Ujjaini Mahankali Bonalu: ఉజ్జయిని మహంకాళి బోనాలు, పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Secunderabad Bonalu 2025 | సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహా మంగళ హారతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు.

Ujjaini Mahankali Bonalu 2025: సికింద్రాబాద్ ఉజ్జయిని మహాకాళి బోనాల జాతర ఆదివారం అట్టహాసంగా ప్రారంభమైంది. డప్పు చప్పుళ్లు, పోతురాజుల వీరంగాలు.. ఘటాల ఊరేగింపుతో వేడుక మొదలైంది. అమ్మవారికి తెల్లవారుజామునే మహా మంగళ హారతి ఇచ్చి వేడుకలు ప్రారంభించారు. తెల్లవారుజామున 4 గంటలకు బ్రహ్మ ముహూర్తంలో.. హైదరాబాద్ జిల్లా ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ దంపతులు అమ్మవారిని దర్శించుకుని, తొలి పూజలు నిర్వహించారు. ప్రభుత్వం తరఫున పట్టు వస్త్రాలు, తొలి బోనం సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలకు మంత్రి బోనాల ఉత్సవాల శుభాకాంక్షలు తెలిపారు. ఉదయం 4:10 గంటలకు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త కుటుంబం తొలి బోనం సమర్పించింది.
పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
ఉజ్జయిని బోనాలు, లష్కర్ బోనాలుగా అని పిలిచే ఈ వేడుకలు రెండు రోజుల పాటు సాగనున్నాయి. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు భారీగా తరలివస్తున్నారు. అమ్మవారిని భారత రాష్ట్ర సమితి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ దర్శించుకున్నారు. ఈరోజు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి సీఎం రేవంత్‌రెడ్డి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ప్రత్యేక పూజలు చేయనున్నారు.
సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించడానికి వెళ్లిన రేవంత్ రెడ్డికి ఆలయ అధికారులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. మంత్రి కొండా సురేఖ అమ్మవారికి బోనం సమర్పించారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు, తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు.

2500మంది పోలీసులతో భారీ బందోబస్తు
నేడు బోనాలతోపాటు ఫలహారబండ్ల ఊరేగింపు నిర్వహిస్తారు. 14న రంగం, పోతరాజుల గావు, అంబారీపై అమ్మవారి ఊరేగింపు ఉండనుంది. ఆలయం వద్ద భక్తులకు ఇబ్బందులు లేకుండా 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. 2500మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. బోనాల సందర్భంగా ఈరోజు, రేపు హైదరాబాద్‌లో వైన్ షాపులు బంద్ పెట్టారు. పలుచోట్ల ట్రాఫిక్ ఆంక్షలు విధించారు.
కులీకుతుబ్‌షా కాలం నుంచే బోనాల వేడుకలు
ఆషాడమాసంలో రోజుల పాటు హైదరాబాద్ అంతటా బోనాల వేడుకలు వైభవంగా జరుగుతాయి. గోల్కొంట కోటలో బోనాలు ప్రారంభమై లాల్ దర్వాజతో ముగుస్తాయి. ఆషాడ మాస బోనాల్లో గోల్కొండ కోటపైన ఉన్న జగదాంబిక అమ్మవారికి తొలి బోనం సమర్పించే సంప్రదాయం కులీకుతుబ్‌షా కాలం నుంచి వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం అధికారిక పండుగగా బోనాల ఉత్సవాలను నిర్వహిస్తోంది. జంటనగరాల్లో బోనాల కోసం రూ.20 కోట్లు రిలీజ్ చేసింది.
ప్రత్యేక ఆకర్షణగా రంగం
జులై 14న జరిగే ‘రంగం’ కార్యక్రమం ఈ జాతరలో ప్రధాన ఆకర్షణ. ఈ సందర్భంగా భవిష్యవాణి వినిపించడం సంప్రదాయం. రంగంలో మట్టికుండపై భవిష్యవాణి వినిపిస్తారు. అదే రోజు అమ్మవారి అంబారీ ఊరేగింపు, ఫలహార బండ్ల ఊరేగింపు జరగనున్నాయి. జులై 20 ఓల్డ్ సిటీ లాల్ దర్వాజ సింహవాహిని అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు భక్తులు. జులై 23న చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పించనున్నారు.





















