SL vs AFG, Asia Cup: సంచలనంతో మొదలైన ఆసియా కప్ - లంకకు ఆఫ్ఘన్ల షాక్!
ఆసియా కప్ 2022లో శ్రీలంక ఆఫ్ఘన్ చేతిలో ఘోర పరాజయం పాలైంది.
దుబాయ్‌లో జరుగుతున్న టీ20 ఆసియా కప్ సంచలనంతో ప్రారంభం అయింది. మొదటి మ్యాచ్‌లో శ్రీలంకను ఆఫ్ఘనిస్తాన్ 8 వికెట్ల తేడాతో చిత్తుగా ఓడించింది. మొదట బ్యాటింగ్ చేసిన శ్రీలంక 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ కాగా... అనంతరం ఆఫ్ఘనిస్తాన్ కేవలం 10.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మూడు వికెట్లు తీసిన ఆఫ్ఘన్ బౌలర్ ఫరూకీకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంకకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం ఐదు పరుగులకే టాప్ ఆర్డర్ మొత్తం పెవిలియన్‌కు చేరింది. పతుం నిశ్శంక (3: 7 బంతుల్లో), కుశాల్ మెండిస్ (2: 4 బంతుల్లో), అసలంక (0: 1 బంతి) ముగ్గురూ ఘోరంగా విఫలం అయ్యారు.
జట్టు మొత్తం మీద కరుణరత్నే (31: 38 బంతుల్లో, మూడు ఫోర్లు, ఒక సిక్సర్), భానుక రాజపక్స (38: 29 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్), గుణతిలక (17: 17 బంతుల్లో, మూడు ఫోర్లు) మాత్రమే రెండంకెల స్కోరు చేయగలిగారు. వీరు ముగ్గురి తర్వాత అత్యధిక స్కోరు ఐదు పరుగులు మాత్రమే. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు శ్రీలంక బ్యాటర్లు ఎంత ఘోరంగా ఆడారో. ఆఫ్ఘన్ బౌలర్లు వరుస వికెట్లు తీయడంతో శ్రీలంక 19.1 ఓవర్లలో 105 పరుగులకు ఆలౌట్ అయింది. ఫజల్‌హక్ ఫరూకీ మూడు వికెట్లు పడగొట్టగా, ముజీబ్, నబీ రెండేసి వికెట్లు, నవీన్ ఉల్ హక్ ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం ఆఫ్ఘనిస్తాన్ వీలైనంత త్వరగా మ్యాచ్ ముగించాలని నిర్ణయించుకుంది. ఓపెనర్లు రహమనుల్లా గుర్బాజ్ (40: 18 బంతుల్లో, మూడు ఫోర్లు, నాలుగు సిక్సర్లు), హజ్రతుల్లా జజాయ్ (37 నాటౌట్: 28 బంతుల్లో, ఐదు ఫోర్లు, ఒక సిక్సర్) పవర్ ప్లేలో రాణించడంతో ఆఫ్ఘన్ ఆరు ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 83 పరుగులు సాధించగలిగింది. అనంతరం హజ్రతుల్లా జజాయ్, వన్ డౌన్ బ్యాటర్ ఇబ్రహీం జద్రాన్ (15: 13 బంతుల్లో, రెండు ఫోర్లు) అవుటైనా ఆఫ్ఘన్ 10.1 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది.
View this post on Instagram