![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ashada Bonalu 2023: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు!
ఆషాడ బోనాల్లో ప్రత్యేక ఆకర్షణ పోతురాజు. ఇంతకీ అమ్మవార్ల పక్కన పోతురాజు ఎందుకుంటాడు..
![Ashada Bonalu 2023: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు! Ashada Bonalu 2023: history behind pothuraju avatar in bonalu, know in details Ashada Bonalu 2023: పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ వీళ్లంతా పార్వతీదేవి సంతానమే - మరి పోతురాజు ఎవరు!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/06/22/c79e9a76c09ea5422160e39aec9549741687434035393217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ashada Bonalu 2023: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీక బోనాలు. ఆషాడమాసంలో మొదట వచ్చే గురువారం లేదా ఆదివారం బోనాలు ప్రారంభమవుతాయి. ఈ ఏడాది జూన్ 22 గురువారం మధ్యాహ్నం 12గంటలకు గోల్కొండ బోనాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
నెలరోజుల పాటూ సాగే సందడి
ఆషాఢ మాసం ఆరంభం నుంచి ఊరూరా మొదలయ్యే సందడి నెల రోజుల పాటూ సాగుతుంది. శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాలతో మహానగరం నుంచి మారుమూల పల్లెవరకూ హోరెత్తిపోతుంది. ఉత్సవాల్లో భాగంగా మహిళలు తలపై బోనాలతో అమ్మవార్ల ఆలయాలకు తరలివెళ్లి పూజలు చేస్తారు. గ్రామ దేవతలైన పోశమ్మ, మైసమ్మ, బాలమ్మ, ఎల్లమ్మ, ముత్యాలమ్మ, మహంకాళమ్మ, పెద్దమ్మ, వీరికి తోడుగా గ్రామాన్ని కాపాడే పోతురాజు అనుగ్రహంకోసం బోనం సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు.
Also Read: గ్రామానికి, కుటుంబానికి ఆపద రాకూడదంటూ సమర్పించే బోనం, ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు!
పార్వతీ దేవి సంతానానికి కాపలా పోతురాజు
శివపార్వతులకు ఓరోజు వనవిహారానికి వెళ్లారు. అక్కడ పార్వతీదేవి కొలనులోంచి ఏడు దోసిళ్ల నీళ్లు తాగగానే సద్యోగర్భంలో ఏడుగురు కన్యలు పుట్టారు. నీళ్లు తాగిన వెంటనే పిల్లలు పుట్టడం ఏంటో అర్థంకాని పార్వతీదేవి వెంటనే పరమేశ్వరుడి చెంతకు చెరింది. ఆ ఏడుగురు కుమార్తెలను వెంట తీసుకెళదామని అడుగుతుంది. వద్దని చెప్పిన శివుడు వారి జన్మరహస్యం వివరిస్తాడు. ఆ ఏడుగురిది స్వతంత్ర ప్రవృత్తి అని అందుకే వారిని వదిలేసి వెళదామంటాడు. మరి వీరికి తోడెవరు అని పార్వతీదేవి అడగడంతో వారికి కాపలాగా ఓ గణాన్ని సృష్టించి పోతురాజు అని పేరు పెడతాడు శివుడు. ఆ ఏడుగురిని పోతురాజే కాపాడాలని చెప్పి పార్వతీ పరమేశ్వరులు అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పోతురాజు ఆ ఏడుగురినీ కాపలా కాస్తూనే ఉన్నాడు. ఆ ఏడుగుర పేర్లు పెరవాణి, శివవాణి, కొండవాణి, ముద్దరాలు, జక్కులమ్మ, కామవల్లి, శర్వాణి. ఈ పేర్లనే పోచమ్మ, ఎల్లమ్మ, మాంకాళమ్మ, పెద్దమ్మ అంటూ ఒక్కో చోటు ఒక్కోలా పిలుచుకుంటుంటారు.
పోతురాజులు రోజంతా ఉపవాసమే
పోతురాజు వేషం వేసే వారు రోజంతా ఉపవాసం ఉంటారు. ఉదయాన్నే స్నానం చేసి అలంకరణ సామాగ్రికి ఇంట్లో పూజలు చేసి అలంకరించుకుంటారు. కొందరు గుడి దగ్గరకు వెళ్లాక అలంకరించుకుంటారు. ఆ వేషం తీసేసిన తర్వాత భోజనం చేస్తారు. ఈ లోగా పళ్లరసాలు తాగుతారు. దాదాపు కేజీ పసుపుకు అర కిలో నూనె కలిపి ఆ మిశ్రమాన్ని శరీరానికి పట్టించుకుంటారు. ఒకప్పుడు కేవలం పసుపు పూత, పెద్ద కుంకుమ బొట్టుకే పరిమితమైన అలంకరణ ఇప్పుడు రకరకాల రంగులకు, రకరకాల ఆకృతులకు మారింది. వాస్తవానికి ఎలాంటి మేకప్ అయినా 10 నుంచి 12 గంటలు ఎండలో, వానలో ఉంటే చెరిగిపోతుంది. అందుకే వీళ్లు నేరుగా పెయింట్ తో మేకప్ వేసేసుకుంటారు. ఆ మేకప్ తర్వాత వారి మొహంలో వారికే తెలియని గంభీరత వచ్చిచేరుతుంది.
Also Read: ఈ వారం ఈ రాశుల ఉద్యోగులకు ప్రమోషన్ సమయం, జూన్ 26 నుంచి జూలై 2 వారఫలాలు
కొరడా కాదు ఈరకోల
పోతురాజులను తలుచుకోగానే వారి చేతిలో కొరడా గుర్తొస్తుంది. కొరడా ఝుళిపిస్తూ వాళ్లు ఆడేఆట చూసేందుకు జనం గుమిగూడతారు. పోతురాజల ఆటకున్న ప్రత్యేకత అది. ఆ కొరడాను ఈరకోల అంటారు. ఆ కొరడా చూసి అంతా భయపడతారు కానీ ఈరకోలను మెడలో వేస్తే వారికి మంచిజరుగుతుందని, అనారోగ్య సమస్యలు తీరిపోతాయని విశ్వాసం. అందుకే పోతురాజులు మెడలో ఈరకోల వేస్తారని ఎదురుచూస్తారంతా. ఉదయం నుంచి సాయంత్రం వరకూ అస్సలు అలసిపోకుండా ఆడుతూనే ఉంటారు పోతురాజులు.
జూలై 10న రంగం
బోనాల పూజ కార్యక్రమాలు ఈనెల 22, 25, 29, జూలై 2, 6, 9, 13, 16, 20వ తేదీల్లో ఉంటాయి. జూన్ 22 న గోల్కొండ లో ఆషాడ బోనాలు ప్రారంభమయ్యాయి. జులై 9 న సికింద్రాబాద్ మహంకాళి బోనాలు.. 10వ తేదీన రంగం ఉంటుంది. 16వ తేదీన ఓల్డ్ సిటీ బోనాలు, 17న ఉమ్మడి దేవాలయాల ఆధ్వర్యంలో ఊరేగింపు కార్యక్రమం ఉంటుంది
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)