Avani lekhara: అంతులేని వ్యథ.. అవని గాథ.. ఆ ప్రమాదం ఆమెను కదలకుండా చేసింది, కానీ..
పారాలింపిక్స్ వేదికపై భారత జాతీయ గీతాన్ని సగర్వంగా వినిపించేలా చేసింది అవని లేఖరా. ఈమెది రాజస్థాన్లోని జైపూర్. ఇప్పుడామె ఇండియాలో ఓ స్పూర్తి ప్రదాత.
2012 వ సంవత్సరం. అప్పుడు అవనికి పదకొండేళ్లు. అమ్మానాన్న తమ్ముడితో కలిసి కారులో బంధువుల ఇంటికి వెళుతోంది. వారింట్లో ఆనందంగా గడిపాక తిరిగి ఇంటికి పయమైంది ఆ కుటుంబం. సాఫీగా సాగుతున్న ప్రయాణంలో పెద్ద కుదుపు. కారు అంతెత్తుకు ఎగిరి కిందపడింది. లోపలున్న నలుగురూ తీవ్రగాయాల పాలయ్యారు. ఆమె అమ్మానాన్న, తమ్ముడికి తగిలిన గాయాలు కాలం గడిచే కొద్దీ మానిపోయాయి. కానీ అవనికి తగిలిన గాయం మాత్రం వైద్యులు కూడా మాన్పలేకపోయారు. ఆమె వెన్నుపూసకు బలంగా దెబ్బతగిలి, నడుము నుంచి కింద భాగమంతా చచ్చుబడి పోయింది. పూర్తిగా చక్రాల కూర్చీకే పరిమితమైపోయింది. పదకొండేళ్ల అవనికి లోకం చీకటిగా అనిపించింది.
Also read: ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులే డబ్బులు.. ఇదిగో ఇలా సంపాదించండి
చాలా రోజులు ఇంటి గడప కూడా దాటలేదు అవని. అమ్మానాన్నతో కూడా ఎక్కడికీ వెళ్లేది కాదు. ఇంట్లోనే దిగాలుగా ఉండేది. అలాంటి సమయంలో తల్లిదండ్రులే వెన్నుదన్నుగా నిలిచారు. అలా ఇంట్లోనే ఉండిపోతే కూతురికి మానసిక సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని అర్థం చేసుకున్నారు. అవని తండ్రి ప్రవీణ్ రెవెన్యూ డిపార్టుమెంటులో ఉద్యోగి. ఆయన అవనికి ఏదో ఒక క్రీడ నేర్పించాలని అనుకున్నారు. కాళ్లతో పనిలేని క్రీడ ‘షూటింగ్’. చూపు, చేతులు సక్రమంగా ఉంటే చాలు షూటింగ్ నేర్చుకోవచ్చు. ఆయన అవనిని ఒప్పించి షూటింగ్ అకాడమీకి తీసుకెళ్లారు. ఆయనకు తెలుసు తన కూతురికి స్కూల్లో చదువుతో పాటూ డ్యాన్సులు, ఆటలు వంటి వాటిల్లో పాల్గొనడం చాలా ఇష్టమని. అందుకే ఆమె మనసును మళ్లించేందుకు ఇలా షూటింగ్లో జాయిన్ చేశారు.
2015లో తొలిసారి అవనికి షూటింగ్ పరిచయమైంది. ఏడాదిలోనే ఆమె షూటింగ్ కు అభిమాని అయింది. పారాలింపిక్స్ లో పాల్గొనాలన్న ఆలోచనతో శిక్షణ తీసుకోవడం ప్రారంభించింది. ఆమె మొదటి కోచ్ చంద్రశేఖర్. ఆయన మాట్లాడుతూ ‘మొదట్లో అవని చాలా వీక్ గా ఉండేది. బరువైన తుపాకి పట్టుకోలేకపోయింది. అందుకే నేను మొదట చాలా తేలికగా ఉండే పిస్తోలుతో శిక్షణ ప్రారంభించాను’ అని చెప్పుకొచ్చారు.
Also read: ఏం కావాలన్నా ఇంటికే తెచ్చిపెట్టే గ్రామీణ స్టార్టప్.. డెలివరీ ఛార్జ్ ఒక్క రూపాయే
ఆమె తొలిసారి 2017లో అబుదాబిలో జరిగిన వరల్డ్ కప్ టోర్నమెంట్లో పాల్గొంది. అప్పట్నించి ప్రతి ఏడాది పోటీల్లో పాల్గొనడం ప్రారంభించింది. 2018లో దుబాయ్ లో జరిగిన ‘వరల్డ్ షూటింగ్ పారా స్పోర్ట్ వరల్డ్ కప్’లో 10 మీటర్ల రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించింది. అదే ఆమె తొలి గోల్డ్ మెడల్. 2019లో భోపాల్ లో జరిగిన 63వ నేషనల్ షూటింగ్ ఛాంపియన్ షిప్ లో మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది. అలాగే ఢిల్లీలో జరిగిన పోటీల్లో కూడా మూడు గోల్డ్ మెడల్స్ సాధించింది.
పారాలింపిక్స్ లక్ష్యంగా అవని తన కోచ్ సుమ ఆధ్వర్యంలో కఠోర శిక్షణ తీసుకుంది. టోక్యోలో జరిగిన పారాలింపిక్స్ రెండు పతకాలు గెలిచి చరిత్ర సృష్టించింది. మహిళల పది మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణపతకం గెలిచిన తొలి భారత మహిళగా అవని రికార్డు సాధించింది. అలాగే 50 మీటర్ల రైఫిల్ షూటింగ్ విభాగంలో కాంస్యం సాధించింది. ఇప్పుడు అవని సాధారణ అమ్మాయి కాదు, ఓ స్పూర్తి ప్రదాత. ఓ విజేత.
Also read: గాల్లో జీవితాలు.. ఎయిర్ పోల్యూషన్‌తో ఆ సమస్యలు తప్పవంటున్న తాజా అధ్యయనం