Gavaskar Fires On Seniors: దేశవాళీల్లో ఇప్పటికైనా ఆడించండి - ఆడని వారిని నిర్దాక్షిణ్యంగా సాగనంపండి, కోచ్ గంభీర్‌కు గావస్కర్ సూచనలు
Sunil Gavaskar: ఆసీస్ చేతిలో టెస్టు సిరీస్ ఓడిన టీమిండియాపై గావస్కర్ విమర్శలు గుప్పించాడు. ఇప్పటికైనా దేశవాళీల్లో భారత క్రికెటర్లు ఆడాలని, అలా ఆడని వారికి జట్టు నుంచి ఎంట్రీ గేట్ చూపించాలని సూచించాడు.
Ind Vs Aus Test Series Updates: దేశవాళీ ప్రాముఖ్యతను మరోసారి భారత దిగ్గజ క్రికెటర్ సునీల్ గావస్కర్ నొక్కిచెప్పాడు. ప్రస్తుత జట్టులోని ఆటగాళ్లు దేశవాళీల్లో ఆడాలని సూచించాడు. అలాంటి వారినే జాతీయ జట్టులోకి ఎంపిక చేయాలని, ఎవరైతే ఆడరో వారిపై నిర్దాక్షిణ్యంగా వేటు వేయాలని ఘాటుగా వ్యాఖ్యానించాడు. సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో 3-0తో భారత్ ఓడిపోయిన తర్వాత తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలోనూ బోర్డర్- గావస్కర్ ట్రోఫీ (బీజీటీ)ని 3-1తో ఓడిపోయింది. జట్టు ఇలా టెస్టులో నిరాశజనక ప్రదర్శన చేయడంపై పరోక్షంగా సీనియర్లపై విమర్శలు గుప్పించాడు.
కఠిన నిర్ణయం తీసుకోవాలి..
ఈ నెల 23 నుంచి రంజీ ట్రోపీ తదుపరి దశ ప్రారంభమవుతుందని, ఈ టోర్నీలో ఎంతమంది భారత ప్లేయర్లు బరిలోకి దిగుతారో చూడాలని ఉందని గావస్కర్ వ్యాఖ్యానించాడు. ఇక, దేశవాళీల్లో కచ్చితంగా ఆడాలని, అప్పుడే మెరుగైన ప్రదర్శన చేయవచ్చని తెలిపాడు. చాలామంది టెక్నిక్ లోపంతోనే విఫలమవుతున్నారని, దేశవాళీల్లో ఆడి దీన్నిసరిచేసుకోవచ్చని పేర్కొన్నాడు. ప్రస్తుతం దేశంలో ఎంతోమంది యువకులు అవకాశాల కోసం తపిస్తున్నారని, అలాంటి వారిని ప్రొత్సహించాల్సిన అవసరముందని తెలిపాడు. వికెట్‌ను కాపాడుకోవడం కోసం ప్రాణాలు పెట్టి ఆడుతారని, ప్రస్తుతం అలాంటి ఆటగాళ్లే జట్టుకు కావాలని చెప్పాడు. మరోవైపు ఇప్పటికైనా దేశవాళీల్లో విషయంలో బీసీసీఐ కఠినంగా వ్యవహరించాలని సూచించాడు. అలాగే టీమిండియా క్రికెటర్లు కూడా దేశవాళీల్లో ఆడి తమ టెక్నిక్‌ను కూడా మెరుగు పర్చుకోవాలని సూచించాడు.
వచ్చే డబ్ల్యూటీసీపై ఇప్పటి నుంచి నజర్
2027లో జరిగే ప్రపంచ టెస్టు ఛాంపియన్ షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ పోరు కోసం ఇప్పటి నుంచే జట్టును తయారు చేయాలని గావస్కర్ సూచించాడు. యశస్వి జైస్వాల్, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి ఆటగాళ్లను ప్రొత్సహిస్తేనే జట్టు బాగుపడుతుందని పేర్కొన్నాడు. దేశవాళీల్లో ఆడని క్రికెటర్లను టీమిండియాలో ఆడించకూడదని తెలిపాడు. సమయం లేదని, ఇతర కారణాలతో దేశవాళీల్లో ఆడని ఆటగాళ్లపై కఠినంగా ఉండాలని సూచించాడు. అలాంటి వారిని జట్టులోకి ఎంపిక చేయకుండా కఠిన చర్యలు తీసుకోవాలని, వాళ్లకు బదులు ఆట కోసం ప్రాణం పెట్టే వారిని ప్రొత్సహించాలని సూచించాడు.
తాజాగా ఆస్ట్రేలియా పర్యటనలో భారత్ టెస్టు సిరీస్ కోల్పోయింది. 1-3తో సిరీస్ ఓడిపోవడంతో భారత్‌పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సీనియర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను జట్టు నుంచి తప్పించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఇక వరుసగా రెండుసార్లు ప్రపంచ టెస్టు చాంపియన్ షిప్ ఫైనల్‌కు రెండుసార్లు చేరిన భారత్ రన్నరప్‌గా నిలిచింది. ఈసారి గెలిచి ఐసీసీ టైటిల్‌ను సాధించాలని అభిమానులు ఆశించగా, తాజా ఓటములతో ఏకంగా ఫైనల్ రేసు నుంచే తప్పించుకుంది. ఇక ఈ డబ్ల్యూటీసీ ఫైనల్లోకి సౌతాఫ్రికా చేరగా, తాజాగా ఆసీస్ కూడా చేరింది. వచ్చే జూన్‌లో రెండు జట్ల మధ్య లండన్‌లోని లార్డ్స్ మైదానంలో జరగుతుంది.