The Birth of Goddess Sita: సీతా దేవి నేపాల్‌లో పుట్టిందా -భారత్ లో పుట్టిందా, ఆధారాలేంటి - ఏది నిజం!
Spirituality: రాముడి కథే రామాయణం. మనిషి జీవన విధానాన్ని తెలిపే మాహాకావ్యం. అయితే ఈ మధ్య విడుదలైన ఆదిపురుష్ సినిమాలో సీతాదేవి జన్మస్థలంపై వివాదం రేగింది. ఇంతకీ సీతమ్మ ఎక్కడ పుట్టింది!
The Birth of Goddess Sita: రామాయణం మహాకావ్యం ఆధారంగా తెరకెక్కిన ఆదిపురుష్ సినిమా చుట్టూ వివాదాలు చెలరేగాయి. వాటిలో ఒకటి సీతాదేవి జన్మస్థలంపై కూడా దుమారం రేగింది. సీతా దేవి భారతదేశపు కుమార్తె అని డైలాగ్ చెబుతూ ఓ సన్నివేశం ఉంటుంది. దీనిపై నేపాల్ సెన్సార్ ప్యానెల్ అభ్యంతరం వ్యక్తం చేసింది. నేపాల్ స్థానికుల నమ్మకం ప్రకారం సీతా దేవి నేపాల్ లో జన్మించిందని. అందుకు విరుద్ధంగా ఇండియాలో సీతాదేవి జననం జరిగిందన్న డైలాగ్ పై వారు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఖాట్మండులోని కొన్ని థియేటర్లలో ఆదిపురుష్ సినిమాను బ్యాన్ కూడా చేశారు. దీంతో కొన్ని డైలాగ్స్ ని డిలీట్ చేయాల్సి వచ్చింది మేకర్స్. ఇంతకీ సీతాదేవి ఎక్కడ జన్మించింది.
Also Read: దేశంలో ముఖ్యమైన ఈ 10 ఆలయాల్లో ప్రసాదం చాలా ప్రత్యేకం!
మిథిలానగరం ఎక్కడుంది!
అయోధ్యలో జన్మించాడు కౌశల్యా తనయుడు శ్రీరాముడు. సీతమ్మ తల్లి మిథిలానగరంలో జన్మించింది. రాముడి మామగారైన జనకుడు పాలించిన రాజ్యమే మిథిలా నగరం. బీహార్ నుంచి నేపాల్ వరకూ ఈ మిథిలా రాజ్యం విస్తరించి ఉందని చెబుతారు. ఈ రాజ్యాన్ని విదేహ రాజ్యం అని కూడా పిలిచేవారట. ఆ పేరుమీదే సీతాదేవికి వైదేహి అనే పేరువచ్చింది. అప్పట్లో జనకుడు ఉన్న రాజధానే ప్రస్తుతం నేపాల్లో ఉన్న జనక్ పూర్. ఈ జనక్ పూర్ లో భూమిని దున్నుతుండగా సీతమ్మ తల్లి ఉద్భవించిన నగరం ఇది. రామయ్యను పెళ్లిచేసుకున్న నగరం కూడా మిథిలా నగరమే.
Also Read: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - పోతురాజు సృష్టికర్త శివుడు!
ఎన్నో చారిత్రక ఆధారాలు
సీతాదేవి జన్మించిన ప్రాంతం జనక్ పూర్ అనే విషయాన్ని కాలక్రమేణా ప్రజలు మర్చిపోయారు. సుర్కిశోర్దాస్ అనే సన్యాసికి 1657లో ఇక్కడ సీతాదేవి విగ్రహాలు లభించడంతో, ఇక్కడి ప్రజలు తమ చరిత్రను తిరిగి గుర్తుచేసుకోవడం మొదలుపెట్టారు. ఆ చరిత్రకు చిహ్నంగా 1910లో వృషభాను అనే నేపాల్ రాణి ‘జానకీ మందిర్’ పేరుతో ఓ ఆలయాన్ని నిర్మించారు. వేల గజాల విస్తీర్ణంలో, 150 అడుగుల ఎత్తున్న ప్రాకారంతో, పాలరాతి గోడలూ, అద్దాల మేడలతో నిర్మించిన ఈ ఆలయానికి అప్పట్లో తొమ్మిది లక్షల రూపాయలు ఖర్చయిందట. అందుకనే ఈ ఆలయానికి ‘నౌ లాఖ్ మందిర్’ అన్న పేరు కూడా ఉంది. జానకీమందిర్ నిర్మించిన ప్రాంతంలోనే సీతాదేవి శివ ధనుస్సుని పూజించిందని చెబుతారు. సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ స్థలంలోనే అని భక్తుల విశ్వాసం. అందుకనే జానకీమందిరంలోని నైరుతి దిక్కున పెద్ద వివాహ మండపాన్ని నిర్మించారు. ఏటా మార్గశిర మాసం శుక్ల పంచమి రోజున ఇక్కడ వైభవంగా సీతారామ కళ్యాణం నిర్వహిస్తారు. ఆ రోజే సీతారాముల వివాహం జరిగిందని అక్కడి ప్రజల నమ్మకం. కానీ తెలుగువారు శ్రీరామనవమి రోజునే ఆయన కళ్యాణం నిర్వహించుకోవడం ఇక్కడి ఆనవాయితీగా వస్తోంది. అంటే ఆదిపురుష్ సినిమాలో చెప్పినట్టు సీతాదేవి భారతదేశంలో జన్మించలేదు..నేపాల్ లోనే జన్మించిందని పురాణ గాధలు చెబుతున్నాయి.
గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు.