ICC No.1 T20 Bowler Varun Chakravarthy: పడి లేచిన కెరటం వరుణ్ చక్రవర్తి.. నాడు యూఏఈ గడ్డపై అవమానం.. నేడు అదే గడ్డపై నెం.1 కిరీటం.. చాంపియన్స్ ట్రోఫీ టీమ్ లోనూ మెంబర్ గా..
ఐసీసీ నెం.1 బౌలర్ గా నిలిచిన వరుణ్ చక్రవర్తి రికార్డులకెక్కాడు. గతంలో ఇద్దరు భారత బౌలర్లు బుమ్రా, బిష్ణోయ్ మాత్రమే ఈ ఘనత సాధించారు. తాజాగా ఈ జాబితాలోనిక వరుణ్ కూడా చేరాడు.

Asia Cup 2025 Team India Latest News : నవ్వినా నాపచేనే పండు అన్న సామెత మాదిరిగా భారత ఏస్ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తానం ఆసక్తికరంగా సాగింది. నాలుగేళ్ల కిందట యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచకప్ 2021 మ్యాచ్ లో పాకిస్థాన్ చేతిలో ఘోర ప్రదర్శన చేసి జట్టు నుంచి ఉద్వాసనకు గురైన వరుణ్.. ఆ తర్వాత మూడేళ్ల పాటు అంతర్జాతీయ క్రికెట్ కు ఆడలేకపోయాడు. అయితే గత ఏడాది నవంబర్ నుంచి అంతర్జాతీయ టీ20ల్లోకి రీ ఎంట్రీ ఇచ్చి సత్తా చాటుతున్నాడు. కేవలం పది నెలల్లోనే ఈ ఫార్మాట్లో నెం.1 స్తానాన్ని దక్కించుకున్నాడు. తాజా ఐసీసీ టీ20 బౌలర్ల ర్యాంకింగ్స్ లో తను నెంబర్ వన్ పొజిషన్ కు చేరుకున్నాడు. దీంతో ఈ ఘనత సాధించి మూడో భారత బౌలర్ గా రికార్డులకెక్కాడు. గతంలో స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా, లెగ్ స్పిన్నర్ రవి బిష్ణోయ్ మాత్రమే ఈ శిఖర స్తానాన్ని చేరుకుని, చరిత్ర సృష్టించారు. తాజాగా ఆ జాబితాలోకి వరుణ్ చేరుకోవడం పట్ల భారత అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు.
గల్లీ బౌలరని..
నిజానికి 2021 ప్రపంచకప్ లో తొలిసారి పాక్ చేతిలో ఇండియా ఓడిపోయింది. ఆ మ్యాచ్ లో ఏకంగా పది వికెట్ల తేడాతో ఇండియా పరాజయం పాలై, ఆ తర్వాత ఏకంగా టోర్నీ నుంచే లీగ్ దశలో నిష్క్రమించింది. ఇక ఈ మ్యాచ్ లో బౌలింగ్ చేసిన వరుణ్ పై చాలా విమర్శలు వచ్చాయి. మిస్టరీ స్పిన్నర్ గా బరిలోకి దిగిన వరుణ్ ను పాక్ ప్లేయర్లు అలవోకగా ఎదుర్కొన్నారు. దీంతో తన కంటే తమ గల్లీ బౌలర్లు బాగా బౌలింగ్ చేస్తారని, తను మిస్టరీ స్పిన్నర్ అనడం జోక్ గా ఉందని పలువురు పాక్ మాజీ లు వేళాకోళం చేశారు. అయితే అప్పటి అవమానం నుంచి బౌన్స్ బ్యాక్ అయిన వరుణ్.. సైలెంట్ గా సత్తా చాటాడు.
సౌతాఫ్రికా సిరీస్ తో వెలుగులోకి..
గతేడాది నవంబర్ లో సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో వరుణ్ ఆకట్టుకున్నాడు. అద్బుతమైన ఆటతీరుతో ఆ సిరీస్ లో మెరిశాడు. ఆ తర్వాత ఇంగ్లాండ్ తో జరిగిన టీ20ల్లోనూ సత్తా చాటాడు. ఫైవ్ వికెట్ హాల్ ప్రదర్శన తోనూ తన సత్తా చాటాడు. ఆ తర్వాత ఏకంగా వన్డే జట్టులోకి వచ్చి, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ సాధించిన భారత జట్టులో సభ్యునిగా కీలకంగా మారాడు. ఈ క్రమంలో టీ20, వన్డే జట్టులో తన స్తానాన్ని పదిలం చేసుకున్నాడు. తాజాగా యూఏఈలోనే జరుగుతున్న ఆసియా కప్ లో తొలి రెండు మ్యాచ్ ల్లో రెండు వికెట్లు తీసి, నెం.1 బౌలర్ హోదాను దక్కించుకున్నాడు. నాడు యూఏఈలో హ్యుమిలేషన్ కు గురైన వరుణ్.. తాజాగా అదే గడ్డపై అటు చాంపియన్స్ ట్రోఫీ, ఇటు నెం.1 బౌలర్ కిరీటాలను ధరించాడు. రాబోయే రోజుల్లో టీమిండియా ఆడే మూడు ఫార్మాట్లలోనూ తను సభ్యునిగా కావాలని భారత అభిమానులు కోరుకుంటున్నారు.




















