Bathukamma Festival 2024: బతుకమ్మ ప్రారంభ సంబరాలను ఎంగిలి పూలుగా ఎందుకు పిలుస్తారు!
Bathukamma Celebrations | వచ్చే అమావాస్య రోజు మొదలయ్యే బతుకమ్మ సంబరాల మొదటి రోజును ఎంగిలిపూల బతుకమ్మ అని అంటారు. ఎందుకు ఈ రోజును ఎంగిలి పూలుగా పిలుస్తారో మీకు తెలసా? తెలియకపోతే ఇక్కడ తెలుసుకోవచ్చు.
Bathukamma Celebrations 2024: మహాలయ అమావాస్య అంతటి ప్రాశస్థ్యం కలిగి అదే రోజున జరుపుకునే పండుగ ఎంగిలిపూల బతుకమ్మ. ఈ పండుగ గురించిన కొన్ని విశేషాలు.
ఎంగిలిపూల బతుకమ్మ
భాద్రపదమాస అమమావాస్య... ఇదే రోజున జరిగే మరో సమారోహ ఆరంభం కూడా ఉంది. అమావాస్య నాడు మొదలై దుర్గాష్టమి నాటికి ముగిసే బతుకమ్మ సంబరాల ప్రారంభ వేడుకలు కూడా ఈ రోజునే మొదలవుతాయి. తెలంగాణ ప్రాంతంలో ఈ పూలపండుగా చాలా విశిష్టమైంది, ప్రత్యేకమైంది. అమావాస్య రోజున కొలుకునే బతుకమ్మను ఎంగిలి పూల బతుకమ్మ అంటారు. తొమ్మిది రోజుల బతుకమ్మ పండుగలో సంబరాల్లో మొదటి రోజు జరుపుకునే ప్రత్యేకమైన వేడుక. ఇది పండుగ ప్రారంభంగా ఈ రోజును ఎంతో భక్తితో ఆనందంతో జరుపుకుంటారు.
ఎంగిలిపూల బతుకమ్మ ప్రత్యేకత
చెట్టు నుంచి రాలిన పువ్వులను సైతం బతుకమ్మగా తయారుచేసి పూజించుకుంటారు. బతుకమ్మ ప్రకృతి ఆరాధనకు ప్రతీక . రాలిన పూలను కూడా గౌరవంగా పూజనీయంగా చూడాలనే సందేశం ఈ పండుగ ద్వారా ప్రపంచానికి ధర్మం బోధిస్తోంది. మొదటి రోజున పండుగ ప్రారంభానికి ముందే పూలను ఏరి, అలంకరిస్తారు. గునుగు, తంగేడు, పోకపూలు, సీతజడల వంటి అడవి పూలతో ఈ బతుకమ్మ తయారు చేస్తారు.
బతుకమ్మ తయారీ
బతుకమ్మ అంటే పువ్వులతో చేసే ఆరాధన కాదు పువ్వులకే చేసే ఆరాధన. పువ్వులను ఆరాధించి ప్రకృతికి సమర్పించుకోవడం సంప్రదాయం. రంగురంగుల పువ్వులను సేకరించి వాటిని దొంతరలుగా పేర్చి బతుకమ్మగా తయారు చేస్తారు.
Also Read: దేవినవరాత్రులు ప్రారంభం - అక్టోబరు 03 మొదటి రోజు అలంకారం , నైవేద్యం!
పర్వావరణానికి చెప్పుకునే కృతజ్ఞత
బతుకమ్మ ఆద్యంతమూ ప్రకృతి ఆరాధనే. వర్షాకాలపు చివరి రోజుల్లో మొదలయ్యే ఈ పండుగ సమయానికి నిండిన జలశయాలతో, పచ్చదనంతో పుడమి శోభాయమానంగా ఉంటుంది. భూమి నూతన జీవంతో పరిపూర్ణంగా ఉంటుంది. ఈ సమయంలో ఆ సహజ జీవానికి తెలుపుకునే కృతజ్ఞతగా ఈ పండుగను భావించవచ్చు.
జానపదుల పండుగ
ఎంగిలిపూల బతుకమ్మ తో ప్రారంభమై సద్దుల బతుకమ్మతో ముగిసే బతుకమ్మ ఉత్సవాల్లో ప్రతి రోజూ బతుకమ్మ ను తయరు చేసి దాని చుట్టూ చప్పట్లతో ప్రత్యేక నృత్యం చేస్తూ పాటలు పాడుతారు. ఈ పాటలన్నీ బతుకును ప్రతిబింబించేవిగా ఉంటాయి.
ప్రసాదం
తెలంగాణ ప్రాంతంలో పెత్రమాస గా పిలిచే ఈ అమావాస్య రోజే ఎంగిలి పూల బతుకమ్మ చేస్తారు. ఈ రోజున బతుకమ్మకు నువ్వులు, బియ్యంపిండి, నూకలు కలిపి నైవేద్యంగా సమర్పించి దీన్ని బతుకమ్మ ఆట ముగిసిన తర్వాత బతుకమ్మను దగ్గరలో ఉన్న జలాశయంలోని నీటిలో నిమజ్జనం చేసిన తర్వాత ఈ ప్రసాదాన్ని అందరూ పంచుకుని తింటారు. బతుకమ్మ నిమజ్జనం నీటికి చేసే పువ్వుల ఆరాధనగా భావించవచ్చు. ప్రకృతి ఆరాధన మన జీవన విధానంలో ఎలా భాగంగా మారిందో చెప్పే పండుగే బతుకమ్మ. ఆ పేరులోనే బతుకు జాడ కనిపిస్తుందని చెప్పవచ్చు.
ఇలా పితృఅమావాస్యతో పితృపక్షాలు ముగుస్తుండగా అదే రోజున ఎంగిలిపూల బతుకమ్మతో బతుకమ్మ సంబరాలు ప్రారంభం అవుతాయి. ప్రకృతిని కొలుచుకునే ఈ పండుగ తెలంగాణ ప్రాంత సంస్కృతి సంప్రదాయాలకు అద్దం పడుతుంది.
ఈ ఎంగిలి పూల బతుకమ్మను సాధారణంగా అందరు ఆడపడుచులు అత్తవారింట్లో జరుపుకుని సద్దుల బతుకమ్మ నాటికి పుట్టింటికి చేరడం ఇక్కడి సంప్రదాయం.
Also Read: అందాల బతుకమ్మ.. బతుకునిచ్చే అమ్మ - తెలంగాణ అస్తిత్వానికి చిహ్నంగా నిలిచే ఈ పండుగ వెనుక కథలెన్నో!