Lashkar Bonalu 2025: లష్కర్ బోనాలకు సర్వం సిద్ధం..జూలై 14న రంగం, రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్!
Bonalu 2025: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి బోనం, పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులు. జూలై 13 మహంకాళి బోనాలకు సర్వం సిద్ధమైంది..

Ujjaini Mahankali Lashkar Bonalu 2025: సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ దంపతులకు ఘన స్వాగతం పలికారు హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్. ఈ సందర్భంగా అమ్మవారికి బోనం, పట్టువస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు గవర్నర్ దంపతులు..
జంట నగరాల్లో ఆషాఢ మాస బోనాలు వైభవంగా జరుగుతున్నాయి. జూన్ 26న గోల్కొండ జగదాంబికకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి గురువారం, ఆదివారాల్లో జంటనగరాల్లో ఉన్న అమ్మవార్లకు బోనాలు సమర్పిస్తున్నారు. జూలై 1న బల్కంపేట ఎల్లమ్మ కళ్యాణం కన్నులపండువగా జరిగింది. జూలై 13 ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి. ఈ రోజు అమ్మవారికి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లష్కర్ బోనం సమర్పిస్తారు. ప్రభుత్వం తరపున జిల్లా కలెక్టర్,దేవాదాయ శాఖ,పోలీసులు , జీహెచ్ ఎంసీ అధికారులు అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తిచేశారు. అయితే ప్రభుత్వం ఎన్ని ఏర్పాట్లు చేసినా ప్రజల సహకారం అవసరం అన్నారు హైదరాబాద్ ఇన్చార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేశామన్నారు. ఎంతో చారిత్రక ప్రాధాన్యత ఉన్న లష్కర్ బోనాల సందర్భంగా ప్రజలందరిపై అమ్మవారి ఆశీర్వాదం ఉండాలన్నారు. పాడిపంటలతో రాష్టంర సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని ప్రార్థించానని చెప్పారు పొన్నం ప్రభాకర్. గవర్నర్ గారు సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు..అమ్మవారి చరిత్ర, బోనాల విశిష్టత గురించి పూజారులను అడిగి తెలుసుకున్నాని చెప్పారు.
జూలై 13 ఆదివారం లష్కర్ బోనాలు
జూలై 14 భవిష్యవాణి రంగం కార్యక్రమం
ఈ నెల 13, 14వ తేదీల్లో బోనాల జాతర కోసం సికింద్రాబాద్ ఉజ్జయినీ మహాకాళి ఆలయంతో పాటు లష్కర్‌లో అమ్మవారి ఆలయాలను సిద్ధం చేస్తున్నారు. మొత్తం 2,500 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు నార్త్ జోన్ డీసీపీ రష్మీ పెరుమాళ్ చెప్పారు. దేవాలయ ఆవరణలో ఉత్సవ కమిటీతోపాటు నిర్వాహకులతో నిర్వహించిన సమావేశంలో ఏర్పాట్లు గురించి వివరించారు. శివసత్తులు, జోగినీలు జూలై 13 ఆదివారం మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 3 గంటల వరకు అమ్మవారిని దర్శించుకోవాలన్నారు. బాటా జంక్షన్ నుంచి నేరుగా రావొచ్చని..మొత్తం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశామని, బోనంతో వచ్చేవారికోసం రెండు క్యూలైన్లు ఉంటాయని స్పష్టం చేశారు. బోనంతో వచ్చే మహిళతో పాటూ మరో ఐదుగురిని అనుమతిస్తామని, దివ్యాంగులు - సీనియర్ సిటిజన్లకు ప్రత్యేక క్యూలైన్లు ఉంటాయని తెలిపారు. ఆలయ పరిసరాలతో పాటు ఫలహార బండ్ల ఊరేగింపు జరిగే ప్రాంతాల్లో సీసీ కెమెరాలతో నిఘా కొనసాగుతుందన్నారు.
సికింద్రాబాద్ లష్కర్ బోనాల సందర్భంగా జూలై 13 ఆదివారం ఉదయం 6 గంటల నుంచి జూలై 15 మంగళవారం ఉధయం 6 గంటలవరకూ మందు దుకాణాలు మూతపడనున్నాయి. బార్లు, వైన్ షాపులు, కల్లుదుకాణాలు మూసివేయాలని సీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. సీపీ ఆదేశాలతో గాంధీనగర్, చిలకలగూడ, లాలాగూడ, వారాసిగూడ, బేగంపేట, గోపాలపురం, తుకారాం గేట్, మారేడ్పల్లి, మహంకాళి, రాంగోపాల్ పేట, మార్కెట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఉన్న మద్యం దుకాణాలు మూతపడనున్నాయి.






















