అది ఆటా - నాటు నాటు పాటా? - కోహ్లీ, సూర్యలను ఎన్టీఆర్, చరణ్‌లతో పోల్చిన వీరూ!
విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్‌ల ఆటను నాటు నాటు పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో వీరేంద్ర సెహ్వాగ్ పోల్చారు.
టీ20 వరల్డ్‌కప్‌లో నెదర్లాండ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 56 పరుగులతో విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ అర్థ సెంచరీలు చేశారు. చివర్లో కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ భాగస్వామ్యం భారత్‌ను భారీ స్కోరు వైపు నడిపించింది. ఈ భాగస్వామ్యాన్ని భారత మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఆర్ఆర్ఆర్‌తో పోల్చాడు.
సూర్యకుమార్ యాదవ్, విరాట్ కోహ్లీ బ్యాటింగ్ చేస్తుంటే చూడటం చాలా ఆనందంగా ఉందని ట్వీట్‌లో పేర్కొన్నాడు. దాని కింద నాటు నాటు పాటలో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ డ్యాన్స్ వేస్తున్న ఫొటోను షేర్ చేశారు. అంటే విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ బ్యాటింగ్ చేస్తుంటే జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటుకు డ్యాన్స్ వేస్తున్నంత అందంగా ఉందని చెప్పకనే చెప్పారన్న మాట. ఈ ట్వీట్ ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంది. సగటు క్రికెట్ అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ కూడా దీనికి కామెంట్ చేయడంతో పాటు లైకులు, రీట్వీట్లు కూడా చేస్తున్నారు.
ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా దూసుకుపోతుంది. మొదటి మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై విజయం సాధించిన టీమిండియా, రెండో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను కూడా 56 పరుగులతో మట్టి కరిపించింది. మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 20 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది. అనంతరం నెదర్లాండ్స్ 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 123 పరుగులకే పరిమితం అయింది.
టాస్ గెలిచిన టీమిండియా మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్ కేఎల్ రాహుల్ (9) త్వరగానే ఔటయ్యాడు. మీకెరన్ వేసిన 2.4వ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. అతడు రివ్యూ తీసుకుందామన్నా రోహిత్ శర్మ నిరాకరించాడు. వికెట్ పడ్డప్పటికీ హిట్‌మ్యాన్ నెదర్లాండ్స్ బౌలర్లపై ఎదురుదాడి చేశాడు. చక్కని బౌండరీలు, సిక్సర్లు బాదేశాడు. 35 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకున్నాడు. విరాట్‌తో కలిసి రెండో వికెట్‌కు 56 బంతుల్లో 73 పరుగుల భాగస్వామ్యం అందించాడు.
టీమ్‌ఇండియా స్కోరు 84 వద్ద రోహిత్‌ను క్లాసెన్ ఔట్ చేశాడు. ఆ తర్వాత కింగ్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్ జోరందుకున్నారు. పోటీపడి మరీ బంతిని బాదేశారు. విరాట్ 37 బంతుల్లో హాఫ్ సెంచరీ అందుకుంటే సూర్య 25 బంతుల్లోనే సాధించేశాడు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 48 బంతుల్లో 95 పరుగుల అజేయ భాగస్వామ్యం అందించడంతో టీమ్‌ఇండియా స్కోరు 179/2కి చేరుకుంది. మిస్టర్ 360 షాట్లకు ఫ్యాన్స్ కుషీ అయ్యారు. నెదర్లాండ్స్‌లో మీకెరెన్, క్లాసెన్ చెరో వికెట్ తీశారు.
అనంతరం భారీ టార్గెట్ ఛేదనకు దిగిన నెదర్లాండ్స్‌ను టీమ్‌ఇండియా బౌలర్లు వణికించారు. భువనేశ్వర్ కుమార్ కళ్లుచెదిరే బౌలింగ్ స్పెల్‌తో ఆకట్టుకున్నాడు. జట్టు స్కోరు 11 వద్దే ఓపెనర్ విక్రమ్‌జీత్ (1) వికెట్లు ఎగరగొట్టాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ రంగంలోకి దిగాడు. వరుసగా మాక్స్ ఓడౌడ్ (16), బాస్ డిలీడ్ (16)ను పెవిలియన్ పంపించాడు. డ్రింక్స్ విరామానికి నెదర్లాండ్స్ 47/3తో కష్టాల్లో పడింది. మిడిల్ ఓవర్లలో కొలిన్ అకెర్‌మన్ (17), టామ్ కూపర్ (9)ని అశ్విన్ ఔట్ చేశాడు. మరికాసేపటికే కెప్టెన్ స్కాట్ ఎడ్‌వర్డ్స్ (5)ను భువీ, కీలకంగా ఆడుతున్న టిమ్ ప్రింగిల్ (20)ను షమి పెవిలియన్ పంపించడంతో టీమ్‌ఇండియా గెలుపు ఖాయమైంది. ఆఖర్లో లాగన్ వాన్ బీక్ (3), ఫ్రెడ్ క్లాసెన్ (0) వికెట్లను అర్షదీప్ తీశాడు. షరిజ్ అహ్మద్ (16), మీకెరన్ (14) నాటౌట్‌గా నిలిచారు.