Abhishek Sharma: కౌంటర్ల వెంట తిప్పిప్లైట్ మిస్సయ్యేలా చేశారు - చెత్త సర్వీస్ అంటూ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై టీమిండియా టీ20 స్టార్ ఆగ్రహం
Abhishek: టీమిండియా స్టార్ క్రికెటర్ అభిషేక్ శర్మ ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ధ్వజమెత్తాడు. ఈ సంస్థ కారణంగా తాను చాలా ఇబ్బందులకు గురైనట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

Abhishek Vs Indigo: భారత టీ20 సంచలనం అభిషేక్ శర్మ.. తాజాగా ఇండిగో ఎయిర్‌లైన్స్‌పై ధ్వజమెత్తాడు. సంస్థ కారణంగా తను చాలా ఇబ్బందులు పడినట్లు సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. తనకు ఒక్కరోజు హాలిడే దొరికిందని, ఇండిగో సిబ్బంది నిర్వాకం వల్ల అది పూర్తిగా వేస్టయిపోయిందని పేర్కొన్నాడు. నిజానికి తను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పకపోయినా, ఈ ఘటన ఢిల్లీ ఎయిర్‌పోర్టులో జరిగిందని పేర్కొన్నాడు. చెకిన్ వెళ్తున్న తను సిబ్బంది కారణంగా చాలా కష్టాలు పడినట్లు, ఆ తర్వాత ఫ్లైట్ ఎక్కలేకపోయానంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. అభిషేక్ తాజా ప్రకటన సోషల్ మీడియాలో వైరలైంది. చీప్ రేట్లతో ఆకట్టుకునే ఇండిగో సర్వీస్ కూడా చీప్‌గానే ఉందని పులువురు వ్యాఖ్యానిస్తున్నారు. అభిషేక్‌కు జరిగిన దానికి జాలిపడిన ఫ్యాన్స్, ఆ సంస్థను తిడుతూ కామెంట్లు పెడుతున్నారు.
Abhishek Sharma Insta Story ✍🏻 pic.twitter.com/RQAeUWYaxV
— RVCJ Media (@RVCJ_FB) January 13, 2025
ఇంతకీ ఏమయ్యిందంటే..
నిజానికి అభిషేక్ తన వ్యక్తిగత పని నిమిత్తం వేరే ఊరు వెళ్లడానికి ఇండిగో విమానంలో టికెట్ బుక్ చేసుకున్నాడు. అయితే ప్రయాణించే తేది నేరుగా ఢిల్లీ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న అభిషేక్‌కు చేదు అనుభవం ఎదురైంది. తనను త్వరగా చెకిన్ చేయకుండా విసిగించారు. అటు ఇటు అని వివిధ కౌంటర్లకు తిప్పించారు. ముఖ్యంగా కౌంటర్ మేనేజర్ సుస్మితా మిట్టల్ వల్ల తను ఇలా ఇబ్బందులు పడినట్లు తెలిపాడు. తీరా అభిషేక్ ఈ బిజీలో ఉండగానే చెకిన్ సమయం ముగిసిందటూ చావుకబురు చల్లగా చెప్పారు. దీంతో తను ప్రయాణించ లేకపోయినట్లు పేర్కొన్నాడు. జరిగిన దానిలో ఇండిగో ఎయిర్ లైన్స్ నిర్లక్ష్యం కనిపిస్తోందని, సంఘటన జరిగాక కనీసం క్షమాపణ కూడా చెప్పలేదని అభిషేక్ ఆరోపించాడు. ఈ విషయాలన్నీ సోషల్ మీడియాలో రాసుకొచ్చాడు. దీనిపై అభిమానులు ప్రస్తుతం షేర్లు, కామెంట్లతో స్పందిస్తున్నారు.
చెత్త ఎయిర్‌లైన్ ఇండిగో..
ఇక గతేడాది ఎయిర్ హెల్ప్ రిపోర్టు 2024 సర్వేలో భారత్ నుంచి ఇండిగో అత్యంత చెత్త ఎయిర్‌లైన్ అని సర్వేలో తేలింది. మొత్తం 109 ఎయిర్‌లైన్లకు ర్యాంకులు కేటాయించగా, అందులో ఇండిగో అట్టడుగున 103వ ర్యాంకు దక్కించుకుంది. దీనిపై అప్పట్లోనే ప్రయాణికులు పెదవి విరిచారు. ఇండిగో ఎయిర్‌లైన్ సర్వీస్ బాగుండదని ఈ సర్వే సందర్భంగా చెప్పుకొచ్చారు. ఇక ఈ సర్వేలో ఉత్తమంగా ఎయిర్ ఇండియా సంస్థ 61వ ప్లేస్ దక్కించుకుంది. ఎయిర్ ఆసియా 91వ స్థానం దక్కించుకుంది. మరోవైపు సర్వే తప్పులతడకగా జరిగిందంటూ ఇండిగో ఆరోపించింది. తాము కార్యకలాపాలు జరిపే భారత్ నుంచి సరైన సంఖ్యలో శాంపిల్ సైజ్ తీసుకోలేదని ఆక్షేపించింది. డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏవియేషన్ నిబంధనలకు లోబడి తాము సర్వీస్ చేస్తున్నామని సమర్థించుకుంది. ఏదేమైనా అభిషేక్ లాంటి క్రికెట్ స్టార్ సంస్థపై తీవ్ర వ్యాఖ్యలు చేయడం సంస్థకు ఇబ్బందేనని చెప్పాలి. దీనిపై మరి సంస్థ ఏదైనా చర్యలు తీసుకుని, ఏమైనా వివరణ ఇస్తుందో చూడాలని క్రికెట్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.




















