర్ల దూరం విసిరి 0.2 సెంటిమీటర్ల తేడాతో అగ్రస్థానం కోల్పోయాడు. చెక్ రిపబ్లిక్కు చెందిన జాకుబ్ వాడ్లెజ్ కంటే 3 సెంటీమీటర్ల వెనుకబడి ఉన్నాడు. జాకబ్ అత్యుత్తమంగా 88.38 మీటర్లు విసిరాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో పాల్గొననున్న కిషోర్ కుమార్ జెన్నా కూడా దోహ లో ఘోరంగా విఫలం అయ్యాడు . బళ్లాన్ని అత్యుత్తమంగా 76.31 మీటర్ల మేర విసిరి తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నాడు.
నీరజ్ చోప్రా, కిషోర్ కుమార్ జెన్నా ఇద్దరు ఇప్పటికే పారిస్ ఒలింపిక్స్ 2024కి అర్హత సాధించారు. దీంతో ఈ విజయాలు అతడికి ఉత్తేజాన్ని ఇస్తాయి. అలాగే మరింత శ్రద్ద పెట్టడానికి దోహదపడతాయని అభిమానులు అభిప్రాయపడుతున్నారు.
చోప్రా తాజాగా స్వర్ణం నెగ్గినా అతడి ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు.