Tirumala News: ఏడాదిలో రోజుల సంఖ్య కన్నా తిరుమలేశుడి ఉత్సవాల సంఖ్యే ఎక్కువ!
Tirumala: ఏడాదికి 365 రోజులైతే ఏడాది పొడవునా శ్రీ వేంకటేశ్వరుడికి జరిగే ఉత్సవాల సంఖ్య 450కి పైమాటే.. నిత్య కళ్యాణం పచ్చతోరణం కాదు అంతకు మించి అనాలి మరి..శ్రీవారికి మాత్రమే సొంతమైన వైభోగం ఇది...
Tirumala Srivariseva
'స్మరణాత్సర్వపాపఘ్నం స్తవనా దిష్టవర్షిణమ్ దర్శనా న్ముక్తిదం శ్రీనివాసం భజే నిశమ్'
స్వామివారిని తలుచుకుంటే చాలు..అన్ని పాపాలు హరించుకుపోతాయని భక్తుల విశ్వాసం. అందుకే ఏడాకి ఒక్కసారైనా స్వామిని దర్శించుకోవాలని కోరుకుంటారు. ఏడాది పొడవునా శ్రీవారికి ఉత్సవాలు జరుగుతూనే ఉంటాయి. దేశం నలుమూలల నుంచి భక్తులు తిరుమలకు తరలివస్తారు.
శ్రీవారి నిత్యోత్సవాలు : సుప్రభాతంతో, తోమాల సేవ, సహస్రార్చన
శ్రీవారి వారోత్సవాలు: అష్టదళ పాదపద్మారాధన, తిరుప్పావడ, పూలంగి సేవ, శుక్రవారాభిషేకం
నక్షత్రోత్సవాలు: రోహిణి, ఆరుద్ర, పునర్వసు, శ్రవణం నక్షత్రాల సమయంలో ప్రత్యేక సేవలు
కోయిలాళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం, తెప్పోత్సవం, పద్మావతి పరిణయం, జేష్ఠాభిషేకం, ఆణివార ఆస్థానం, పవిత్రోత్సవం, బ్రహ్మోత్సవం ఇలా ఏడాది మొత్తం ప్రతిరోజూ పండుగే
Also Read: తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!
ఏడాదిలో 365 రోజులుంటే..దేవదేవుడికి జరిగే ఉత్సవాల సఖ్యం 450కి పైమాటే..అంటే శ్రీవేంకటేశ్వరుడి వైభోగాన్ని తిలకించేందుకు ఏడాది మొత్తం తిరుమలలో ఉన్నా సరిపోదు.
ఈ ఉత్సవాలన్నీ ఒకెత్తు..బ్రహ్మోత్సవాలు అంతకుమించి. సర్వాలంకాల భూషితుడిగా మలయప్పస్వామి శ్రీదేవి, భూదేవి సమేతంగా మాడ వీధుల్లో విహరించడం అద్భుతమే. ఆ వేడుక చూసేందుకు తిరుమలకు ఇసుకేస్తే రాలనంతమంది భక్తులు చేరుకుంటారు.
నైవేద్యాల విషయానికొస్తే..శ్రీవారికి రోజుకి మూడుసార్లు మొదటిగంట, రెండో గంట, మూడో గంట నైవేద్యం సమర్పిస్తారు. తొలి నివేదన ఉదయం 5.30 గంటలకు , రెండోసారి నివేదన ఉదయం 10గంటలకు, మూడోసారి నైవేద్యం రాత్రి 7.30కు ఉంటుంది. గురువారం, శుక్రవారాల్లో కేవలం రెండో గంట సమయం ఓ ఏడున్నరకే ఉంటుంది. మిగిలిన రోజుల్లో ఎలాంటి మార్పులు ఉండవు.
అలంకారప్రియుడు మాత్రమే కాదు ఆహార ప్రియుడైన స్వామివారికి సమర్పించే నైవేద్యాల్లోనూ వైవిధ్యం ఉంటుంది.
మొదటి గంటలో భాగంగా చక్రపొంగలి, మాత్ర ప్రసాదాలు, లడ్డూలు, కదంబం, పులిహోర, దద్ధ్యోజనం ,వడలు నివేదిస్తారు..ఈ ప్రసాదాలనే బేడి ఆంజనేయస్వామితో పాటు ఇతర ఉపాలయాలకు పంపిస్తారు.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
రెండో గంట సమయానికి నివేదించే ప్రసాదాల్లో..పెరుగన్నం, మిర్యాల పొంగలి, చక్రపొంగలి, పులిహోర, సీర, సేకరబాద్ సమర్పిస్తారు.
మూడో గంట నైవేద్యంలో భాగంగా లడ్డూలు, కదంబం, మొలహోర, వడలు, తోమాల దోశలతో పాటు .. ఆదివారం రోజు ప్రత్యేకంగా గరుడ ప్రసాదంగా పిండిని నివేదిస్తారు.
ఇన్ని ప్రసాదాల్లో మొదటగా శ్రీవారికి వడలు నివేదించారు..కానీ ఆ తర్వాత వచ్చిన లడ్డూనే భక్తులకు ప్రధాన ప్రసాదంగా మారింది. 300 ఏళ్ల క్రితమే తిరుమలలో తీపి ప్రసాదాన్ని భక్తులకు ఇచ్చేవారు. అప్పట్లో వడకు ఎక్కువ డిమాండ్ ఉండేది..అవి ఎక్కువ రోజులు నిల్వ ఉండడంతో అదే ప్రధాన ప్రసాదంగా భక్తులకు పంపిణీ చేసేవారు. అనంతరం మహంతులు హయాంలో తీపి బూందీ ఇచ్చేవారు..ఈ ప్రసాదమే కొంతకాలానికి లడ్డూగా మారింది..కాలక్రమేణా.. ఆ లడ్డూనే శ్రీవారి భక్తులకు ప్రధాన ప్రసాదంగా మారింది. తిరుమల అంటే లడ్డూ ప్రసాదమే అనేంతగా పేరొచ్చింది..
Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
అలంకరణ, ఆహారం, ప్రసాదం, హుండీ ఆదాయం, భక్తుల రద్దీ...ఏ విషయంలో అయినా శ్రీవారి వైభోగమే వేరు...
వినా వేంకటేశం న నాథో న నాథః
సదా వేంకటేశం స్మరామి స్మరామి,
హరే వేంకటేశ ప్రసీద ప్రసీద
ప్రియం వేంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ