Blockbuster Bumrah: బుమ్రా వన్ మేన్ షో.. ఆసీస్ కు చుక్కలు చూపిన స్టార్ పేసర్.. బీజీటీ కాదు బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా సిరీస్
తన అద్భుతమైన బౌలింగ్ తో ఇటు భారత అభిమానులనే కాకుండా, అటు ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ ప్రేమికులను కూడా బుమ్రా అలరించాడు. చివరి టెస్టులో గాయం కారణంగా తను దూరమవడంతో, చాలా మంది ఫ్యాన్స్ నిరాశ పడ్డారు.
Ind Vs Aus Test Series Updates: భారత దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఆడుతున్న రోజుల్లో ఒక అప ప్రథ ఉండేది. జట్టంతా ఒకే ఆటగాడిపై ఆధార పడుతుండేదని, అతను ఔటయితే మ్యాచ్ పోయినట్లేనని ఇలా ప్రచారం జరిగేంది. నిజానికి ఇది ముమ్మాటికి వాస్తవం. చాలా సార్లు సచిన్ ఔటైన తర్వాత టీవీ కట్టేసే వాళ్లమని నిన్నటి తరం క్రికెట్ ప్రేమికులు చెబుతుండేవారు. సచిన్ హయం ముగిశాక ఒకే ఆటగానిపై ఆధారపడి జట్టు మనుగడ సాగించే రోజులకు కాలం చెల్లిందని ఇన్నాళ్లు అనుకున్నారు. అయితే మళ్లీ అలాంటి దుస్థితిలోకి టీమిండియా వెళ్లిందని ఆస్ట్రేలియా సిరీస్ చూస్తే అర్థమవుతుంది. ఆ ఒక్క ఆటగాడు స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా. తన బౌలింగ్ తో జట్టుకే వెయిటేజీ తీసుకొచ్చిన తిరుగులేని ప్లేయర్ బుమ్రా అనడంలో సందేహం లేదు.
5⃣ matches.
— BCCI (@BCCI) January 5, 2025
3⃣2⃣ Wickets 🫡
Incredible spells ⚡️#TeamIndia Captain Jasprit Bumrah becomes the Player of the series 👏👏#AUSvIND | @Jaspritbumrah93 pic.twitter.com/vNzPsmf4pv
బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా..
నిజానికి ఈ సిరీస్ ను బోర్డర్ -గావస్కర్ ట్రోఫీ అని వర్ణించడం కంటే కూడా బుమ్రా వర్సెస్ ఆస్ట్రేలియా అంటే బాగుంటుందేమో. తను అంతగా ప్రభావం చూపించాడు. బహుశా ఒక బౌలర్ గురించి ఆసీస్ ఇంతగా ఎప్పుడూ ఆలోచించలేదేమో. బుమ్రా బరిలోకి దిగుతున్నాడంటే చాలు ప్రత్యర్థి ఆటగాళ్ల మానసిక స్థితి మారిపోయేది. ఉస్మాన్ ఖవాజా ఈటోర్నీలో ఆరుసార్లు బుమ్రాకే ఔటయ్యడంటేనే తెలుస్తోంది. అతడిని బుమ్రా ఎంతగా ఇబ్బంది పెట్టాడో అని. అలాగే ఈ సిరీస్ లో 32 వికెట్లు తీసి ఎవరికీ అందనంత ఎత్తులో నిలిచాడు బుమ్రా. కేవలం 13 సగటుతో ఈ వికెట్లు తీశాడు. ఇక రెండో స్థానంలో ఉన్న ఆసీస్ కెప్టెన్ పాట్ కమిన్స్ 21 సగటుతో 25 వికెట్లు తీశాడు. సొంతగడ్డపై అత్యంత అనుభవం గల కమిన్స్ కంటే కూడా బుమ్రానే ఈ సిరీస్ లో సత్తా చాటడం విశేషం. ఇక ఐదో టెస్టు రెండో ఇన్నింగ్స్ లో బుమ్రా బౌలింగ్ చేయలేదని తెలిశాక తమ డ్రెస్సింగ్ రూంలో పండుగ చేసుకున్నామని ఆసీస్ బ్యాటర్ బహిరంగంగానే వెల్లడించాడు. దీనిని బట్టి తెలుస్తోంది, ఆసీస్ ప్లేయర్లను బుమ్రా ఎంతగా ప్రభావితం చేశాడో అని చెప్పవచ్చు.
రికార్డుల జాతర..
ఇక ఐదు టెస్టుల బీజీటీలో బుమ్రా పలు రికార్డులు బద్దలు కొట్టాడు. ఆసీస్ గడ్డపై అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్ గా బుమ్రా నిలిచాడు. 32 వికెట్లతో తను ఈ రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక బీజీటీలో అత్యధిక వికెట్ల రికార్డును సమం చేశాడు. ఎప్పుడో 23 ఏళ్ల కిందట హర్బజన్ సింగ్ నెలకొల్పిన ఈ రికార్డును ఇన్నాళ్లకు బుమ్రా రూపంలో ఒక ప్లేయర్ సమం చేయగలిగాడు. అలాగే కెరీర్లో అత్యంత తక్కువ యావరేజీతో 200 వికెట్లు తీసిన పేసర్ గా నిలిచాడు. కేవలం 19 సగటుతో తను 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కేవలం 44వ టెస్టులోనే తను ఈ ఘనత సాధించాడు. ఈ ఫీట్ సాధించిన రెండో భారత బౌలర్ బుమ్రా కావడం విశేషం. అలాగే ఈ సిరీస్ లోనే 907 ఎలో రేటింగ్ పాయింట్లను సాధించి, అత్యధిక రేటింగ్ సాధించిన భారత బౌలర్ గా నిలిచాడు. అంతకుముందు రవిచంద్రన్ అశ్విన్ (904 పాయింట్ల) పేరిట ఈ రికార్డు ఉండేది. అయితే ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్లో పేసర్ గా వైవిధ్యమైన బౌలింగ్ యాక్షన్ తో ఇంతటి ఘనత సాధించిన బుమ్రాకు నిజంగా హేట్సాఫ్. అయితే చివరి టెస్టు రెండో ఇన్నింగ్స్ లో తను అందుబాటులో ఉంటే ఫలితం వేరే ఉండేదని అభిమానులు భావిస్తున్నారు. కచ్చితంగా పోటీ తీవ్రంగా ఉండేదని, బుమ్రా బౌలింగ్ కారణంగా ఆసీస్ ఓడిపోయినా ఆశ్చర్యపోనవసరం లేకుండేదని అభివర్ణిస్తున్నారు. కానీ, ఏం చేస్తాం, అసలైన సమయంలో గాయం బుమ్రాను దెబ్బ కొట్టింది. ఇంకా పలు రికార్డులను తన ఖాతాలో వేసుకోవడంతోపాటు సిరీస్ ను కూడా సమం చేసే వాడేమో.. ఏదేమైనా ఒకే ఆటగాడిపై ఆధారపడితే నిరాశజనక ఫలితాలే వస్తాయి. ఇప్పటికైనా బ్యాటర్లు తమ కర్తవ్యాన్ని తెలుసుకుని, దేశవాళీల్లో మ్యాచ్ లు ఆడి టెక్నిక్ నిరూపించుకోవాలి. టేకిట్ ఫర్ గ్రాంటెడ్ గా తీసుకోకుండా, జాతీయ జట్టుకు ఆడటాన్ని గౌరవంగా తీసుకుని అనుక్షణం అప్రమత్తంగా వ్యవహరిస్తేనే ఇలాంటి పరజయాలు దరి చేరవని విశ్లేషకులు పేర్కొంటున్నారు.