Ind Vs Eng 3rd Odi Updates: టీమిండియా ప్లేయింగ్ లెవన్ ఇదే.. జట్టులో 3 మార్పులు..!! స్టార్ ప్లేయర్ ఔట్!
నెం.5లో వరుసగా ఆడుతున్న అక్షర్ పటేల్ కు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చే అవకాశముంది. టీ20 సిరీస్ నుంచి తను రెగ్యులర్ గా ఆడుతున్నాడు. అతని స్థానంలో కుల్దీప్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది.

Team India News: ఇంగ్లాండ్ తో బుధవారం ప్రారంభమయ్యే మూడో వన్డేలో భారత్ మూడు మార్పులు చేసే అవకాశముంది. ఇప్పటికే సిరీస్ ను 2-0తో గెలుచుకుని ఉండటంతో ఈ మ్యాచ్ లో రిజర్వ్ ఆటగాళ్లను ప్రయత్నించే అవకాశముంది. వచ్చేవారంలో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభమవుతున్న నేపథ్యంలో స్క్వాడ్లోని మిగతా ఆటగాళ్ల సన్నద్ధతను పరీక్షించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగే ఈ వన్డేలో భారత బ్యాటింగ్ విషయానికొస్తే ఓపెనర్లుగా భారత వన్డే, టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ, శుభమాన్ గిల్ ఆడతారు. గిల్ సూపర్ ఫామ్ లో ఉండగా, గత మ్యాచ్ లో విధ్వంసక సెంచరీతో రోహిత్ ఫామ్ లోకి వచ్చాడు. మూడో నెంబర్లో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఆడతాడు. గత కొంతకాలం ఫామ్ కోల్పోయి విమర్శల పాలు అవుతున్న కోహ్లీ.. ఈ మ్యాచ్ లో రాణించాలని పట్లుదలగా ఉన్నాడు. విమర్శకులకు సమాధానం చెప్పడంతోపాటు మెగాటోర్నీకి ఆత్మ విశ్వాసంతో వెళ్లేందుకు ఈ మ్యాచ్ ను ఉపయోగించుకోవాలని భావిస్తున్నాడు. ఇక నెం.4లో శ్రేయస్ అయ్యర్ సత్తా చాటుతున్నాడు. తన ఫామ్ అలాగే కొనసాగించాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
జట్టులోకి పంత్..
ఇక నెం.5లో వరుసగా ఆడుతున్న ఆల్ రౌండర్ అక్షర్ పటేల్ కు ఈ మ్యాచ్ లో రెస్ట్ ఇచ్చే అవకాశముంది. టీ20 సిరీస్ నుంచి తను రెగ్యులర్ గా ఆడుతున్నాడు. తను సూపర్ ఫామ్ లోనే ఉండటంతో తనకు విశ్రాంతినిచ్చి, అతని స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ను జట్టులోకి తీసుకునే అవకాశముంది. మెగాటోర్నీకి ముందు తన సత్తా చాటడం తప్పనిసరి. ఇక తొలి రెండు వన్డేల్లో కేవలం 12 పరుగులు మాత్రమే చేసి విఫలమైన కేఎల్ రాహుల్ స్థానంలో వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ ను జట్టులోకి తీసుకునే చాన్స్ ఉంది. మెగాటోర్నీకి ముందు తనకు మ్యాచ్ ప్రాక్టీస్ అవసరమని టీమిండియా భావిస్తోంది. ఆల్ రౌండర్ల కోటాలో హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా బరిలోకి దిగుతారు. వరుసగా ఆడుతున్న పాండ్యాను తప్పించి అతని స్థానంలో రాహుల్ ను ఆడించే అవకాశాలు కూడా కొట్టిపారేయ్యలేం.
షమీ రాణించాల్సిందే..
రీ ఎంట్రీ తర్వాత అంతంతమాత్రంగా రాణిస్తున్న వెటరన్ పేసర్ మహ్మద్ షమీ ఈ మ్యాచ్ లో గాడిన పడాలని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది. మరో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా దూరమైన వేళ, షమీ రాణించడం తప్పనిసరి. షమీకి జోడీగా అర్షదీప్ సింగ్ కు పరీక్షించే అవకాశముంది. లెఫ్టార్మ్ పేసర్ కావడంతో తను జట్టుకు వైవిధ్యాన్ని తీసుకొస్తాడు. దీంతో హర్షిత్ రాణా రిజర్వ్ కు పరిమితమవుతాడు. కుల్దీప్ తో కలిసి మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి స్పిన్ బాధ్యతలు మోస్తాడు. ఈ మ్యాచ్ లో గెలిచి, మరింత ఆత్మవిశ్వాసంతో మెగాటోర్నీలో అడుగు పెట్టాలని టీమిండియా భావిస్తోంది.




















