Tirumala laddu issue: తిరుమల లాంటి పరిస్థితిని ఎదుర్కోవాలని మేం కోరుకోవడం లేదు.. ఒడిశా ప్రభుత్వం కీలక నిర్ణయం!
Odisha: తిరులలో శ్రీవారి లడ్డూ ప్రసాదం కల్తీ ప్రభావం అన్ని ఆలయాలపైనా పడింది. దీంతో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ మేరకు ఓ యంత్రాంగం ఏర్పాటు చేయాలని నిర్ణయించింది..
Odisha Govt to Check Quality of Mahaprasad: పూరీ జగన్నాథుడి ఆలయంలో ఇచ్చే మహాప్రసాదాన్ని నిరంతరం పర్యవేక్షించాలని ఒడిశా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఓ యంత్రాంగాన్ని ఏర్పాటు చేయనున్నట్లు న్యాయశాఖ మంత్రి పృథ్వీరాజ్ హరిచంద్రన్ ప్రకటించారు. ముఖ్యంగా నెయ్యి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోనున్నట్లు స్పష్టం చేశారు. కఠిన పరీక్షలు నిర్వహించిన తర్వాతే ప్రసాదం తయారీ గదిలోకి ఏ పదార్థం అయినా వెళ్లేలా నిబంధనలు అమలు చేస్తామన్నారు పృథ్వీరాజ్ హరిచంద్రన్.
Also Read: బ్రహ్మోత్సవం అనే పేరెలా వచ్చింది.. దేవతలకు బ్రహ్మోత్సవ ఆహ్వానపత్రం ఎవరిస్తారు!
తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో ఏ జరిగిందో అదే పరిస్థితి ఇక్కడ ఎదుర్కోవాలని కోరుకోవడం లేదని వెల్లడించింది ఒడిశా ప్రభుత్వం. వంటల్లో వినియోగించే నెయ్యిమాత్రమే కాదు..జగన్నాథుడి నివేదనకు తయారు చేసే ప్రతి పదార్థంలో వినియోగించే ముడిసరుకులు అన్ని నాణ్యత తనిఖీ చేసిన తర్వాతే వినియోగించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు పూరీ జగన్నాథ ఆలయానికి ఫుడ్ ఇన్‌స్పెక్టర్‌ను నియమించాలని ప్రభుత్వం ఆరోగ్య శాఖకు లేఖ రాసింది .
పూరీ జగన్నాథుడిని దర్శించుకునే భక్తులు..ఆలయంలో ప్రసాదం నాణ్యతపై అనుమానంతో తీసుకోకూడదు.. అదే సందేహంతో ఆలయం నుంచి వెళ్లకూడదు..అందుకే ఈ నిర్ణయం అని చెప్పారు పృథ్వీరాజ్ హరిచంద్రన్.
Also Read: దసరాతో ప్రారంభం..దీపావళితో ముగింపు - 2024 అక్టోబరులో పండుగల జాబితా!
కొన్నేళ్లుగా పూరీ జగన్నాథ ఆలయానికి.. ఒడిశా రాష్ట్ర సహకార పాల ఉత్పత్తిదారుల సమాఖ్య (ఓంఫెడ్) నెయ్యి సరఫరా చేస్తోంది. నెలకు ఓంఫెడ్ నుంచి దాదాపు 6,000 లీటర్ల నెయ్యి కొనుగోలు చేస్తారు.
పూరీ జగన్నాథుడికి నిత్యం భారీగా మహాప్రసాదాలు సిద్ధం చేస్తారు. అన్నం, కిచ్డీ, పప్పు, దాల్మా, కూర , వివిధ రకాల స్వీట్లు సిద్ధం చేస్తారు. అందుకే ప్రభుత్వం తక్షణం వీటి నాణ్యతను తనిఖీ చేయాలని గుర్తించాలని నిర్ణయించుకుంది
జగన్నాథుడి మహాప్రసాదం ధరలు నియంత్రించాలని భక్తులు ప్రభుత్వాన్ని కోరారు..ఆలయ పాలకవర్గం భక్తులకు ఈ మేరకు హామీ ఇచ్చింది.. కానీ అది ఇప్పటికీ అమలుకాలేదు. అయితే ముడిపదార్థాలు, కూరగాయల ధరల ఆధారంగా ప్రసాదం ధరలు మారుతున్నాయని.. తాము భక్తుల నుంచి ఎక్కువ వసూలు చేయడం లేదంటున్నారు సేవకుల సంఘం సభ్యులు. మహాప్రసాదం నాణ్యత తనిఖీని తాము స్వాగతిస్తున్నామని చెప్పారు.
పూరీ ఆలయానికి ఆగ్నేయంగా ఉండే వంటగది ప్రపంచంలోనే అత్యంత పెద్ద వంటగది అని చెబుతారు. గంగా, యమునా అనే రెండు బావుల నుంచి నీటిని వంటకోసం వినియోగిస్తారు. ఒకేసారి 50 వేల మందికి సరిపడా మహాప్రసాదం తయారవుతుంది. రోజుకి 70 క్వింటాళ్ల బియ్యం వండుతారు. ప్రసాదం తయారీకి ఏడు పాత్రలను దొంతరగా పెట్టి వండుతారు. పై పాత్రలో ఉన్న ఆహారం ముందుగా సిద్ధం అవుతుంది. ఆ తర్వాత ఒక్కో పాత్రను కిందకు దించుతారు. వంటలన్నీ పూర్తయ్యాక ముందుగా జగన్నాథుడికి నివేదించి..ఆ ప్రసాదాన్ని భక్తులకు అందిస్తారు.
Also Read: 'దేవర' న్యాయం అంటే ఏంటి - మహాభారతంలో దీని గురించి ఏముంది!
పూరీలో జగన్నాథుడికి రోజుకు ఆరుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 4 గంటలకు, 8 గంటలు, మధ్యాహ్నం 12, సాయంత్రం 4 గంటలకు, రాత్రి 7.45, 8.30...ఇలా ఆరుసార్లు నివేదిస్తారు. ఇందుకోసం 56 రకాల పదార్థాలు తయారుచేస్తారు. 56ని హిందీలో ఛప్పన్ అంటారు.. అందుకే జగన్నాథుడి మహాప్రసాదాన్ని ఛప్పన్ భోగ్ గా పిలుస్తారు.