ICC ODI WC 2023: అలిగినవారిని అలా బుజ్జగించుదాం - వరల్డ్ కప్ గేమ్స్ దక్కని స్టేడియాలకు భారీ ఊరట ప్రకటించిన జై షా
వన్డే వరల్డ్ కప్ లో భాగంగా ఐసీసీ ఇటీవలే షెడ్యూల్ ను ప్రకటించింది. కానీ కొన్ని ప్రముఖ స్టేడియాలకు మ్యాచ్ లను కేటాయించకపోవడం విమర్శలకు దారి తీసింది.
ICC ODI WC 2023: పదేండ్ల తర్వాత భారత్ వేదికగా నిర్వహించనున్న వన్డే వరల్డ్ కప్ లో భాగంగా అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ), ఆతిథ్య బీసీసీఐతో కలిసి ఇటీవలే షెడ్యూల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే. భారత్ లోని పది ప్రముఖ స్టేడియాలలో 46 రోజుల పాటు వన్డే వరల్డ్ కప్ మ్యాచ్ లు జరుగనున్నాయి. అయితే ఈ ప్రపంచకప్ లో తమకు మ్యాచ్ లు దక్కుతాయని ఆశించి భంగపడ్డ పలు రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ లు బహిరంగంగానే బీసీసీఐపై విమర్శలు గుప్పించాయి. పంజాబ్, మధ్యప్రదేశ్ క్రికెట్ బోర్డులు వరల్డ్ రిచెస్ట్ క్రికెట్ బోర్డుపై అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. వీరిని బుజ్జగించేందుకు స్వయంగా బీసీసీఐ సెక్రటరీ జై షా నే రంగంలోకి దిగాడు.
ప్రపంచకప్ లో మ్యాచ్ లు నిర్వహించని వేదికల తాలూకు అసోసియేషన్ లను బుజ్జగించేందుకు గాను.. భారత్ ఆడబోయే ద్వైపాక్షిక సిరీస్ లలో ఎక్కువ శాతం వీటికే కేటాయించేందుకు అంగీకారం తెలిపినట్టు సమాచారం. ఇదే విషయమై బీసీసీఐ ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ.. ‘మా మీటింగ్ సందర్భంగా ఐసీసీ వన్డే వరల్డ్ కప్ లో మ్యాచ్ లు దక్కని వేదికలకు ద్వైపాక్షిక సిరీస్ లలో అధిక మ్యాచ్ లు కేటాయించాలి. ఆ మేరకు వన్డే వరల్డ్ కప్ నిర్వహణ దక్కిన వేదిక (అసోసియేషన్) లు కూడా సహకరించాలి’ అని ప్రతిపాదించాడని తెలిపాడు.
వన్డే వరల్డ్ కప్ కోసం బీసీసీఐ అహ్మదాబాద్, ఢిల్లీ, ధర్మశాల, బెంగళూరు, చెన్నై, కోల్కతా, పూణె, ముంబై, లక్నో, హైదరాబాద్ లను ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇందులో హైదరాబాద్ లో (మూడు మ్యాచ్ లు) మినహా మిగిలిన వేదికలన్నీ ఐదేసి మ్యాచ్ లకు ఆతిథ్యమిస్తాయి. గువహతి (అసోం), తిరువనంతపురం (కేరళ) స్టేడియాలలో ప్రాక్టీస్ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే వన్డే వరల్డ్ కప్‌లో తమకు కూడా మ్యాచ్‌లు దక్కుతాయని ఇండోర్ (మధ్యప్రదేశ్), మొహాలీ (పంజాబ్) భావించినా వాటికి ఐసీసీ, బీసీసీఐ మొండిచేయి చూపించాయి.
IPL 2023 opening match: Narendra Modi stadium
— Saket Gokhale (@SaketGokhale) June 28, 2023
IPL 2023 Final: Narendra Modi stadium
Cricket World Cup 2023 opening match: Narendra Modi stadium
Cricket World Cup 2023 Final: Narendra Modi stadium
Jay Shah - BCCI Secretary & son of Amit Shah - ensures Gujarat gets priority…
వన్డే వరల్డ్ కప్ వేదికలపై రాజకీయ నాయకులు కూడా స్పందించడం ఆసక్తికర చర్చకు దారి తీసింది. పంజాబ్ క్రీడా శాఖ మంత్రి గుర్మీత్ సింగ్, కాంగ్రెస్ సినీయర్ నాయకుడు శశిథరూర్, టీఎంసీ అధికార ప్రతినిధి సాకేత్ గోఖలే లు బీసీసీఐ, జై షాను టార్గెట్ గా చేస్తూ విమర్శలు గుప్పించారు. గోఖలే ఓ ట్వీట్ లో ‘ఐపీఎల్ ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు, క్రికెట్ వరల్డ్ కప్ ఓపెనింగ్, ఫైనల్ మ్యాచ్‌లు అన్నీ అహ్మదాబాద్‌లోనే.. బీసీసీఐ సెక్రటరీ, అమిత్ షా కొడుకు తన సొంత రాష్ట్రం గుజరాత్‌కు అధిక ప్రాధాన్యమిస్తున్నాడు..’అని ట్వీట్ చేశాడు.
జై షా చెప్పినదాని ప్రకారం భారత్ లో వన్డే వరల్డ్ కప్ కు ముందు, ఆ తర్వాత స్వదేశంలో ఆడే ద్వైపాక్షిక సిరీస్ లలో ఎక్కువ భాగం మొహాలీ, ఇండోర్, రాంచీ, నాగ్పూర్, రాజ్కోట్ వంటి స్టేడియాల వేదికగా జరుగనున్నాయి. ఆసియా కప్ తర్వాత భారత జట్టు ఆస్ట్రేలియాతో మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ఆడనుంది. అఫ్గానిస్తాన్ తో షెడ్యూల్ ఇంకా ఖరారు కాకపోయినా సెప్టెంబర్ లోనే ఈ సిరీస్ ఉండనుంది. వరల్డ్ కప్ తర్వాత భారత్ లో పర్యటించేందుకు న్యూజిలాండ్, బంగ్లాదేశ్ లు రానున్నాయి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial