AP HighCourt : దేవాదాయశాఖ సలహాదారు నియామకంపై స్టే - ఇలా అయితే ఏజీకీ సలహాదారును నియమించేస్తారన్న హైకోర్టు !
దేవాదాయ శాఖ సలహాదారు నియామకంపై హైకోర్టు స్టే విధించింది. శాఖలకు సలహాదారులు ఎందుకని ప్రశ్నించింది.
AP HighCourt : ఏపీ దేవాదాయశాఖకు సలహాదారుగా జె.శ్రీకాంత్ నియామకంపై రాష్ట్ర హైకోర్టు స్టే విధించింది. ఈ విషయంలో ప్రభుత్వం జారీ చేసిన జీవోను నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. శ్రీకాంత్ నియామకాన్ని సవాల్ చేస్తూ ఏపీ బ్రాహ్మణ సేవా సంఘం పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై సీజే జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా, జస్టిస్ సోమయాజులు ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.''ఇలానే వదిలేస్తే రేపు అడ్వొకేట్ జనరల్‌కు కూడా సలహాదారును నియమిస్తారు. సలహాదారులను నియమించుకునేందుకు ప్రభుత్వంలో అధికారుల కొరత ఉందా? అని న్యాయస్దానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సలహాదారులు రాజ్యాంగేతర శక్తులుగా వ్యవహరిస్తున్నారు. మంత్రులకు సలహాదారులంటే అర్థం ఉంటుంది.. శాఖలకి సలహాదారులేంటి , అని ప్రభుత్వాన్ని ఉన్నత న్యాయస్థానం ప్రశ్నించింది. అనంతరం జీవో నిలుపుదల చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
దేవాలయాల పట్ల ఆగమాల పట్ల ఇటువంటి అవగాహన లేని అనంతపురం జిల్లా కు చెందిన శ్రీకాంత్ ను దేవాదాయ శాఖ గౌరవ సలహాదారుగా నియమిస్తూ జగన్ ప్రభుత్వం ఇచ్చిన 630 జీవో అక్రమమైనదని పిటిషనర్లు చెబుతున్నారు. వైయస్ జగన్ ప్రభుత్వంలో ప్రభుత్వ సలహాదారుల పేరుతో పదవులు సృష్టించి తమ పార్టీలోని రాజకీయ నిరుద్యోగులకి పదవులను కట్టబెడుతూ ప్రభుత్వ ప్రజా సొమ్ముని దుర్వినియోగం చేస్తుందని అంటున్నారు. అంతటితో ఆగక ప్రభుత్వానికి సంబంధం లేని భక్తులు దాతలు ఇచ్చిన సంపదతో నడిచే దేవాదాయ ధర్మాదాయ శాఖకు కూడా ఈ సలహాదారులు నియమించటాన్ని రాష్ట్రంలో ఉన్న భక్త బృందాలు అర్చక సంఘ నాయకులు దేవాదాయ శాఖ ఉద్యోగులు బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకించిన కూడా జగన్ ప్రభుత్వం పంతంతో ఈ శ్రీకాంత్ కు సలహాదారు పదవి కట్టబెట్టిందన్నారు.
శ్రీకాంత్‌ను సలహాదారుగా నియమించడం వలన దేవాదాయ శాఖలోని సిజిఎఫ్ ఏజిఎఫ్ నిధులు దుర్వినియోగం జరుగుతాయని వైసిపి పార్టీకి సంబంధించిన బ్రాహ్మణ సంఘమే హైకోర్టులో పిల్ దాఖలు చేసిందని పిటిషనర్లు తెలిపారు. దేవాదాయ శాఖకు సలహాదారులు ఎందుకని దేవాదాయ శాఖ చట్టంలో లేని బాధ్యతల్ని బయట వారికి ఎలా ఇస్తారని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ జీవోపై స్టే విదించటం హిందూ దర్మాన్ని కాపాడారని పేర్కొన్నారు. దేవాలయాల్లోని హూండీల్లొ కానుకలకు సమర్పించే భక్తులు దేవాలయ అభివృద్ధి కోసం చందాలు ఇచ్చే భక్తులు అర్చకులు బ్రాహ్మణ సంఘాల నుండి సలహాలు సూచనలు తీసుకోవాలని పిలుపునిచ్చారు.
విశాఖ శారదా పీఠం స్వరూపానంద స్వామీజీ ప్రమేయంతోనే ఒత్తిడితోనే జగన్ ప్రభుత్వం దేవాదాయ శాఖకు శ్రీకాంత్ ను సలహాదారుడిగా నియమిస్తూ జీవో ఇచ్చిందని బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సిరిపురపు శ్రీధర్ శర్మ ఆరోపించారు. భక్తుల సొమ్మును దేవాలయాల ఆస్తులను రాజకీయ నిరుద్యోగుల పాలు చేస్తున్నారని శ్రీదర్ శర్మ ఆరోపించారు. స్వరూపానంద స్వామి ఆధ్వర్యంలో అర్చకులకు శిక్షణ ఇచ్చే సీతా సంస్థ డైరెక్టర్లుగా, ధార్మిక పరిషత్ డైరెక్టర్లుగా ,ధర్మ ప్రచార పరిషత్ డైరెక్టర్లుగా, లక్షల రూపాయలు తీసుకొని నియమించేందుకు విశాఖ శారదా పీఠం కేంద్రంగా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని ఆరోపించారు. దీని పైన కూడా న్యాయస్థానాల్ని ఆశ్రయించి దేవుడు సొమ్ము ..ఆస్తులు ,రాజకీయ నిరుద్యోగుల పాలు కాకుండా న్యాయపోరాటం చేస్తామని శ్రీధర్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.