ODI World Record: వన్డే చరిత్రలో సంచలనం.. అత్యధిక రన్స్ తేడాతో దక్షిణాఫ్రికాపై ఇంగ్లాండ్ ఘన విజయం
south africa vs england | దక్షిణాఫ్రికాను 342 పరుగుల తేడాతో ఓడించి ఇంగ్లండ్ ప్రపంచ రికార్డు సృష్టించింది. ODI చరిత్రలో అతిపెద్ద విజయంగా ఈ మ్యాచ్ నిలిచింది. తద్వారా భారత్ రికార్డు బద్ధలైంది.

England vs South Africa | వన్డే క్రికెట్లో ఇంగ్లండ్ జట్టు ప్రపంచ రికార్డు సృష్టించింది. దక్షిణాఫ్రికాను 342 పరుగుల తేడాతో ఓడించి రికార్డులు తిరగరాసింది ఇంగ్లాండ్. ఇది ODI క్రికెట్ చరిత్రలో పరుగుల పరంగా ఓ జట్టు సాధించిన అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ నిర్ణీత 50 ఓవర్లలో 414 పరుగులు చేసింది.
రికార్డు పరుగులను ఛేజింగ్ చేయడానికి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా జట్టు ఏమాత్రం పోరాడకుండా చేతులెత్తేసింది. సఫారీ టీం కేవలం 72 పరుగులకే ఆలౌట్ అవ్వడంతో 342 పరుగుల తేడాతో ఇంగ్లాండ్ చారిత్రాత్మక విజయాన్ని అందుకుంది. మరోవైపు దక్షిణాఫ్రికా జట్టు వన్డేల్లో హయ్యెస్ట్ ఛేజింగ్ టీంగానే కాదు, వన్డేలో అతిపెద్ద ఓటమిని చవిచూసిన జట్టుగానూ చెత్త రికార్డును తమ ఖాతాలో వేసుకుంది. ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ 4 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా జట్టును దెబ్బకొట్టాడు.
🚨 ENGLAND BEAT SOUTH AFRICA BY A RECORD 342 RUNS MARGIN - THE BIGGEST EVER IN ODI HISTORY. 🚨 pic.twitter.com/7VoiaKOwsV
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 7, 2025
ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ఇంగ్లాండ్ జట్టు జో రూట్ (100) సెంచరీ చేయగా, జాకబ్ బెథెల్ (110 పరుగులు) చేయడంతో జట్టు స్కోరును 400 దాటించడంలో కీలక పాత్ర పోషించారు. జాస్ బట్లర్ చివరి 10 ఓవర్లలో 32 బంతుల్లో 62 పరుగులతో టీ20 తరహాలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దక్షిణాఫ్రికా జట్టు లక్ష్యాన్ని ఛేదించలేక తడబాటుకు లోనైంది. ఏకంగా 8 మంది బ్యాటర్లు రెండంకెల స్కోరు కూడా చేరుకోలేకపోయారు.
భారతదేశం రికార్డును బద్దలు కొట్టిన ఇంగ్లాండ్
దక్షిణాఫ్రికాను 342 పరుగుల తేడాతో ఓడించి వన్డేలో పరుగుల తేడాతో ఇంగ్లాండ్ అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. ఇంతకు ముందు ఈ రికార్డు భారత్ పేరిట ఉండేది. 2023లో శ్రీలంకను 317 పరుగుల తేడాతో ఓడించింది భారత్. వన్డే చరిత్రలో ఒక జట్టును ఒకటి కంటే ఎక్కువసార్లు 300 లేదా అంతకంటే ఎక్కువ తేడాతో ఓడించిన ఏకైక దేశం భారత్. టీమ్ ఇండియా రెండుసార్లు ఈ ఘనతను సాధించింది.
వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం
వన్డేల్లో పరుగుల పరంగా అతిపెద్ద విజయం ఇంగ్లాండ్ ఖాతాలోకి చేరింది. దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్ లో 342 పరుగుల తేడాతో ఓడించింది. శ్రీలంకపై 317 పరుగుల తేడాతో నెగ్గిన టీం ఇండియా రెండవ స్థానంలో ఉంది.
వన్డే చరిత్రలో భారీ విజయాలు
342 పరుగులు - విజేత ఇంగ్లాండ్ (vs దక్షిణాఫ్రికా)
317 పరుగులు - విజేత భారత్ (vs శ్రీలంక)
309 పరుగులు - విజేత ఆస్ట్రేలియా (vs నెదర్లాండ్స్)
304 పరుగులు - విజేత జింబాబ్వే (vs USA)
302 పరుగులు - విజేత భారత్ (vs శ్రీలంక)





















