Rohit Captaincy: రోహిత్ శర్మ సేఫ్- అప్పటి వరకు తనే కెప్టెన్..! హిట్ మ్యాన్ వారసుని వేటలో బీసీసీఐ
అటు కెప్టెన్ గాను ఇటు బ్యాటర్ గాను రోహిత్ శర్మ తీవ్ర విమర్శల పాలయ్యాడు. సిడ్నీలో టెస్టులో స్వచ్చందంగా జట్టు నుంచి వైదొలిగి, బెంచ్ కే పరిమితమైన దుస్థితి నెలకొంది. రోహిత్ వారసుని వేటలో బోర్డు ఉంది.

Rohit Vs Bumrah: భారత టెస్టు, వన్డే కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్య బాధ్యతల నుంచి తప్పించేందుకు రంగం సిద్ధమైంది. శనివారం బీసీసీఐతో జరిగిన మీటింగి్ లో దీనిపై వాడివేడి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇటీవల సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో క్లీన్ స్వీ్ కు గురికావడం, అలాగే ఆసీస్ టూర్లో 1-3తో టెస్టు సిరీస్ ఓడిపోవడంపై చర్చ జరిగినట్లు సమాచారం. అలాగే బ్యాటర్ గా రోహిత్ విఫలమవుతుండటంపై కూడా ప్రశ్నలు ఎదురయ్యాయని తెలుస్తోంది. అయితే కెప్టెన్సీపై మాత్రం బోర్డుకు రోహిత్ ఒక సూచన చేశాడని తెలుస్తోంది. కావాలంటే తాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి వైదొలుగుతానని అన్నట్లు తెలిసింది. అయితే రోహిత్ స్థానాన్ని భర్తీ చేసే ప్లేయర్ కోసం బోర్డు కొన్ని పేర్లను పరిశీలిస్తోందని తెలుస్తోంది. నిజానికి రోహిత్ అబ్సెన్సీలో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా సారథ్యం వహించాడు. అయితే అతని విషయంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి.
గాయాలతో సతమతం..
ముఖ్యంగా బుమ్రా భారత ప్రధాన పేసర్. మందుండి బౌలింగ్ దళాన్ని నడిపించేంది అతనే. అయితే కెప్టెన్ గా అతనిపై ఒత్తిడి పెట్టకూడదని మహ్మద్ కైఫ్ లాంటి మాజీలు ఇప్పటికే గట్టిగా చెబుతున్నారు. ఇక గాయాలతో తను అందుబాటులో లేకుంటే పరిస్థితి ఏంటని బోర్డులో కొన్నిప్రశ్నలు ఉదయిస్తున్నాయి. వెన్నునొప్పి కారణంగా గతంలో కొన్ని నెలలపాటు జట్టుకు బుమ్రా దూరమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో కూడా వెన్ను నొప్పితోనే తను సతమతం అవుతున్నాడు. కీలకమైన ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తను బౌలింగ్ చేయక పోవడంతోనే భారత్ ఓడిపోయిందన్న విమర్శలు ఉన్నాయి. ఈ గాయం ప్రభావం వచ్చేనెలలో జరిగే చాంపియన్స్ ట్రోఫీలో కూడా పడనుంది. టోర్నీ తొలి దశ లేదా మొత్తం టోర్నీకే తను దూరమయ్యే పరిస్థితి నెలకొంది. అలాంటి ఆటగాడికి జట్టు పగ్గాలు అప్పగించడంపై బోర్డు మల్లగుల్లాలు పడుతుంది.
అప్పటి వరకు రోహితే కెప్టెన్..
తాజా పరిస్థితిని బట్టి వచ్చే జూన్ లో ప్రారంభమయ్యే ఇంగ్లాండ్ పర్యటన వరకు రోహిత్ శర్మనే భారత వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్ గా వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా తొలుత ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్, ఆ తర్వాత చాంపియన్స్ ట్రోఫీ వరకు హిట్ మ్యాన్ ను కొనసాగించినట్లయితే ఆ తర్వాత ఎలాగూ ఐపీఎల్ ప్రారంభమవుతుంది. దీంతో మే నెల చివరి వరకు భారత జట్టుకు అంతర్జాతీయ మ్యాచ్ లు ఉండవు. తిరిగి జూన్ లోనే ఇంగ్లాండ్ తో ఐదు టెస్టుల సిరీస్ ప్రారంభమవుతుంది. ఈలోగా రోహిత్ వారసుడిని వెతకడానికి బోర్డుకు సమయం దొరకుతుందని ఆలోచనలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ఇక ఐదు టెస్టుల సిరీస్ మొత్తానికి బుమ్రా కెప్టెన్సీ వహించే అవకాశం ఉండదని, గాయం కారణంగా తను దూరమైతే అది జట్టుపై భారం పెంచుతుందని బోర్డు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలో టెస్టు జట్టుకు నూతన కెప్టెన్ ను వెతికే పనిలో బోర్డు వర్గాలు ఉన్నాయని సమాచారం.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

