IPL 2024: ప్రతికూల వాతావరణం, గాల్లో చక్కర్లు కొట్టిన కోల్‌కతా ఆటగాళ్ళు
Flight Scare for Kolkata Knight Riders: ప్రతికూల వాతావరణం కారణంగా కోల్‌కతా ఆటగాళ్లు ప్రయాణిస్తున్న ఛార్టర్డ్ ఫ్లయిట్ ఆకాశంలో చక్కర్లు కొట్టింది. తొలుత గువాహటి, తర్వాత వారణాసికి వెళ్ళింది.
Flight Scare for Kolkata Knight Riders: అననుకూల వాతావరణం కోల్‌కతా(Kolkata Knight Riders) జట్టును ఇబ్బందులపాలు చేసింది. ఆదివారం లక్నోలోని ఎకానా స్టేడియంలో జరిగిన ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్ (LSG)పై భారీ విజయం సాధించిన తర్వాత శ్రేయాస్ అయ్యర్ టీం మే 11న ముంబయి ఇండియన్స్‌తో ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ ఆడనుంది. ఇందుకోసం కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టు సోమవారం సాయంత్రం లఖ్‌నవూ నుంచి 5.45 గంటలకు ఛార్టర్డ్ విమానంలో కోల్‌కతాకు బయలుదేరింది. అయితే వాతావరణం అనుకూలించని కారణంగా విమానాన్ని రెండుసార్లు దారి మళ్లించాల్సి వచ్చింది.ముందు గువాహటి , ఆ తర్వాత వారణాసికి విమానాన్ని మళ్లించారు. దీంతో ఆ జట్టు ఆటగాళ్లు ఇబ్బందులు పడ్డారు. ఇందుకు సంబంధించిన వివరాలను కోల్‌కతా జట్టు తమ ఎక్స్ (X)ఖాతాలో పంచుకుంది.
Update at 3:00 AM: KKR team would be checking into Varanasi hotel for overnight stay. Return flight to Kolkata TBD on Tuesday (7 May) afternoon. Stay safe, Kolkata 💜
— KolkataKnightRiders (@KKRiders) May 6, 2024
5.45 కు బయలుదేరిన విమానం 7,25 గంటలకు ల్యాండ్ అవ్వాల్సి ఉండగా.. కోల్‌కతాలో కురుస్తున్న కుండపోత వర్షాలతో అక్కడ ప్రతికూల వాతావరణం ఏర్పడింది. దీంతో విమానాన్ని గువాహటి కి దారి మళ్లించారు. అక్కడ కాసేపటి తరువాత విమానానికి క్లియరెన్స్ రావటంతో ఫ్లయిట్ మరోసారి కోల్‌కతాకు బయలుదేరింది. అయితే ఇప్పుడు కూడా వాతావరణం అనుకూలించకపోవడంతో ఈ సారి రాత్రి 1.30 నిమిషాల సమయంలో వారణాశికి దారి మళ్ళించారు. ఆటగాళ్ళు రాత్రి అక్కడే బస చేశారు. మంగళవారం మధ్యాహ్నం ఈ ఫ్లయిట్ మరోసారి కోల్‌కతా కు బయలుదేరనుంది. ఈ విషయాలను కోల్‌కతా జట్టు తెల్లవారుజామున 3 గంటలకు తన అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్ లో పోస్ట్ చేసింది. ఇక ఆట విషయానికి వస్తే శ్రేయాస్ అయ్యర్ నేతృత్వం లోని కోల్‌కతా నైట్‌రైడర్స్ అదరగొడుతోంది. లక్నోతో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా 98 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటివరకు 11 మ్యాచ్‌లు ఆడి 8 విజయాలతో 16 పాయింట్లతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో నిలిచింది. ఆ జట్టు దాదాపు ప్లే ఆఫ్స్‌కు చేరినట్టే. కోల్‍కతా నైట్‍రైడర్స్ ఆల్‍రౌండర్, వెస్టిండీస్ స్టార్ సునీల్ నరైన్ ఈ సీజన్‍లో మరోసారి బ్యాట్‍తో విధ్వంసం చేశాడు. ఈ మ్యాచ్‍లో 39 బంతుల్లో 81 పరుగులతో మెరుపులు మెరిపించాడు. 6 ఫోర్లు, ఏకంగా 7 సిక్స్‌లు బాదేశాడు. లక్నో సూపర్ జెయింట్స్ బౌలర్లకు నరైన్ చుక్కలు చూపాడు. శ్రేయస్ అయ్యర్ , రమణ్ దీప్ సింగ్ ధాటిగా ఆడటంతో మంచి విజయం దక్కింది.