Vontimitta Kalyanam 2022: పున్నమి వెన్నెల్లో సీతారాముల కళ్యాణ వైభవం
రాముడు అయోధ్యలో జన్మించినా వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశాడంటారు. అందుకే దక్షిణభారతం పొడవునా రామాయణ ఘట్టాలకి సంబంధించిన క్షేత్రాలు కనిపిస్తూ ఉంటాయి. వాటిలో ఒంటిమిట్ట కూడా ఒకటి.
![Vontimitta Kalyanam 2022: పున్నమి వెన్నెల్లో సీతారాముల కళ్యాణ వైభవం Vontimitta Kalyanam 2022: Sri Sitaramula kalyanam in Ontimitta temple, Purnima Special Know in details Vontimitta Kalyanam 2022: పున్నమి వెన్నెల్లో సీతారాముల కళ్యాణ వైభవం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/04/15/b94efba46a38aaf480be782fe384d891_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
దేశ వ్యాప్తంగా ఉన్న రామాయలయాల్లో శ్రీరామనవమి వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతాయి. అయితే వీటన్నింటి కన్నా ఒంటిమిట్ట చాలా ప్రత్యేకం. సాధారణంగా దేశ వ్యాప్తంగా ఏ రామాలయంలో చూసినా సీతారాముల కళ్యాణం చైత్ర మాసం నవమి రోజు పగలు జరిగితే..ఒంటిమిట్టలో మాత్రం చైత్ర పౌర్ణమి రోజు, వెన్నెల వెలుగుల్లో జరుగుతుంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత భద్రాచలం తెలంగాణ రాష్ట్రంలో ఉండటంతో...ఆంధ్రప్రదేశ్ భద్రాద్రిగా ఒంటిమిట్టను ప్రకటించింది అప్పటి ప్రభుత్వం. నాటి నుంచి ఈ క్షేత్రానికి గుర్తింపు పెరుగుతూ వస్తోంది.
జాంబవంతుడి ప్రతిష్ట
జాంబవంతుడు ఇక్కడ ఒక కొండపై ఆశ్రమం నిర్మించి రామతారక మంత్రాన్ని జపిస్తూ తపస్సు చేశాడట. జాంబవంతుడికి ఎదురుగా ఉన్న మరో గుట్టమీద నుంచి రఘురాముడు దివ్యదర్శనం ఇచ్చి వరాలు ప్రసాదించాడ. రామయ్యపై భక్తితో సీతారామలక్ష్మణ మూర్తులను ఒకే శిలపై మలచి.. జాంబవంతుడు ఇక్కడ ప్రతిష్టించినట్లు స్థలపురాణం చెబుతోంది.
Also Read: రాముడు మానవుడా - దేవుడా, ఆ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్
రాముడు నడయాడిన నేల
ప్రకృతి వైపరీత్యాలు, దోపిడీలు, దొంగతనాలు, దాడులు, ఘాతకాలకు తట్టుకుని నిలబడింది ఒంటిమిట్ట కోదండ రామాలయం. దీనికి ఏకశిలానగరం అనే పేరు కూడా ఉంది. సీత, రామ, లక్ష్మణుల ప్రతిరూపాలను ఒకే శిలలో విగ్రహాలుగా చెక్కారు అందుకే ఏకశిలా నగరం అనే పేరొచ్చింది. ఆ ఏకశిలకు దగ్గర్లోనే మృకండుడు అనే మహర్షి తపస్సు చేసుకునేవారట, రాములవారు అరణ్యవాసంలో భాగంగా అటు సంచరిస్తూ కొద్ది రోజులు మృకండునికి రక్షణగా ఇక్కడ ఉన్నారని స్థలపురాణం చెబుతోంది. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఈ ఆలయంలో కానరాకపోవడం మరో ప్రత్యేకత. రాములవారు ఆంజనేయుని కలవక ముందే ఇక్కడకు వచ్చారనీ... అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతారు. శతాబ్దాలుగా ఒంటిమిట్ట రామాలయం భక్తులకు పుణ్యతీర్థంగా ఉండేది, పోతన సైతం ఇక్కడే భాగవతాన్ని అనువదించాడనీ, అన్నమయ్య కూడా ఈ క్షేత్రాన్ని దర్శించాడనీ చెబుతారు.
ఒంటిమిట్ట ప్రాంతం 1340లో అరణ్యంగా ఉండేది. ఆ ప్రాంతంలో కేవలం మృకుండాశ్రమం మాత్రమే ఉండేది.బోయ నాయకులైన ఒంటడు–మిట్టడు అక్కడికి వచ్చిన రాజావారు కంపరాయులుకు అక్కడి రామతీర్థంలోని నీటిని ఇచ్చి దాహం తీర్చి ఉపచారాలు చేశారు. అప్పటికే శిథిలమై ఉన్న గుడిని చూపి అభివృద్ధి చేయాలని వారు రాజును కోరడంతో గుడినిర్మాణంతో పాటూ చెరువు నిర్మాణం కూడా తలపెట్టారట. ఆ బాధ్యతను ఒంటడు, మిట్టడులకు అప్పగించారు.
సీతారాముడి కళ్యాణం ఇక్కడ చాలా ప్రత్యేకం
ఈ విశేషాలన్నీ ఒకెత్తైతే శ్రీరామనవమి రోజు జరిపించాల్సిన కళ్యాణం చైత్ర పౌర్ణమి రోజు జరిపించడం మరింత విశేషం. పగటివేళ తాను రామకల్యాణాన్ని చూడలేకపోతున్నానని బాధపడుతున్న చంద్రుని ఊరడించేందుకు, రాములవారు ఇక్కడ రాత్రివేళ కళ్యాణం జరిగేలా వరాన్నిచ్చాడని చెబుతారు. మరో కథ ప్రకారం చంద్రవంశజులైన విజయనగరరాజులు తమ కులదైవానికి తృప్తికలిగేలా... రాత్రివేళ కల్యాణాన్ని జరిపించే ఆచారాన్ని మొదలుపెట్టారని కూడా అంటారు. కారణం ఏదైనా ఇతర రామాలయాలకు భిన్నంగా ఒంటిమిట్టలో రాములోరి కళ్యాణం పున్నమి కాంతుల్లో జరగడం ప్రత్యేకమే.
Also Read: కన్నుమూస్తూ రావణుడు లక్ష్మణుడికి చెప్పిన మాటలు నేటి పాలకులకు-మనకు కూడా వర్తిస్తాయ్
ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు
కోదండ రాముడి కళ్యాణం రాష్ట్ర ప్రభుత్వ అధికారిక వేడుక కావడం, రాష్ట్ర ప్రముఖులు హాజరుకానుండడంతో జిల్లా యంత్రాంగం టీటీడీతో కలిసి కట్టుదిట్టమైన భద్రత, ఇతర ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈరోజు సాయంత్రం కల్యాణానికి ముఖ్యమంత్రి జగన్ హాజరు కానున్నారు. శ్రీకోదండ రాముని కల్యాణానికి ప్రభుత్వం తరపున సీఎం జగన్ ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు. సాయంత్రం ఆరుగంటలకు ఒంటిమిట్ట చేరుకుని రాములవారి దర్శనం అనంతరం కళ్యాణ ప్రాంగణానికి చేరుకుంటారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)