Shreyas Iyer: విమర్శలు చేసిన వాళ్లే అయ్యరే, అద్భుత ఇన్నింగ్స్ అంటున్నారు!
ODI World Cup 2023: శ్రేయస్స్ అయ్యర్...ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతేనా ఒకే ప్రపంచకప్‌లో 526 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
Semi final world cup 2023: భారత్ వేదికగా జరుగుతున్న ప్రపంచకప్ తుది జట్టులో శ్రేయస్స్ అయ్యర్‌ను ఎందుకు తీసుకున్నారని పెదవి విరిచినవారే ఎక్కువ. ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండు పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన క్లిష్ట సమయంలో ఓ నిర్లక్ష్యపు షాట్‌కు అయ్యర్ అవుటైనప్పుడు ఈ విమర్శలకు బలం చేకూరింది. తొలి నాలుగు మ్యాచుల్లో అయ్యర్ పెద్దగా రాణించకపోతే ఆ విమర్శల వాన... జడివానగా మారింది. అయ్యర్ ఫామ్ గురించి అభిమానులు, మాజీ క్రికెటర్లు ఆందోళన చెందారు. ఇలా అయితే భారత మిడిల్ ఆర్డర్ పెద్ద మ్యాచుల్లో సతమతమవుతుందని హెచ్చరించారు. వరుసగా మూడు వికెట్లు నేలకూలితే అయ్యర్ అసలు నిలబడగలడా అని ప్రశ్నలు సంధించారు. ఈ పరిస్థితుల్లో అయ్యర్‌ను ఇంకా నాలుగో స్థానంలో కొనసాగించడంపై ఆందోళనలు కూడా వచ్చాయి. అందరూ ఉచిత సలహాలు కూడా ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్‌ను అయ్యర్ స్థానంలోకి తీసుకురావాలని కూడా సూచించారు. ఇలా ఎటుచూసినా విమర్శలు వింటున్న వేళ కోచ్ రాహుల్ ద్రవిడ్... కెప్టెన్ రోహిత్.. అయ్యర్‌కు అండగా నిలిచారు. అంతే ఒక్కసారి లయ అందుకున్నాక శ్రేయస్స్‌ను ఆపడం ఎవ్వరి తరమూ కావడం లేదు. ఈ ప్రపంచకప్‌లో ఇప్పటికే పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. అంతేనా ఒకే ప్రపంచకప్‌లో 526 పరుగులు సాధించి ఔరా అనిపించాడు.
న్యూజిలాండ్‌తో జరిగిన సెమీఫైనల్లో కోహ్లీ చేసిన 50వ సెంచరీ చేస్తున్న సమయంలో టీమిండియా రన్‌రేట్ ఏమాత్రం తగ్గకుండా అలాగే కొనసాగిందంటే దానికి ప్రధాన కారణం శ్రేయస్స్ అయ్యర్. విరాట్ కోహ్లీ శతకం చేసిన తర్వాత భారత జట్టు భారీ స్కోరు దిశగా దూసుకెళ్లిందంటే అదీ అయ్యర్ వల్లే. అద్భుతమైన ఇన్నింగ్స్‌లతో శ్రేయస్స్ జట్టుకు విలువైన పరుగులు జోడిస్తున్నాడు. ఈ ప్రపంచకప్‌లో అయ్యర్ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి నాలుగుసార్లు అర్ధ శతకాలు, రెండు సెంచరీలు కూడా చేసేశాడు. 48 ఏళ్ల ప్రపంచకప్ చరిత్రలో ఒకే ఎడిషన్‌లో భారత్ తరఫున నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగి నాలుగుసార్లు 50కిపైగా పరుగులు చేయడం తొలిసారి.భారత్ తరఫున ఒకే ప్రపంచకప్‌లో నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేసి అత్యధిక సార్లు 50కుపైగా పరుగులు సాధించిన బ్యాటర్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర సృష్టించాడు. ఈ ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో 53, బంగ్లాదేశ్‌తో 82, సౌతాఫ్రికాతో 77, నెదర్లాండ్స్‌పై 128, న్యూజిలాండ్‌పై 105 పరుగులు చేశాడు.
రికార్డుల అయ్యర్
ప్రపంచకప్‌లో భారత్ తరపున మూడో వేగవంతమైన సెంచరీని కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఇదే ప్రపంచకప్‌లో రాహుల్ 62 బంతుల్లో సెంచరీ చేస్తే.. రోహిత్ శర్మ 63 బంతుల్లో శతకం బాదాడు. ఇప్పుడు అయ్యర్ 67 బంతుల్లో శతకం బాది తాను ఎంత విలువైన ఆటగాడినో చాటిచెప్పాడు. వన్డే వరల్డ్‌కప్ టోర్నీ నాకౌట్ మ్యాచ్‌ల్లో ఫాస్టెస్ట్ సెంచరీ చేసిన ఆటగాడిగా అయ్యర్ రికార్డులకెక్కాడు. న్యూజిలాండ్‌తో సెమీఫైనల్లో 67 బంతుల్లో సెంచరీ చేసిన అయ్యర్.. ఈ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు ఆస్ట్రేలియా క్రికెట్ దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ పేరిట ఉండేది. 2007 వరల్డ్‌కప్ ఫైనల్లో శ్రీలంకపై గిల్‌క్రిస్ట్ 72 బంతుల్లో సెంచరీ చేశాడు. కివీస్‌తో మ్యాచ్‌లో గిల్లీ ఆల్‌టైమ్ రికార్డును అయ్యర్ బ్రేక్ చేశాడు.