Viral Video: గంభీర్ తో రోహిత్ తో మంతనాలు.. మ్యాచ్ అనంతరం సుదీర్ఘ సంభాషణ
Viral Video:మ్యాచ్ ముగిశాక రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ దీర్ఘంగా మాట్లాడుకుంటూ కనిపించారు. గంభీర్ ఏదో అడుగుతూ సీరియస్ గా హిట్ మ్యాన్ వైపు చూస్తుంటే, రోహిత్ అతనికి వివరణ ఇచ్చారు.

Rohit Vs Gambhir: ఇంగ్లాండ్ తో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్ లో తొలి మ్యాచ్ లో గెలిచి భారత్ శుభారంభం చేసిన సంగతి తెలిసిందే. నాగపూర్ లో జరిగిన ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్లతో గెలిచింది. శుభమాన్ గిల్, శ్రేయస్ అయ్యర్, అక్షర్ పటేల్ అర్థ సెంచరీలతో సత్తా చాటడంతో సునాయాసంగా ఇండియా విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గెలవడంతో ఈనెల 19 నుంచి జరిగే ఐసీసీ చాంపియన్స్ టోర్నీ సన్నాహకాలను మెరుగ్గా ప్రారంభించినట్లు అయింది. ఇక మ్యాచ్ ముగిశాక భారత కెప్టెన్ రోహిత్ శర్మ, హెడ్ కోచ్ గౌతం గంభీర్ ఏదో దీర్ఘంగా మాట్లాడుకుంటూ కనిపించారు. గంభీర్ ఏదో అడుగుతూ సీరియస్ గా హిట్ మ్యాన్ వైపు చూస్తుంటే, రోహిత్ అతనికి వివరణ ఇస్తున్నట్లు కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఈ సంఘటనకు సంబంధించిన క్లిప్పింగ్ వైరలైంది. ఈ వీడియోపై తమదైన శైలిలో కామెంట్లు పెడుతూ, లైకులు, షేర్లు చేస్తున్నారు.
— Nihari Korma (@NihariVsKorma) February 6, 2025
సుదీర్ఘ మంతనాలు..
ఇక 51 సెకండ్లపాటు ఉన్న ఈ వీడియలో గంభీర్, రోహిత్ ఏం మాట్లాడారో అర్థం కావడం లేదు. కానీ, మ్యాచ్ కు సంబంధించిన విషయాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ఇక ఎన్నో ఆశలతో నాగపూర్లోకి అడుగు పెట్టిన అభిమానులను రోహిత్ మరోసారి నిరాశ పర్చాడు. కేవలం రెండు పరుగులు మాత్రమే చేసి పెవిలియన్ కు చేరాడు. గతేడాది ద్వితీయార్థం నుంచి బంగ్లాదేశ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలతో జరిగిన టెస్టు సిరీస్ లలో రోహిత్ విఫలమయ్యాడు. ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీ వరకైనా గాడిన పడతాడని ఆశించిన అభిమానులకు చుక్కెదురైంది. ఈ సిరీస్ లో తను సత్తా చాటడం అత్యవసరం. లేకపోతే చాలా ఒత్తిడితో మెగాటోర్నీలో బరిలోకి దిగాల్సి ఉంటుంది. అక్కడా విఫలమైతే తన అంతర్జాతీయ కెరీర్ కు ఎండ్ పడే అవకాశముంది.
వ్యూహంతోనే అక్షర్ ను ముందు పంపించాం..
ప్రత్యేకమైన వ్యూహంతోనే అక్షర్ పటేల్ ను బ్యాటింగ్ ఆర్డర్లో ముందు పంపించామని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు. స్పిన్నర్లు బౌలింగ్ చేస్తున్న వేళ ఇద్దరు లెఫ్టాండర్లు ఉండాలని భావించామని, అందుకే అక్షర్ ను ముందు పంపించామని పేర్కొన్నాడు. తనకు అప్పగించిన పనిని అద్భుతంగా అక్షర్ పూర్తి చేశాడని, అయ్యర్ వికెట్ కోల్పోయి జట్టు ఒత్తిడిలో ఉన్న టైంలో తను అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. గిల్, అక్షర్ కలిసి సెంచరీ భాగస్వామ్యంతో జట్టు విజయంలో కీలకపాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఇక చాలాకాలం తర్వాత వన్డేలు ఆడామని, తొలి మ్యాచ్ లోనూ శుభారంభ దక్కడంపై రోహిత్ ఆనందం వ్యక్తం చేశాడు. ఆరంభంలో ఇంగ్లాండ్ జోరుమీదున్నప్పటికీ, తాము పుంజుకున్నామని పేర్కొన్నాడు. ఇక చాంపియన్స్ ట్రోఫీకి వెళ్లడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఇదే తరహా ఆటతీరును ప్రదర్శించాలని సహచరులకు సూచించాడు. తొలి వన్డేలో గెలిచిన భారత్ 1-0తో ఆధిక్యంలో నిలిచింది. రెండో వన్డే కటక్ వేదికగా ఆదివారం జరుగుతుంది.




















