Asian Games 2023: బ్యాడ్మింటన్‌లో భారత్ కు తొలి స్వర్ణం- చరిత్ర సృష్టించిన సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి
India badminton gold medal winners: బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. కొరియా జోడీపై నెగ్గి స్వర్ణాన్ని ముద్దాడారు.
India badminton gold medal winners:
ఆసియా క్రీడల్లో భారత ఆటగాళ్లు సరికొత్త చరిత్ర లిఖించారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఎడిషన్ లో 100 పతకాల మార్కు దాటారు. నేటి ఉదయం సైతం పలు విభాగాలలో భారత్ కు స్వర్ణాలు దక్కగా, తాజాగా బ్యాడ్మింటన్ డబుల్స్ విభాగంలో ఏషియన్ గేమ్స్ చరిత్రలో తొలిసారిగా స్వర్ణ పతకం భారత్ కైవసం చేసుకుంది. డబుల్స్ ఫైనల్లో తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్- చిరాగ్ శెట్టి జంట కొరియా ఆటగాళ్లు చో సోల్గూ, కిమ్ వోంగూ పై 21-18, 21-16 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించారు. ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ విభాగంలో భారత్ నెగ్గిన తొలి స్వర్ణం ఇది.
అంతకుముందు ఆసియా క్రీడల్లో బ్యాడ్మింటన్ డబుల్స్‌లో ఫైనల్ చేరిన తొలి జంటగా సాత్విక్ సాయిరాజ్-చిరాగ్ శెట్టి జంట నిలచింది. అంతర్జాతీయ స్థాయిలో నిలకడగా రాణిస్తున్న సాత్విక్- చిరాగ్ జంట శుక్రవారం జరిగిన సెమీఫైనల్లో 21-17, 21-12 తేడాతో మలేషియాకు చెందిన ఆరోన్ చీ-సోహ్ యీక్ పై ఘనవిజయం సాధించారు. ఇప్పటికే పురుషుల సింగిల్స్‌లో 41 ఏళ్ల తర్వాత హెచ్‌ఎస్ ప్రణయ్ తొలి కాంస్య పతకం నెగ్గాడు.
బ్యాడ్మింటన్ డబుల్స్ లో సాత్విక్, చిరాగ్ శెట్టి వరల్డ్ నెంబర్ 2లో కొనసాగుతున్నారు. చైనాలోని హాంగ్జౌలో జరుగుతన్న 19వ ఏషియన్ గేమ్స్ లో వీరు సాధించిన స్వర్ణంతో భారత్ ఖాతాలో 101వ పతకం చేరింది. భారత్ స్వర్ణాల సంఖ్య 26 కాగా, కబడ్డీ, క్రికెట్ విభాగాల్లోనూ భారత ఆటగాళ్లు గోల్డ్ సాధించారు. శనివారం జరిగిన ఫైనల్స్ లో విజేతలుగా నిలిచి త్రివర్ణ పతకాన్ని రెపరెపలాడించారు. 19వ ఏషియన్ గేమ్స్ లో భారత్ 104 పతకాలు సాధించగా.. అందులో 28 స్వర్ణాలు, 35 రజతాలు, 41 కాంస్యాలు ఉన్నాయి. ఈ ఎడిషన్ కు ముందు వరకు భారత్ అత్యుత్తమం 70 పతకాలు అని తెలిసిందే.
తెలుగు తేజం సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి జోడీ 58 ఏళ్లలో భారత్ కు తొలి స్వర్ణ పతకం అందించారు. ఆసియా గేమ్స్ బ్యాడ్మింటన్ లో 1965లో దినేశ్ ఖన్నా పురుషుల సింగిల్స్‌లో భారత్‌కు స్వర్ణం తెచ్చాడు. 1971లో దీపు ఘోష్, రామన్ ఘోష్ జంట డబుల్స్ లో కాంస్య పతకం సాధించారు.
🇮🇳's Historic Gold in Badminton 🥇🏸@satwiksairaj and @Shettychirag04 soar to victory in the Badminton Men's Doubles finals, clinching the coveted Gold Medal for the 1️⃣st time ever in the Asian Games history🏆🇮🇳
— SAI Media (@Media_SAI) October 7, 2023
Their incredible teamwork and unwavering spirit have made India… pic.twitter.com/iRqNLRHTs2
3 స్వర్ణాలు నెగ్గిన జ్యోతి సురేఖ
భారత స్టార్, తెలుగమ్మాయి జ్యోతి సురేఖ భారత్‌కు మరో పసిడి పతకాన్ని అందించి సత్తా చాటింది. ముచ్చటగా మూడో స్వర్ణం సాధించి భారత కీర్తి పతాకను చైనా గగనతలంపై రెపరెపలాడించింది. ఇప్పటికే ఆర్చరీ కాంపౌండ్ వుమెన్స్ టీమ్ విభాగంలో స్వర్ణం గెలిచిన జ్యోతిసురేఖ... ఆర్చరీ కాంపౌండ్ మిక్స్‌డ్ విభాగంలోనూ పసిడి పతకం అందుకుంది. తాజాగా ఆర్చరీ మహిళల వ్యక్తిగత విభాగం ఫైనల్లో 149-145తో విజయం సాధించి స్వర్ణాన్ని ముద్దాడింది. ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సో చెవాన్‌పై జ్యోతిసురేఖ అద్భుత ఆటతీరుతో గెలుపొందింది.