Ind vs NZ T20 Match: గుడ్‌న్యూస్..! భారత్, కివీస్ మూడో టీ20కి ఈడెన్‌లో 70శాతం మందికి అనుమతి
కొన్నేళ్ల తర్వాత ఈడెన్ గార్డెన్‌లో అంతర్జాతీయ మ్యాచ్ జరుగుతోంది. కరోనా రెండో వేవ్ తర్వాత 70 శాతం మంది ప్రేక్షకులకు అనుమతినిస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 48వేల మంది రావొచ్చు.
అభిమానులకు శుభవార్త! క్రికెట్ మ్యాచులను తిరిగి ప్రత్యక్షంగా వీక్షించేందుకు అనుమతి లభించింది. ఈడెన్ గార్డెన్‌లో భారత్, న్యూజిలాండ్ మూడో టీ20కి 70 శాతం మంది ప్రేక్షకులను అనుమతించనున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ ముగియగానే న్యూజిలాండ్ జట్టు భారత్‌లో పర్యటిస్తుంది. మూడు టీ20లతో పాటు టెస్టు సిరీసును ఆడనుంది. ఇందులో ఆఖరి మ్యాచుకు కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ ఆతిథ్యం ఇస్తోంది. కొన్నేళ్లుగా ఈడెన్‌లో అంతర్జాతీయ మ్యాచులేమీ జరగలేదు. ఐపీఎల్ మ్యాచులూ ఆడలేదు. ఈ నేపథ్యంలో చివరి టీ20కి 70 శాతం మందికి అనుమతి ఇస్తూ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
2016 టీ20 ప్రపంచకప్ ఫైనల్ ఈడెన్‌లోనే జరిగింది. అప్పుడు ఏకంగా 68,000 మంది మ్యాచుకు హాజరయ్యారు. ఇప్పుడు 70 శాతం అంటే కనీసం 47000 నుంచి 48,000 మంది వచ్చేందుకు వీలుంటుంది. 2019 నవంబర్లో టీమ్‌ఇండియా తొలి పింక్ బాల్ టెస్టును ఇక్కడే ఆడింది. బంగ్లాదేశ్‌ను ఓడించింది. ఈడెన్‌లో అదే చివరి మ్యాచ్. 2020లో దక్షిణాఫ్రికాతో టీ20 జరగాల్సి ఉండగా.. కరోనాతో వాయిదా పడింది. ఐపీఎల్ 2021లో కొన్ని మ్యాచులకు వేదికగా ప్రకటించినా.. మధ్యలో ఆటగాళ్లకు వైరస్ సోకడంతో టోర్నీ దుబాయ్‌కు తరలించారు.
'ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చింది. 70 శాతం మంది మ్యాచ్‌ను వీక్షించేందుకు బీసీసీఐ అంగీకరిస్తుందనే అనుకుంటున్నాం' అని బెంగాల్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు అభిషేక్ దాల్మియా అన్నాడు. పిచ్‌ను అద్భుతంగా రూపొందిస్తామని ఈడెన్ క్యూరేటర్ సుజన్ ముఖర్జీ పేర్కొన్నారు. 'మైదానం ముందు నుంచే సిద్ధం చేస్తాం. వికెట్లో మంచి బౌన్స్ ఉంటుంది. నాణ్యమైన క్రికెట్‌ను ఎంజాయ్ చేస్తారని నమ్మకంగా చెప్పగలను. మహిళల మ్యాచుల ద్వారా మనకూ పిచ్‌పై ఐడియా వస్తుంది' అని ఆయన వెల్లడించారు.
ఈ ఆదివారం దుబాయ్ వేదికగా భారత్, న్యూజిలాండ్ ఐసీసీ టీ20 ప్రపంచకప్ సూపర్ 12 మ్యాచులో తలపడుతున్న సంగతి తెలిసిందే.
Also Read: IPL 2022 Retention Rules: కొత్త రూల్స్ ఇవే! ఐపీఎల్ జట్లు ఎంతమందిని అట్టిపెట్టుకోవచ్చంటే..?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి