IND vs SA 1st ODI highlights: పరుగుల పోరులో దక్షిణాఫ్రికాపై టీమిండియా విజయం.. విరాట్ సెంచరీ, కుల్దీప్ స్పిన్ మ్యాజిక్..
దక్షిణాఫ్రికాపై భారత్ 17 రన్స్ తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ లో కోహ్లీ, రోహిత్, రాహుల్.. తరువాత బౌలింగ్ లో కుల్దీప్ రాణించారు.

IND vs SA 1st ODI highlights | రాంచీ: భారత్ మొదటి వన్డే మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 17 పరుగుల తేడాతో ఓడించింది. రాంచీలో జరిగిన తొలి వన్డే మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌లలో మొత్తం 681 పరుగులు నమోదయ్యాయి. విరాట్ కోహ్లీ తన అంతర్జాతీయ కెరీర్‌లో 83వ, ODI కెరీర్‌లో 52వ సెంచరీని సాధించాడు. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా 349 పరుగులు చేసింది. దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యానికి 17 పరుగులు దూరంలో నిలిచింది. భారత్ తరపున అత్యధిక వికెట్లు కుల్దీప్ యాదవ్ తీశాడు, 4 వికెట్లు పడగొట్టి విజయంలో కీలకపాత్ర పోషించాడు.
మ్యాచ్‌లో 681 పరుగులు, భారత్ విజయం
దక్షిణాఫ్రికా జట్టు 350 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడానికి బ్యాటింగ్ దిగగా, హర్షిత్ రాణా తన మొదటి స్పెల్‌లో రయాన్ రికల్టన్ , క్వింటన్ డి కాక్‌లను ఖాతా తెరవకుండానే అవుట్ చేసి డబుల్ షాకిచ్చాడు. దాంతో దక్షిణాఫ్రికాకు అతిపెద్ద ఎదురుదెబ్బ తగిలింది. కెప్టెన్ ఎయిడెన్ మార్క్రమ్ 7 పరుగుల వద్ద అర్ష్‌దీప్ సింగ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు. దాంతో సఫారీలు 11 పరుగుల వద్దే టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్‌లను కోల్పోయింది. టోనీ డి జోర్జీ, డెవాల్డ్ బ్రెవిస్ మంచి ప్రారంభం అందించారు, కానీ వారు వరుసగా 39 పరుగులు, 37 పరుగులు చేసి అవుట్ అయ్యారు.

మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా కం బ్యాక్ చేసి భారత బౌలర్లపై ఒత్తిడి పెంచారు. మార్కో జాన్సెన్, మాథ్యూ బ్రిట్జ్‌కే ఆరో వికెట్‌కు 97 పరుగుల కీలక భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. జాన్సెన్ 39 బంతుల్లో 70 పరుగులతో దూకుడుగా ఆడి భారత్ నుంచి మ్యాచ్ లాగేసే ప్రయత్నంలో అవుట్ అయ్యాడు. కుల్దీప్ యాదవ్ జాన్సెన్, మాథ్యూ బ్రిట్జ్‌కోలను ఒకే ఓవర్లో అవుట్ చేయడం ద్వారా మ్యాచ్ భారత్ వైపు తిప్పాడు. బ్రిట్జ్‌కే 72 పరుగులు చేశాడు. కార్బిన్ బాష్ చివరి ఓవర్లలో బౌండరీలు బాదుతూ మ్యాచ్‌ను మరింత ఉత్కంఠభరితంగా మార్చాడు.
Game, set, match! 💪
— BCCI (@BCCI) November 30, 2025
Prasidh Krishna bags the final wicket as #TeamIndia clinch a thrilling contest in Ranchi to go 1⃣-0⃣ up 🙌
Scorecard ▶️ https://t.co/MdXtGgRkPo#INDvSA | @IDFCFIRSTBank pic.twitter.com/yHpkRnlEVk
కోహ్లీ, రోహిత్- రాహుల్ బ్యాటింగ్
భారత జట్టు మొదట బ్యాటింగ్ చేయడానికి దిగగా, యశస్వి జైస్వాల్ 18 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. కానీ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కలిసి రెండో వికెట్‌కు 136 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఈ సమయంలో రోహిత్ తన వన్డే కెరీర్‌లో 60వ అర్ధ సెంచరీని సాధించాడు. రోహిత్ 57 పరుగులు చేసి అవుటయ్యాడు.
మరోవైపు విరాట్ కోహ్లీ తన అర్ధ సెంచరీని సెంచరీగా మలుచుకున్నాడు. కోహ్లీ 102 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మ్యాచ్‌లో 120 బంతులు ఆడి 135 పరుగులు చేశాడు, ఇందులో కోహ్లీ 11 ఫోర్లు, 7 సిక్సర్లు కొట్టాడు. ఇది అతని వన్డే కెరీర్‌లో 52వ సెంచరీ. ఈ సిరీస్‌లో భారత జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న కెఎల్ రాహుల్ 60 పరుగులు చేసి జట్టు స్కోరును 349కి చేర్చడంలో కీలక పాత్ర పోషించాడు. ఆ పరుగులే భారత్ విజయంలో దోహదం చేశాయి.





















