By: ABP Desam | Updated at : 18 Mar 2023 10:50 PM (IST)
Edited By: Ramakrishna Paladi
సోఫీ డివైన్ ( Image Source : WPL )
RCB vs GGW:
వామ్మో..! ఓరి నాయనో! ఏం కొట్టుడు భయ్యా ఇదీ! ఆఫ్‌సైడ్ లేదు.. లెగ్ సైడ్ లేదు.. స్ట్రెయిట్ లేదు..! బౌలర్ ఎక్కడన్నా వేయనీ నేను బాదేది సిక్సరే అన్నట్టుగా చెలరేగింది సోఫీ డివైన్ (99; 36 బంతుల్లో 9x4, 8x6). దాంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు లీగులోనే అతిపెద్ద టార్గెట్‌ను అత్యంత సునాయాసంగా ఛేదించింది. 15.3 ఓవర్లకే 2 వికెట్ల నష్టానికి 189 టార్గెట్‌ను ఉఫ్ అని ఊదేసింది. 8 వికెట్ల తేడాతో విజయ ఢంకా మోగించింది. ఓపెనర్ స్మృతి మంధాన (37; 31 బంతుల్లో 5x4, 1x6) రాణించింది. అంతకు ముందు గుజరాత్‌లో ఓపెనర్ లారా వూల్‌వర్ట్ (68; 42 బంతుల్లో 9x4, 2x6) వరుసగా రెండో హాఫ్ సెంచరీ బాదేసింది. యాష్లే గార్డ్‌నర్ (41; 26 బంతుల్లో 6x4, 1x6) మెరుపు ఇన్నింగ్స్ ఆడేసింది.
స్టాండ్స్‌లోకి బంతులు!
ఆర్సీబీ అంటే ఇదీ! అభిమానులు ఎక్స్‌పెక్ట్ చేసింది ఇదీ! స్టార్లు కొట్టాల్సిన తీరు ఇదీ! గెలిచే పద్ధతి ఇదీ! విమెన్ ప్రీమియర్ లీగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అద్వితీయ ఛేదన చేసింది. సరికొత్త చరిత్ర సృష్టించింది. ఓపెనర్లు సోఫీ డివైన్, మంధాన తొలి వికెట్‌కు ఏకంగా 125 (57) పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. రెండో ఓవర్ నుంచే డివైన్ ఊచకోత మొదలు పెట్టింది. యాష్లే గార్డ్‌నర్ వేసిన ఈ ఓవర్లో వరుసగా 6,4,4,6,4 దంచింది. మరోవైపు స్మృతి సైతం ఫామ్ అందుకోవడంతో ఆర్సీబీ 6 ఓవర్లకే 77 పరుగులు చేసింది. 8 ఓవర్లకు 100ను చేరుకుంది.
99 వద్ద ఔట్
కన్వర్ వేసిన 9వ ఓవర్లోనూ డివైన్ మూడు సిక్సర్లు, ఒక బౌండరీతో 25 రన్స్ సాధించింది. అయితే 9.2వ బంతికి మంధానను స్నేహ రాణా ఔట్ చేయడంతో ఈ భాగస్వామ్యం విడిపోయింది. అయినా డివైన్ దంచుడు ఆపలేదు. 11.1 ఓవర్లకే స్కోరును 150కి చేర్చింది. 20 బంతుల్లో 50 కొట్టిన డివైన్ ఇదే దూకుడుతో 35 బంతుల్లోనే 99కి చేరుకుంది. సింగిల్ తీసి సెంచరీ చేస్తే బాగుండేది. కానీ యాష్ గార్త్ ఆఫ్‌సైడ్ వేసిన 11.5వ బంతిని భారీ షాట్ ఆడబోయి గాల్లోకి లేపింది. ఫ్లాట్‌గా వెళ్లిన బంతిని అశ్విని గాల్లోకి ఎగిరి అద్భుతంగా అందుకుంది. ఆ తర్వాత ఎలిస్ పెర్రీ (19*), హీథర్ నైట్ (22*) జట్టుకు విజయం అందించారు.
BOOM 💥
— Women's Premier League (WPL) (@wplt20) March 18, 2023
6️⃣4️⃣4️⃣6️⃣4️⃣@RCBTweets have crossed FIFTY in the fourth over 🔥🔥
Follow the match ▶️ https://t.co/uTxwwRnRxl#TATAWPL | #RCBvGG pic.twitter.com/8B18NN4TRI
దంచిన లారా!
మొదట బ్యాటింగ్ తీసుకుందే బాదడానికి అన్నట్టుగా ఆడింది గుజరాత్! మొదటి ఓవర్ నుంచే ఓపెనర్లు సోఫియా డాంక్లీ (16), లారా వూల్‌వర్ట్ ఆర్సీబీ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. అయితే జట్టు స్కోరు 27 వద్ద సోఫియాను డివైన్ బౌల్డ్ చేసింది. ఆ తర్వాత సబ్బినేని మేఘన (31; 32 బంతుల్లో 4x4) అండతో లారా రెచ్చిపోయింది. తనను వేలంలో ఎవరూ కొనలేదేమోనన్న కసో ఏంటో ఆకాశమే హద్దుగా చెలరేగింది. పవర్‌ప్లే ముగిసే సరికి 45/1తో నిలిపింది. రెండో వికెట్‌కు 55 బంతుల్లో 63 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పింది. తెలుగమ్మాయి మేఘన సైతం కొన్ని చక్కని షాట్లు ఆడింది. ప్రీతి బోస్ బౌలింగ్‌లో ఆమెను రిచా స్టంపౌట్ చేసింది. అప్పటికి గుజరాత్ స్కోరు 90.
గార్డ్‌నర్ మెరుపులు
మేఘన ఔటైనా బెంగళూరు కష్టాలు తీరలేదు. యాష్లే గార్డ్‌నర్, లారా ఇద్దరూ బాదుడు షురూ చేశారు. వీరిద్దరూ మూడో వికెట్‌కు 32 బంతుల్లోనే 52 పరుగులు భాగస్వామ్యం అందించారు. ఇద్దరూ ఎడాపెడా బాదేయడంతో 17.4 ఓవర్లకు జట్టు స్కోరు 150కి చేరింది. అయితే 30 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసిన లారాను అంతకు ముందే శ్రేయాంక పాటిల్ ఔట్ చేసింది. గార్డ్‌నర్‌ను సైతం ఆమే ఎల్బీ చేసింది. ఆఖర్లో హేమలత (16; 6 బంతుల్లో 2x4, 1x6), హర్లీన్ డియోల్ (12; 5 బంతుల్లో 1x4, 1x6) బౌండరీలు, సిక్సర్లు బాదడంతో స్కోరు 188/4కు చేరింది.
Pragyan Ojha on Rohit Sharma: కిట్ కొనేందుకు పాల ప్యాకెట్లు అమ్మిన రోహిత్ శర్మ! అడిగితే ఎమోషనల్!
Ganguly on Rishabh Pant: అలాంటి ఆటగాళ్లు ఈజీగా దొరకరు బాబూ - గంగూలీ!
Highest Runs Record: మూడు చారిత్రాత్మక రికార్డుల్లో దక్షిణాఫ్రికా - ఏ జట్టుకైనా సాధ్యం అవుతుందా?
Quinton de Kock: క్వింటన్ డికాక్ స్పెషల్ రికార్డు - ఎవ్వరికీ సాధ్యం కానిది!
IPL 2023: కెప్టెన్లను ఫైనల్ చేసిన అన్ని జట్లు - కోల్‌కతా కెప్టెన్‌గా సర్ప్రైజ్ ప్లేయర్!
Jagan G 20: ప్రతి ఒక్కరికీ ఇల్లు కల్పించాలన్నది మా ఉద్దేశం - విశాఖ జి-20 సదస్సులో సీఎం జగన్
TSLPRB Exam: కానిస్టేబుల్ టెక్నికల్ ఎగ్జామ్ హాల్‌టికెట్లు విడుదల, పరీక్ష ఎప్పుడంటే?
Taapsee Pannu: నటి తాప్సి పన్నుపై కేసు నమోదు - హిందువుల మనోభావాలు దెబ్బతీసిందని ఫిర్యాదు
TDP Manifesto : ప్రతి పేదవాడి జీవితం మారేలా మేనిఫెస్టో, కసరత్తు ప్రారంభించిన టీడీపీ!