Bumrah Vs BCCI: ఇదేం వాడకం బాబోయ్.. బుమ్రా గాయానికి కారణం బీసీసీనే! మెగాటోర్నీ ముందు ఇలా చేస్తారా అని ఫ్యాన్స్ ఫైర్
బీజీటీలో బుమ్రా అత్యద్భుతంగా రాణించాడు. 32 వికెట్లతో లీడింగ్ వికెట్ స్కోరర్ గా నిలిచాడు. ఆసీస్ గడ్డపై ఒక సిరీస్ లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గాను నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ద టోర్నీతోను మెరిశాడు.

Bumrah Injury Update: బోర్డర్-గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)లో స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా గాయపడిని సంగతి తెలిసిందే. సిడ్నీలో జరిగిన ఐదో టెస్టులోతను రెండో ఇన్నింగ్స్ లోనూ బౌలింగ్ చేయలేదు. ఇప్పుడు అతని పరిస్థితి కాస్త జటిలంగా మారిందని తెలుస్తోంది. గాయం కారణంగా ఏకంగా చాంపియన్స్ ట్రోపీ ఆరంభ మ్యాచ్ లకు తను అందుబాటులో ఉండే పరిస్థితి కనిపించడం లేదు. వెన్ను నొప్పి తిరగబెట్టడంతో బుమ్రా ఇబ్బంది పడుతున్న సంగతి తెలిసిందే. బుమ్రా కోసమే ఆదివారం ప్రకటించాల్సిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ జట్టును వాయిదా వేయాలని కూడా బీసీసీఐ ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఐసీసీతో సంప్రదింపులు జరుపుతోంది. అయితే బుమ్రాకు మూడు వారాలకు మించి విశ్రాంతి అవసరమయ్యేలా ఉన్నట్ల తెలుస్తోంది. త్వరలోనే తను బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీకి పునారావసం కోసం వెళతాడని, అక్కడి నుంచే బోర్డు మెడికల్ టీమ్ తనను క్లీన్ గా అబ్జర్వ్ చేస్తోందని సమాచారం.
చాంపియన్స్ ట్రోఫీకి దూరం..
బుమ్రా గాయంపై ఇప్పటి వరకు బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. అయితే తాజా అప్డేట్ల బట్టి బుమ్రాకు అయినా గాయం కాస్త పెద్దిదిగానే ఉన్నట్లు కనిపిస్తోంది. వెన్నులో ఫ్రాక్చర్ లేకపోయినప్పటికీ, స్వెల్లింగ్ ఉందని సమాచారం. దీని కోసం తను కచ్చితంగా నిర్ణీత సమయం పాటు విశ్రాంతి తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే పూర్తి ఫిట్ అయిన తర్వాత కొన్ని ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో కూడా బుమ్రాను పరిక్షించే అవకాశముంది. ఆ తర్వాతే తను జట్టుకు అందుబాటులోకి వస్తాడని తెలుస్తోంది.
ఇక మెగాటోర్నీలో భారత్ మ్యాచ్ లు దుబాయ్ లోజరుగుతాయి. వచ్చేనెల 20న బంగ్లాదేశ్ తో తొలిమ్యాచ్, 23న పాక్ తో, మార్చి 2న న్యూజిలాండ్ తో ఆఖరి లీగ్ మ్యాచ్ ఆడుతుంది. నాలుగు, ఐదు తేదీల్లో సెమీ ఫైనల్ మ్యాచ్ లు జరుగుతాయి. అయితే కివీస్ తో మ్యాచ్ వరకు బుమ్రా అందుబాటులోకి వస్తాడని టీమ్ మేనేజ్మెంట్ భావిస్తోంది.
అతి వాడకమే కారణమా..?
బుమ్రా గాయం వెనకాల బోర్డు దురాశ ఉందని అభిమానులు ఫైరవుతున్నారు. కీలకమైన చాంపియన్స్ ట్రోఫీని ముందుకు పెట్టుకుని ఆసీస్ తో 5 టెస్టుల సిరీస్ ఆడాల్సిన అవసరం ఏముందని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇక వరుసగా ఐదు టెస్టుల్లోనూ బుమ్రా ఆడాడని, అతనికి సహకారం అందించే బౌలర్లు లేకపోవడంతో మొత్తం భారం అతనిపైనే పడినట్లు మండిపడుతున్నారు. ఈ సిరీస్ లో ఏకంగా 150కి పైగా ఓవర్లను బుమ్రా వేశాడు. గతంలో వెన్ను గాయంతో దూరమైన బుమ్రా చేత ఇన్ని ఓవర్లు వేయించడమే ప్రస్తుత దుస్థితికి కారణమని తెలుస్తోంది.
బుమ్రాకు బ్యాకప్ గా ఒక్క పేసర్ ను కూడా టీమ్ మేనేజ్మెంట్ తయారు చేయలేక పోయిందని ఫ్యాన్స్ ఫైరవుతున్నారు. ఏదేమైనా 12 ఏళ్ల తర్వాత చాంపియన్స్ టోర్నీని గెలుద్దామని భావించిన భారత్ కు బుమ్రా గాయం రూపంలో షాక్ తగిలిందనే చెప్పుకోవచ్చు. గుడ్డిలో మెల్లలాగా వెటరన్ పేసర్ మహ్మద్ షమీ జట్టులోకి చేరడం కాస్త సానుకూలాంశం.
Also Read: Ind Vs Eng Series: వన్డే జట్టు నుంచి జడేజా ఔట్- అతని ప్లేస్ కోసం పోటీపడుతున్న ఇద్దరు ప్లేయర్లు




















