ICC Women’s T20 World Cup 2024: మహిళల టీ 20 ప్రపంచకప్, తప్పక తెలుసుకోవాల్సిన 10 విషయాలు
ICC Womens T20 World Cup 2024 : యూఏఈ వేదికగా జరగనున్నమహిళల టీ 20 ప్రపంచకప్ టోర్నీలో ఈరోజు రెండు మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ నేపధ్యంలో మహిళల పొట్టి ప్రపంచ కప్ గురించి మీరు తప్పక తెలుసుకోవలసిన విషయాలివే
1) 2024లో జరిగిన టీ 20 ప్రపంచ కప్ పురుషుల జట్ల సంఖ్యను పెంచారు. ఈసారి మహిళల జట్ల సంఖ్యను మాత్రం పదికే పరిమితం చేశారు. ఇందులో 10 జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ Aలో ఆస్ట్రేలియా, భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్, శ్రీలంక ఉన్నాయి. గ్రూప్ Bలో బంగ్లాదేశ్, ఇంగ్లాండ్, స్కాట్లాండ్, దక్షిణాఫ్రికా, వెస్టిండీస్ ఉన్నాయి.
2) ఆస్ట్రేలియా, శ్రీలంక, న్యూజిలాండ్, పాకిస్థాన్‌లతో పాటు భారత్ ఏ గ్రూపులో ఉంది. శుక్రవారం న్యూజిలాండ్‌తో భారత్ తమ పోరాటాన్ని ఆరంభిస్తోంది. ఆదివారం పాకిస్థాన్‌తో తలపడుతుంది. శ్రీలంకతో అక్టోబర్ 9న, అక్టోబర్ 13న ఆస్ట్రేలియాతో టీమిండియా తలపడనుంది.
3) ప్రతి గ్రూప్ నుంచి సెమీఫైనల్స్‌కు కేవలం రెండు జట్లు మాత్రమే అర్హత సాధిస్తాయి. భారత్ సెమీస్ చేరాలంటే చెమటోడ్చక తప్పదు. ఒక్క ఓటమి ఎదురైనా భారత్ సెమీస్ అవకాశాలు సంక్లిష్టంగా మారుతాయి.
4) టీ 20 ప్రపంచకప్ లో ఇది 9వ ఎడిషన్. ఆస్ట్రేలియా చివరి మూడు టీ 20 ప్రపంచకప్ లను వరుసగా గెలిచింది. మొత్తం ఆరుసార్లు కప్పును కైవసం చేసుకుంది. 2009లో ప్రారంభ ఎడిషన్‌ను ఇంగ్లండ్ గెలుచుకుంది. వెస్టిండీస్ 2016లో ఈడెన్ గార్డెన్స్‌లో టైటిల్‌ను గెలుచుకుంది.
5) ఈ ప్రపంచకప్ ఎడిషన్ తో మహిళలకు కూడా పురుషులతో సమానంగా ప్రైజ్ మనీ అందనుంది. ఈ టోర్నమెంట్ విజేతలు USD 2.34 మిలియన్ డాలర్ల ప్రైజ మనీ అందుకుంటుంది. రన్నరప్ జట్టుకు 1.17 మిలియన్ డాలర్లు దక్కుతాయి.
Read Also: కెప్టెన్ల మనసులో మాట - హర్మన్ ఏం చెప్పిందంటే?
6) టోర్నమెంట్ కోసం 10 మంది అంపైర్లు, ముగ్గురు మ్యాచ్ రిఫరీలను నియమించారు. వీరంతా మహిళలే కావడం విశేషం. భారత్ తరపున GS లక్ష్మి కూడా ఇందులో ఉన్నారు. అంపైర్ బృందా రాఠీ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. DRS, హాక్-ఐ స్మార్ట్ రీప్లే సిస్టమ్ మొత్తం 28 మ్యాచ్‌ల్లో అందుబాటులో ఉంటుంది.
7) భారత మాజీ ఆటగాళ్లు మిథాలీ రాజ్, అంజుమ్ చోప్రా, WV రామన్ కామెంటరీ ప్యానెల్‌లో ఉన్నారు. మెల్ జోన్స్, లిసా స్తాలేకర్, స్టేసీ ఆన్ కింగ్, లిడియా గ్రీన్‌వే, కార్లోస్ బ్రాత్‌వైట్ లు కూడా కామెంట్రీ ప్యానల్ లో ఉన్నారు. నటాలీ జర్మనోస్, ఇయాన్ బిషప్, కాస్ నైడూ, నాసర్ హుస్సేన్, అలిసన్ మిచెల్, మ్పుమెలెలో బంగ్వా కూడా ఈసారి కామెంట్రీలో ఉండనున్నారు.
8) ఈ మ్యాచ్‌లు అన్నీ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రసారం అవుతాయి. డిస్నీ+హాట్‌స్టార్ ఆన్‌లైన్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌గా ఉంది. డే మ్యాచ్‌లు IST మధ్యాహ్నం 3.30 గంటలకు.. రాత్రి మ్యాచులు 7.30 గంటలకు ప్రారంభమవుతాయి.
9) బంగ్లాదేశ్ లో నిర్వహించాల్సిన టీ 20 ప్రపంచకప్ ను శాంతి భద్రతల సమస్యతో యూఏఈకి మార్చారు. ప్రపంచకప్ అక్టోబర్ 3న షార్జా క్రికెట్ స్టేడియంలో ప్రారంభమవుతుంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అక్టోబర్ 20న ఫైనల్ జరగనుంది.
Read Also : క్రికెట్ ప్రపంచమా సిద్ధమా, మహిళల టీ 20 వరల్డ్ కప్ షురూ!
10) 2020లో మొదటిసారి టీ 20 ప్రపంచకప్ ఫైనల్ చేరిన భారత్.. ఈసారి కప్పు దక్కించుకోవాలని చూస్తోంది. ఇప్పటికే వెస్టిండీస్, సౌతాఫ్రికాతో సన్నాహక మ్యాచులు ఆడిన భారత్.. రేపు అసలైన పోరాటాన్ని ఆరంభించనుంది.
భారత జట్టు: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షఫాలీ వర్మ, దీప్తి శర్మ, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, యాస్తికా భాటియా, పూజా వస్త్రాకర్, అరుంధతి రెడ్డి, రేణుకా సింగ్ ఠాకూర్, దయాళన్ హేమలత, ఆశా శోభన , రాధా యాదవ్, శ్రేయాంక పాటిల్, సజన సజీవన్.