LSG vs MI, Eliminator Preview: లక్నోకు ఎలిమినేటర్ సెంటిమెంట్! ఓడించే దమ్ముంది కానీ.. ముంబయిదేమో డిస్ట్రక్టివ్ ఫామ్!
LSG vs MI, Eliminator Preview: ఐపీఎల్ లో మరొకరి జర్నీ నేటితో ముగియనుంది! ఎలిమినేటర్ జరుగుతోంది. లక్నో సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. మరి ఇందులో గెలిచేదెవరు? ఓడేదెవరు?
LSG vs MI, Eliminator Preview:
ఇండియన్ ప్రీమియర్ లీగు 2023లో మరొకరి జర్నీ నేటితో ముగియనుంది! చెపాక్ వేదికగా సాయంత్రం ఎలిమినేటర్ జరుగుతోంది. మూడు, నాలుగు పొజిషన్లలో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, ముంబయి ఇండియన్స్ తలపడుతున్నాయి. మరి ఇందులో గెలిచేదెవరు? ఓడేదెవరు?
లక్నో.. ఎలిమినేటర్ గండం దాటేనా!
అరంగేట్రం చేసిన ఏడాది నుంచి వరుసగా రెండోసారీ ప్లేఆఫ్ చేరుకుంది లక్నో సూపర్ జెయింట్స్ (Lucknow Super Giants)! అదీ మూడో స్థానంతోనే! విచిత్రంగా రెండు సార్లూ రెండో పొజిషన్లో నిలిచిన జట్టుతో సమానంగా పాయింట్లు సాధించినా నెట్‌రన్‌రేట్‌తో వెనకబడింది. ఐపీఎల్ చరిత్రలోనే మోస్ట్ కన్సిస్టెంట్ ఓపెనర్, కెప్టెన్ కేఎల్ రాహుల్ (KL Rahul) లేనప్పటికీ లక్నో దూసుకెళ్తోంది. కృనాల్ పాండ్య (Krunal Pandya) ఎల్‌ఎస్‌జీ బ్రిగేడ్‌ను బాగా నడిపిస్తున్నాడు. ఎప్పుడు ఎలాగైనా చెలరేగే ఆటగాళ్లు దాని సొంతం! కానీ చిన్న చిన్న మూమెంట్స్‌లో ఒక్కోసారి వెనకబడుతోంది.
కైల్ మేయర్స్ కాస్త ఫామ్ కోల్పోయాడు. అయితే సీఎస్కేపై చెన్నైలో అతడి వీర బాదుడు అందరికీ గుర్తుండే ఉంటుంది! మరోసారి అతడు అలాగే ఆడాలి. క్వింటన్ డికాక్ దూకుడుగా ఆడుతున్నాడు. మార్కస్ స్టాయినిస్ (Marcus Stoinis), నికోలస్ పూరన్ (Nicholas Pooran) జట్టుకు ట్రబుల్ షూటర్లుగా మారారు. కృనాల్ బ్యాటింగూ బాగానే ఉంది. ఆయుష్ బదోనీ తన ఎక్స్ ఫ్యాక్టర్ ప్రదర్శిస్తున్నాడు. ప్రేరక్ మన్కడ్ పర్లేదు. అవేశ్‌ను తీసుకోకుండానే యుధ్‌వీర్, యశ్ ఠాకూర్, మొహిసిన్ ఖాన్, నవీనుల్ హఖ్‌తో పేస్ బండి నడిపిస్తున్నారు. స్టాయినిస్, మేయర్స్ మీడియం పేస్ వేయగలరు. రవి బిష్ణోయ్ తన గూగ్లీలతో బోల్తా కొట్టిస్తున్నాడు. కృనాల్, కృష్ణప్ప గౌతమ్, అమిత్ మిశ్రా అతడికి తోడుగా ఉన్నారు. సరిగ్గా ప్లాన్ చేస్తే.. దానిని అమలు చేస్తే లక్నో క్వాలిఫయర్-2కు వెళ్లగలదు!
ముంబయి.. బిగ్‌మ్యాచ్ విన్నర్!
ఐదుసార్లు ఛాంపియన్ ముంబయి ఇండియన్స్ (Mumbai Indians) భీకరమైన ఫామ్‌లో ఉంది. 190+ టార్గెట్లను 16-18 ఓవర్లలోనే ఛేదిస్తోంది. ఆటగాళ్లంతా ఫుల్ జోష్‌లో ఉన్నారు. మిగతా జట్లతో పోలిస్తే మిడిలార్డర్ మొత్తం డిస్ట్రక్టివ్ ఫామ్‌లో ఉన్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ (Rohit Sharma) కూల్‌గా నిర్ణయాలు తీసుకుంటున్నాడు. చివరి మ్యాచులో వింటేజ్ హిట్‌మ్యాన్‌ను బయటకు తీశాడు. ఇక ఇషాన్ కిషన్ (Ishan Kishan) గురించి తెలిసిందే. కామెరాన్ గ్రీన్ సెంచరీతో ఊపుమీద కనిపిస్తున్నాడు. సూర్యకుమార్ యాదవ్ (Surya Kumar Yadav) ఎప్పట్లాగే 360 డిగ్రీల్లో దంచికొడుతున్నాడు. టిమ్ డేవిడ్ సిక్సర్ల ధాటికి ఎవరైనా భయపడాల్సిందే.
హైదరాబాదీ కుర్రాడు తిలక్ వర్మ (Tilak Varma), నేహాల్ వధేరా కుషన్ ఇస్తున్నారు. దాదాపుగా 8వ స్థానం వరకు ముంబయి పటిష్ఠంగా కనిపిస్తోంది. బౌలింగ్ పరంగా ఇప్పటికీ ఇబ్బందులు ఉన్నాయి. బెరెన్‌డార్ఫ్ ఒక్కడే నిలకడగా రాణిస్తున్నాడు. ఆకాశ్ మధ్వాల్ అతడికి అండగా ఉంటున్నాడు. గ్రీన్ అదనపు బౌలర్‌గా ఉపయోగపడుతున్నాడు. హృతిక్ షోకీన్, పియూష్ చావ్లా, కుమార్ కార్తికేయ రూపంలో మంచి స్పిన్నర్లు ఉన్నారు. చివరిసారి లక్నోపై మంచి స్టార్ట్ దొరికినా మిడిలార్డర్లో స్లో బౌలింగ్‌కు ముంబయి బ్యాటర్లు బోల్తా పడ్డారు. చెపాక్‌లో వారిని ఓ కంట కనిపెట్టడం ముఖ్యం!