Team India New Jersey: టీమిండియా కొత్త జెర్సీ చూశారా.. స్పాన్సర్ లేకుండానే ఆసియా కప్ 2025 బరిలోకి
Asia Cup 2025 | ఆసియా కప్ కోసం భారత జట్టు కొత్త జెర్సీ ఆవిష్కరించింది. కొత్త జెర్సీ మీద ఎలాంటి స్పాన్సర్ పేరు లేదు. తొలిసారి జెర్సీ స్పాన్సర్ లేకుండానే భారత్ బరిలోకి దిగుతోంది.

Team India Jersey For Asia Cup 2025| ఆసియా కప్ 2025లో టీమిండియాకు వింత అనుభవం ఎదురవుతోంది. ఎలాంటి జెర్సీ స్పాన్సర్ లేకుండా భారత జట్టు బరిలోకి దిగుతుంది. టీమిండియా కొత్త జెర్సీపై స్పాన్సర్ ఉండరు. ఇటీవల ఆన్‌లైన్ గేమింగ్ కంపెనీ Dream11, బీసీసీఐ (BCCI)తో స్పాన్సర్‌షిప్ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది. గత కొన్ని రోజులుగా బీసీసీఐ కొత్త జెర్సీ స్పాన్సర్ కోసం చూసింది. ఈ క్రమంలో భారత క్రికెట్ జట్టు తమ అధికారిక సోషల్ మీడియా ఖాతా ద్వారా ఆసియా కప్ కోసం ఇండియా కొత్త జెర్సీని షేర్ చేసింది. ఆసియా కప్‌లో భారత్ సెప్టెంబర్ 10న యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)తో మొదటి మ్యాచ్ ఆడనుంది.
ముందుగా టీమిండియా ఆల్ రౌండర్ శివమ్ దూబే ఇన్‌స్టాగ్రామ్‌లో కొత్త జెర్సీ ధరించిన ఫోటోలు షేర్ చేశాడు. అది చూడగానే భారత్ జెర్సీ స్పాన్సర్ లేకుండానే బరిలోకి దిగుతుందని తేలిపోయింది. తాజాగా టీమిండియా కూడా వీడియో క్లిప్ ద్వారా ఆసియా కప్ టోర్నీకి కొత్త జెర్సీని విడుదల చేసింది. ఈ కొత్త జెర్సీపై టోర్నమెంట్ పేరు, BCCI లోగో, INDIA అని మాత్రమే ఉంది. స్పాన్సర్ ఉండే స్థలాన్ని ఖాళీగా ఉంచడంతో కొత్తగా జెర్సీ కోసం ఒప్పందం జరగలేదని అర్థమవుతోంది.
భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ BCCI కొత్త స్పాన్సర్ కోసం ఈ వారం దరఖాస్తులను ఆహ్వానించింది. దరఖాస్తులకు చివరి తేదీ సెప్టెంబర్ 12గా నిర్ణయించారు. బిడ్ కోసం అవసరమైన డాక్యుమెంట్‌లను సమర్పించడానికి చివరి తేదీ సెప్టెంబర్ 16 అని తెలిపింది. BCCI ఈసారి జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాలనుకుంటోంది. 'Dream11' ఆన్ లైన్ గేమింగ్ యాప్ సంస్థతో ఏర్పడిన పరిస్థితి మళ్లీ ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని భావిస్తోంది. కొత్త ఆన్‌లైన్ గేమింగ్ బిల్లు రావడంతో డ్రీమ్11 తో పాటు ఇతర ఆన్‌లైన్ గేమింగ్ ప్లాట్‌ఫారమ్‌లపై భారత ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కొన్ని యాప్‌లను పూర్తిగా నిషేధించింది.
View this post on Instagram
టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్, ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా కూడా కొత్త జెర్సీలో కనిపించారు. మరోవైపు హార్దిక్ పాండ్యా కొత్త తన హెయిర్‌స్టైల్ వైరల్ గా మారింది. విదేశీ క్రికెటర్ల తరహాలో అతడి హెయిర్ స్టైల్ కనిపిస్తుంది. టీ20 ఫార్మాట్లో ఏసియా కప్ జరగనుండటం భారత్ కు బాగా కలిసొస్తుంది. టీ20ల్లో నెంబర్ వన్ టీం భారత్. బ్యాటర్లు, బౌలర్లు సైతం టీ20 ర్యాంకింగ్స్ లో టాప్ లోనే ఉన్నారు. గత ఏడాదిన్నర నుంచి భారత్ ఎన్నో టీ20 సిరీస్ లు నెగ్గింది.



















