Guy Whittall:చిరుతతో పెంపుడు కుక్క పోరాటం, ఆ మాజీ క్రికెటర్ ప్రాణాలు కాపాడింది
Guy Whittall: జింబాబ్వే మాజీ క్రికెటర్‌పై చిరుత దాడికి పాల్పడింది. దీంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న క్రికెటర్‌ను అతడి పెంపుడు కుక్క చికారా కాపాడింది.
Former Zimbabwe Cricketer Survives Leopard Attack Thanks To Pet Dog Airlifted To Hospital: విశ్వాసంలో కుక్కను మించిన జంతువు లేదన్న విషయం తెలిసినదే. కొన్నిసార్లు శునకం తన యజమాని కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయని ఘటనలు అక్కడో ఇక్కడో చూస్తూనే ఉంటాం. తాజాగా అలాంటి ఘటనే జింబాబ్వే లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది . జింబాబ్వే మాజీ క్రికెటర్ గై విట్టాల్‌పై చిరుత దాడి చేయగా.. అతని పెంపుడు కుక్క ఆ చిరుతతో పోరాడి అతని ప్రాణాలు కాపాడింది . ఈ విషయాన్ని విట్టాల్ భార్య హన్నా స్వయంగా సోషల్ వీడియా వేదికగా వెల్లడించింది.
51 ఏళ్ల మాజీ ఆల్‌రౌండర్ గై విట్టాల్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తరువాత జింబాబ్వేలో సఫారీ వ్యాపారం చేస్తున్నాడు. ఇటీవల అతను సమీపంలోని హుమానీ ప్రాంతంలో ట్రెక్కింగ్‌కు వెళ్లాడు. తోడుగా తన పెంపుడు కుక్క ‘చికారా’ను కూడా తీసుకెళ్లాడు. అయితే ఆ సమయంలో అనూహ్యంగా ఓ చిరుత విట్టాల్‌పై దాడి చేసింది. దీంతో వెంటనే చికారా తన ప్రాణాలను పణంగా పెట్టి ఆ చిరుతతో పోరాడింది. విట్టాల్‌ను రక్షించడమే గాక చిరుతను తరిమికొట్టింది. చివరికి చిరుత తోకముడిచింది. ఈ ఘటనలో తీవ్ర గాయాలైన విట్టాల్‌తోపాటు చికారాను కూడా విమానంలో ఆస్ప్రత్రికి తరలించారు. ప్రాణాలకు తెగించి చిరుతతో పోరాడి తీవ్రగాయాలపాలైన చికారాతో పాటు విట్టాల్ ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్టు గై విట్టాల్ భార్య హన్నా ఫేస్‌బుక్ పోస్ట్ ద్వారా వెల్లడించింది. తీవ్ర గాయాలు అవ్వడం వల్ల విట్టాల్‌కు సర్జరీ జరిగింది. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉందంటూ ఆస్పత్రి బెడ్‌పై ఉన్న విట్టాల్ ఫొటోను కూడా ఆమె షేర్ చేసింది. విషయం తెలుసుకుంటున్న విట్టాల్ అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు. ‘చికారా.. యూ ఆర్ అమేజింగ్..’ అంటూ పలువురు సోషల్‌మీడియాలో స్పందిస్తున్నారు. ‘గెట్ వెల్ సూన్’ అంటూ చికారా, విట్టాల్‌ను ఉద్దేశించి పోస్టులు పెడుతున్నారు.
కాగా, గతంలోనూ విట్టాల్ ఇలాంటి ఒక ఘటనను ఎదుర్కొన్నారు. 2013లో విట్టాల్ ఇంట్లోకి పెద్ద మొసలి దూరి మంచం కిందకు వెళ్లింది. విషయాన్ని గమనించిన రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారి వచ్చి దాన్ని పట్టుకోవడంతో అతడికి ప్రాణాపాయం తప్పింది.