Tirumala: కన్నుల పండువగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు -ఏ రోజు ఏ వాహన సేవ? ఏర్పాట్ల వివరాలు ఇవే!
Srivari Brahmotsavams 2025: సెప్టెంబర్ 24 నుంచి అక్టోబర్ 02 వరకూ కన్నుల పండువగా శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగనున్నాయి. ఏ రోజు ఏ వాహన సేవ? ఏర్పాట్ల వివరాలు ఇవే!

TTD: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా నిర్వహించేందుకు సమిష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ . ఈ మేరకు అధికారులతో తిరుమల అన్నమయ్య భవన్ లో సమీక్ష సమావేశం నిర్వహించారు.
సెప్టెంబర్ 24 బుధవారం ఆశ్వయజ మాసం శుక్లపక్షం తదియ రోజు ప్రారంభమయ్యే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఆశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి అక్టోబర్ 2 గురువారంతో ముగుస్తాయి. ఈ మేరకు బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై నిర్వహించిన సమావేశంలో అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ఏర్పాట్ల గురించి వివరించారు.
తిరుమలలో పారిశుధ్యం విషయంలో ఎక్కడా రాజీపడకూడదు, మాడ వీధులను పరిశుభ్రంగా ఉంచేందుకు అవసరం అయితే అదనపు సిబ్బందిని విధుల్లోకి తీసుకోవాలని ఆదేశించారు టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్. గరుడ వాహనం రోజున సీనియర్ అధికారులకు మాడవీధుల్లో విధులు కేటాయించి ఎప్పటికప్పుడు అప్టేడ్స్ తెలుసుకోవాలి..భక్తులకు ఎలాంటి ఇబ్బందులున్నా వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్యాలరీల్లో ఉండే భక్తులకు నిరంతరం అన్నప్రసాద వితరణ జరిపించేలా ప్రత్యేక కార్యాచరణ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వాహనాల రద్దీని దృష్టిలో ఉంచుకుని తిరుమలలో అవసరమైనమేరకు వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక సదుపాయాలు కల్పించాలన్నారు. భక్తుల రద్దీకి అనుగుణంగా పార్కింగ్ ప్రదేశాలు నిర్ణయించాలి. నాదనీరాజనం వేదికపై కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు చేపట్టాలి. దాదాపు 3500 మంది శ్రీవారి సేవకులను సిద్ధం చేసుకోవాలి. సమర్థవంతంగా పనిచేసేవారిని గుర్తించి బ్రహ్మోత్సవ సేవల్లో భాగం చేయాలని సూచించారు అనిల్ కుమార్. పోలీసులతో సమన్వయం చేసుకుని కామన్ కమాండ్ సెంటర్ ద్వారా తిరుమలలో భద్రతను పర్యవేక్షించాలన్నారు. చిన్న పిల్లలు తప్పిపోకుండా జియో ట్యాంగింగ్ ఏర్పాటు చేయాలి.. 4వేల సీసీ కెమెరాలతో పాటు అదనంగా అవసరమైన సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. శ్రీవారి మెట్టు, అలిపిరి నడకమార్గాల్లో అప్రమత్తంగా ఉండాలి..మరిన్ని భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని చెప్పారు. విద్యుత్ విభాగంలో సమస్యలు తలెత్తకుండా సేప్టీ ఆడిట్ నిర్వహించాలన్నారు. భక్తులంతా స్వామివారి సేవలను వీక్షించేందుకు వీలుగా SVBC ద్వారా HD క్వాలిటీ ప్రసారాలు అందించాలి. ఇంకా అవసరమైన వైద్యసేవలు అందించేందుకు వైద్య బృందాలను సిద్ధంగా ఉంచుకోవాలని అనిల్ కుమార్ ఆదేశించారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా రోజూ ఉదయం 8 నుంచి 10, సాయంత్రం 7 గంటల నుంచి 9 గంటల వరకూ వాహన సేవలు ఉంటాయి.
సెప్టెంబర్ 24 సాయంత్రం ధ్వజారోహణం, రాత్రి పెద్ద శేష వాహనం
సెప్టెంబర్ 25 ఉదయం చిన్న శేష వాహనం, మధ్యాహ్నం 1 to 3 వరకు స్నపనం, రాత్రి హంస వాహనం
సెప్టెంబర్ 26 ఉదయం సింహ వాహనం, మధ్యాహ్నం 1 స్నపనం, రాత్రి ముత్యపు పందిరి వాహనం
సెప్టెంబర్ 27 ఉదయం కల్పవృక్షం వాహనం, మధ్యాహ్నం స్నపనం, రాత్రి సర్వ భూపాల వాహనం
సెప్టెంబర్ 28 ఉదయం మోహినీ అవతారం, సాయంత్రం గరుడ వాహనం
సెప్టెంబర్ 29 ఉదయం హనుమంత వాహనం, సాయంత్రం 4 స్వర్ణ రథం, రాత్రి గజ వాహనం
సెప్టెంబర్ 30 ఉదయం సూర్యప్రభ వాహనం , రాత్రి చంద్రప్రభ వాహనం
అక్టోబర్ 1 ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వ వాహనం
అక్టోబర్ 2 ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం






















