Ind Vs Eng Odi Series Updates: వైస్ కెప్టెన్ రేసులో స్టార్ ప్లేయర్.. హార్దిక్, రాహుల్, గిల్ లకు నో ఛాన్స్..! ఇంగ్లాండ్ తో వచ్చేనెలలో వన్డే సిరీస్
వచ్చేనెల 19 నుంచి పాకిస్థాన్ లో ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ ప్రారంభం కానుంది. అంతకుముందు దీనికి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో మూడు వన్డేల సిరీస్ ను భారత్ ఆడనుంది.
Jasprit Bumrah News: ప్రతిష్టాత్మక చాంపియన్స్ ట్రోఫీకి భారత జట్టులో కొన్ని మార్పులు చోటు చేసుకునే అవకాశాలున్నాయి. ఈ ఏడాది కేవలం మూడు వన్డేల ద్వైపాక్షిక సిరీస్ మాత్రమే ఆడుతుండటంతో రోహిత్ శర్మ బరిలోకి దిగడం ఖాయం. అతనే జట్టును నడిపిస్తాడు. అయితే అతనికి డిప్యూటిగా ఎవరు ఉంటారనేదానిపై ఆసక్తికర కథనాలు జోరందుకున్నాయి. ఇప్పటివరకు వైస్ కెప్టెన్ గా హార్దిక్ పాండ్యా, కేఎల్ రాహుల్, శుభమాన్ గిల్ వ్యవహరిస్తూ వచ్చారు. తొలుత ఎక్కువగా పాండ్యా ఈ బాధ్యతలు చేపట్టగా, మధ్యలో కొన్ని సార్లు రాహుల్ ఈ పాత్ర పోషించాడు. ఇక గౌతం గంభీర్ హయాం మొదలైనప్పటి నుంచి లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ సిరీస్ (వన్డేలు, టీ20)లకు ఫ్యూచర్ రిత్యా శుభమాన్ గిల్ ను ఎంపిక చేయడం మొదలు పెట్టారు. అయితే ఈసారి మాత్రం మార్పు నమోదు కావడం ఖాయమని తెలుస్తోంది. స్టార్ పేసర్ జస్ ప్రీత్ బుమ్రా ఈ బాధ్యతలు చేపడతాడని కొన్ని వాదనలు వినిపిస్తున్నాయి.
అందుబాటులో ఉండేనా..?
నిజానికి చాంపియన్స్ ట్రోఫీకి బుమ్రా అందుబాటులో ఉంటాడా..? లేదా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. సిడ్నీ టెస్టులో వెన్ను నొప్పి బారిన పడిన బుమ్రాకు విశ్రాంతి కావాలి. ఇక వచ్చేనెలలో చాంపియన్స్ ట్రోఫీకి సన్నాహకంగా ఇంగ్లాండ్ తో వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. వచ్చేనెల 6 నుంచి ఈ సిరీస్ జరగబోతోంది. అయితే బుమ్రాకు కేవలం గ్రేడ్ 1 గాయమే అయినా రిత్యా అప్పటివరకు తను కోలుకుంటాడని పలువురు విశ్వసిస్తున్నారు. ఇక ఇంగ్లాండ్ తో సిరిస్ తో పాటు చాంపియన్స్ ట్రోఫీకి కూడా బుమ్రాకే డిప్యూటీ సారథ్య బాధ్యతలు అప్పగించే అవకాశముంది. ఇటీవలే సారథిగా తనను తాను బుమ్రా నిరూపించుకున్నాడు. పెర్త్ లో జరిగిన తొలి టెస్టులో అసాధారణ కెప్టెన్సీతో జట్టుకు విజయాన్ని అందించాడు. అలాగే ఐదో టెస్టులో కూడా భారత్ కు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని అందించి పెట్టాడు. తను ముందుడి బౌలింగ్ విభాగాన్ని నడిపి ఆ సిరీస్ లో 32 వికెట్లు తీసి, ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ గా నిలిచాడు. దీంతో బుమ్రాను కెప్టెన్ మెటిరియల్ గా పరిగణించాలని డిమాండ్లు వెల్లు వెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే బోర్డు ఈ నిర్ణయం తీసుకోవచ్చని తెలుస్తోంది.
రోహిత్ కిదే చివరి ద్వైపాక్షిక సిరిసా..?
ఇక ఫామ్ కోల్పోయి తంటాలు పడుతున్న భారత కెప్టెన్ రోహిత్ ఈ ఏడాది వన్డేల్లో ఆడబోయే ఏకైక సిరీస్ ఇదే కావడం విశేషం. ఎందుకంటే వన్డేలను ఎక్కువగా టీమిండియా ఆడటం లేదు. ఎక్కువ ఫోకస్ టీ20లపైనే పెట్టింది. దీంతో వన్డేలకే పరిమితమైన రోహిత్, ఈ ఒక్క సిరీస్ ఆడే అవకాశముంది. అలాగే స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా వన్డేలే ఆడుతుండటంతో అతనికి ఈ ఏడాది ఇదే ఆఖరి సిరీస్ కానుంది. ఆ తర్వాత మొదలయ్యే చాంపియన్స్ ట్రోఫీలో కూడా ఈ ఇద్దరు విఫలమైతే వారిని సాగనంపే అవకాశాలు ఎక్కువ. 2027లో వన్డే ప్రపంచకప్ జరుగనున్న నేపథ్యంలో ఇప్పటి నుంచే కొత్త జట్టును నిర్మించాలని బీసీసీఐ యోచిస్తోంది. నిజానికి ఆ ప్రపంచకప్ వరకు తనకు ఆడాలని ఉన్నా ఫామ్ సహకరిస్తేనే తను జాతీయ జట్టులో ఉండగలడు. ఇక టెస్టుల్లో పోలిస్తే రోహిత్ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ సిరీస్ లో రోహిత్ చాలా ప్రభావం చూపించగలడు. ఎన్నో రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. దీంతో ఈ ఫార్మాట్లో రోహిత్ కు వచ్చిన ఢోకా ఏమీ లేదని అభిమానులు పేర్కొంటున్నారు.