Shakib Al Hasan Suspension: బంగ్లా స్టార్ షకీబ్‌కు వరుస షాకులు.. నిషేధం విధించిన ఐసీసీ.. చిక్కుల్లో పడిన స్టార్ ఆల్ రౌండర్
Shakib Al Hasan: బంగ్లాదేశ్ వెటరన్ ఆల్ రౌండర్ షకీబ్ చిక్కుల్లో పడ్డాడు. సందేహాస్పద బౌలింగ్ యాక్షన్ పై ఐసీసీ నిషేధం విధించింది. అంతకుముందే ఈసీబీ కూడా అతనిపై వేటు వేసింది.
Cricket News: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకిబల్ హసన్ కు ఊహించని షాక్ తగిలింది. తన బౌలింగ్ యాక్షన్ నిబంధలకు అనుగుణంగా లేదని తేల్చిన అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) తాజాగా అతను బౌలింగ్ చేయకుండా నిషేధించింది. ఇది వెంటనే అమల్లోకి వస్తుందని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు తాజాగా తెలిపింది. ఐసీసీ తాజా నిర్ణయతో అతను డొమెస్టిక్ క్రికెట్ సహా ఎక్కడా బౌలింగ్ చేయడానికి వీలు లేకుండా పోయిందని వివరించింది. ఇప్పటికే అతని బౌలింగ్ యాక్షన్ పై ఇంగ్లాండ్, వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) కఠిన నిర్ణయం తీసుకుని నిషేధించిన సంగతి తెలిసిందే. దీంతో అతడు కౌంటీ క్రికెట్ లో బౌలింగ్ చేయకుండా నిషేధం పడింది. తాజాగా ఐసీసీ కూడా ఈ విషయాన్ని నిర్దారించడంతో అతను ప్రస్తుతం బౌలింగ్ చేయడానికి అనర్హుడిగా మారాడు.
నిబంధనలు అతిక్రమించి..
నిజానికి బౌలింగ్ యాక్షన్ కు సంబంధించి ఐసీసీ కొన్ని నిబంధనలను పొందు పర్చింది. బౌలింగ్ వేసేటప్పుడు మోచేయి 15 డిగ్రీలకు మించి వంచకూడదు. అయితే షకీబ్ బౌలింగ్ వేసేటప్పుడు ఈ నిబంధనను పాటించడం లేదని అందుకే అతనిపై వేటు వేసినట్లు తెలుస్తోంది. దీంతో అతని ముందు వేరే ప్రత్యామ్నాయం లేదు. తన బౌలింగ్ శైలిని నిబంధనలకు అనుగుణంగా మార్చుకుని, ఐసీసీ నుంచి అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అప్పటివరకు అతను బౌలింగ్ చేయడానికి వీలు లేదు. ఇక బౌలింగ్ యాక్షన్ పై గతంలోనూ పలువురు క్రికెటర్లపై ఆరోపణలు వచ్చాయి. శ్రీలంక లెజెండ్ ముత్తయ్య మురళీధరన్, పాక్ క్రికెటర్ సయ్యద్ అజ్మల్, వెస్టిండీస్ క్రికెటర్ సునీల్ నరైన్ తదితరలపై ఆరోపణలు వచ్చాయి.
Also Read: Ind Vs Aus 3rd Test Highlights: బ్రిస్బేన్ టెస్టులో భారత్ ఎదురీత-టాపార్డర్ విఫలం-రాహుల్ ఒంటరి పోరాటం
టెస్టులకు గుడ్ బై..
నిజానికి 37 ఏళ్ల షకీబల్ హసన్.. ఈ ఏడాదే టెస్టుల నుంచి వైదొలిగాడు. భారత్ తో జరిగిన టెస్టు సిరీసే అతనికి ఆఖరుది. అయితే సౌతాఫ్రికాతో సొంతగడ్డపై మీర్పూర్ లో జరిగే టెస్టులో బరిలోకి దిగి టెస్టులకు రిటైర్మెంట్ పలకాలని భావించినా, దేశంలో అల్లర్ల కారణంగా వీలుకాలేదు. అతను మాజీ ప్రధాని షేక్ హసీనాకు చెందిన పార్టీలో ఎంపీగా వ్యవహరించడంతో అతనిపై వ్యతిరేకత పెల్లుబుకింది. దీంతో అతను సొంతగడ్డపై అడుగు పెట్ట లేక పోయాడు. దీంతో అతను విదేశాల్లోనే ఉంటూ వివిధ లీగం ఆడుతూ కాలం గడుపుతున్నాడు. తాజాగా అతని బౌలింగ్ యాక్షన్ పై నిషేధం విధించడంతో షకీబ్ ఇబ్బందుల్లో పడ్డాడని తెలుస్తోంది. ప్రస్తుతం కేవలం వన్డేలకు మాత్రమే పరిమితమైన షకీబ్ ను బీసీబీ పట్టించుకోవడం లేదు. తాజాగా వెస్టిండీస్, అంతకుముందు అఫ్గానిస్థాన్ తో వన్డేలకు తను ఎంపిక కాలేదు. దీంతో అనతి అంతర్జాతీయ కెరీర్ ముగిసినట్లేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇక 2006లొ అరంగేట్రం చేసిన షకీబ్.. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లు కలిపి 447 అంతర్జాతీయ మ్యాచ్ లు ఆడాడు. ఇందులో 14 సెంచరీలు ఉన్నాయి. అన్ని ఫార్మాట్లు కలిపి 700 వికెట్లు తీశాడు.
Also Read: Sports Year Ender 2024: ఈ ఏడాది క్రికెట్ కు వీడ్కోలు పలికిన ఆటగాళ్లు వీళ్లే- లిస్టులో షాకింగ్ ప్లేయర్లు