Tilak Varma Gift to His Father: లగ్జరీ కార్లంటే తిలక్ వర్మకు చాలా ఇష్టం, ఇటీవల తండ్రికి EV గిఫ్ట్ ఇచ్చిన భారత క్రికెటర్
Tilak Varma Family Photo | ఆసియా కప్ 2025 హీరో తిలక్ వర్మ కొన్ని రోజుల కిందట తండ్రికి మహీంద్రా XUV 9E బహుమతిగా ఇచ్చాడు. తిలక్ వర్మ కార్ల కలెక్షన్ గురించి తెలుసుకుందాం.

ఆసియా కప్ 2025 ఫైనల్‌లో భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మ ఇన్నింగ్స్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఫైనల్లో భారత్ విజయానికి తిలక్ వర్మ 69 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మైదానంలో తన దూకుడు బ్యాటింగ్‌తో పేరు తెచ్చుకున్న తిలక్ వర్మకు లగ్జరీ, పవర్ ఫుల్ కార్లు అంటే ఇష్టం. ఇటీవల ఆసియా కప్ ప్రారంభానికి కొన్ని రోజులముందు తన తండ్రికి ఎలక్ట్రిక్ SUV బహుమతిగా ఇచ్చాడు. ఈ EV ఫీచర్లు, ధర వివరాలు తెలుసుకుందాం.
తండ్రికి బహుమతిగా మహీంద్రా XEV 9E ఇచ్చిన తిలక్
వాస్తవానికి ఆసియా కప్ కోసం జట్టును ప్రకటించిన కొన్ని రోజులకు తిలక్ వర్మ తన తండ్రికి మహీంద్రా XEV 9E బహుమతిగా ఇచ్చాడు. తన తల్లిదండ్రులు, సోదరుడితో కలిసి ఈ కొత్త EV ముందు పోజులు దిగాడు. వాటిని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్ అయ్యాయి. మహీంద్రా కంపెనీ తమ అధికారిక హ్యాండిల్ కూడా తిలక్ వర్మ ఫ్యామిలీకి సంబంధించిన ఈ ఆనందకరమైన క్షణాన్ని పంచుకుంది.
XEV 9E ధర, రేంజ్ ఎంత..
తన కెరీర్ కోసం ఎంతగానో శ్రమించిన తండ్రికి తిలక్ వర్మ XEV 9Eలో ఎలక్ట్రిక్ SUV స్టీల్త్ బ్లాక్ కలర్ వేరియంట్‌ను ఎంచుకున్నాడు. దీని ధర రేంజ్‌ను బట్టి రూ. 21.90 లక్షల నుంచి రూ. 31.25 లక్షల వరకు ఉంది. తిలక్ ఈ కారు టాప్-స్పెక్ వేరియంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఇందులో 79 kWh బ్యాటరీ ఉంది. ఈ వేరియంట్ ఒకసారి ఛార్జింగ్ చేస్తే 542 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.
పవర్, పనితీరు
మహీంద్రా XEV 9E పవర్‌లోనూ అద్భుతంగా ఉంది. ఇందులో అమర్చిన ఎలక్ట్రిక్ మోటార్ 282 bhp పవర్, 380 Nm టార్క్ జనరేట్ చేస్తుంది. మోడ్రన్ ఫీచర్లతో కూడిన ఈ SUVతో డ్రైవింగ్ తేలికగా ఉంటుంది. మీకు బెస్ట్ డ్రైవింగ్, జర్నీ ఎక్స్‌పీరియన్స్ అందిస్తుంది.
తిలక్ వర్మ కార్ కలెక్షన్
ఇతర భారత క్రికెటర్లు ధోనీ, రోహిత్, కోహ్లీ అంతగా కాకపోయినా తిలక్ వర్మ గ్యారేజ్‌లో కూడా చాలా ఖరీదైన కార్లు ఉన్నాయి. వీటిలో మెర్సిడెస్-బెంజ్, BMW, హ్యుందాయ్ క్రెటా వంటి కార్లు ఉన్నాయి. తిలక్ ఆటను మాత్రమే కాకుండా లగ్జరీ కార్లను ఇష్టపడతాడని సన్నిహితులు చెబుతున్నారు. తిలక్ వర్మకు కార్లతో పాటు బైక్స్ అంటే కూడా ఇష్టం. అతనికి అడ్వెంచర్ స్పోర్ట్స్ అంటే కూడా ఇష్టం, అతను తరచుగా తన అడ్వెంచర్ ఈవెంట్స్ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉంటాడు.





















