Ganesh Sharma : కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన గణేష్ శర్మ
Ganesh Sharma : కంచి పీఠంలో తెలుగు వ్యక్తికి అపురూప గౌరవం దక్కింది. కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన పండితుడు గణేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.

Ganesh Sharma : కంచి పీఠంలో తెలుగు పండితుడికి అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా దుడ్డు గణేష్ శర్మ నేడు(బుధవారం, 30 ఏప్రిల్ 2025) బాధ్యతలు స్వీకరించబోతున్నారు. అన్నవరం దేవస్థానంలో వ్రత పురోహితునిగా పని చేస్తున్న దుడ్డు ధన్వంతరి, అలివేలు మంగాదేవి కుమారుడు గణేష్ శర్మ. చిన్నప్పటి నుంచి అనేక శాస్త్రాల్లో పట్టు సాధించిన గణేష్ శర్మ పూర్తి పేరు దుడ్డు సత్యవెంకటసూర్య సుబ్రహ్మణ్య గణేష్ శర్మ. చిన్నప్పుడు తిరుపతిలోని మేనమామ ఇంటికి వెళ్లిన గణేష్ శర్మకు ఈ అవకాశం లభించింది. ధర్మ కార్యకలాపాల కోసం అక్కడికి వచ్చిన అప్పటి కంచి కామకోటి పీఠానికి చెందిన శంకరాచార్య గమనించి ద్వారకా తిరుమల్లోని ఋగ్వేద జ్ఞాని రత్నాకర శర్మ దగ్గరకు వెళ్లి శిష్యరికం చేయాలని సూచించారు.

2009లో ఈ ఘటన జరిగింది. శంకరాచార్య మాట ప్రకారమే గణేష్ శర్మను ద్వారకాతిరుమల పంపించారు తల్లిదండ్రులు. అప్పటి నుంచి 12ఏళ్ల పాటు ద్వారకా తిరుమల్లో స్థిరపడ్డారు. అక్కడే చందుకొల్లు రత్నాకర శర్మ వద్ద వేద వేదాంగాలు ఔపోసన పట్టారు గణేష్ శర్మ. తర్వాత కొంతకాలం విజయవాడ దుర్గ గుడిలో ఋగ్వేద పండితుడిగా ఉన్న శ్రీనివాస శర్మ వద్ద విద్యనభ్యసించారు.
తగినంత పాండిత్యం సంపాదించాక బాసర దేవాలయంలో ఋగ్వేద పండితుడుగా పని చేశారు గణేష్ శర్మ. ప్రతిష్టాత్మక కంచి కామకోటి పీఠానికి అధిపతిగా ఉన్న శంకర విజయేంద్ర సరస్వతి తన వారసుడిగా గణేష్ శర్మను ఎంచుకోవడంతో ఆయనకు కంచి పీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు అప్పజెప్పబోతున్నారు. ఇది ఒక తెలుగు వ్యక్తికి దక్కిన అరుదైన గౌరవంగా ఆధ్యాత్మిక ప్రపంచం చెబుతోంది.

శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కూడా తెలుగువారే
గణేష్ శర్మకి బాధ్యతలు అప్పగించిన శంకర విజయేంద్ర సరస్వతి స్వామి కూడా తెలుగువారే కావడం విశేషం. తెలంగాణ రాష్ట్రం మహబూబ్ నగర్ కి చెందిన బ్రాహ్మణ కుటుంబం కృష్ణమూర్తి అంబలక్ష్మి దంపతుల సంతానం విజయేంద్ర సరస్వతి స్వామి. 1969 మార్చి 13న తిరువళ్లూరు జిల్లా తండలం అనే గ్రామంలో జన్మించారు. పాఠశాల విద్యతో పాటూ వేద విద్యను అభ్యసించిన ఆయన 14 ఏళ్ల వయసులో 1983లో పీఠానికి ఆచార్య అయ్యారు. 1994లో మహాపెరియవాల్ సిద్ధి వరకు మొత్తం ముగ్గురు ఆచార్యులు శ్రీమఠం వ్యవహారాలు చూసుకున్నారు. ఆ తర్వాత 2018లో శ్రీ జయేంద్ర సరస్వతి స్వామిగళ్ సిద్ధి పొందే వరకు ఇద్దరు ఆచార్యులు వ్యవహారాలు నిర్వహించారు. ఆ తర్వాత శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామిగళ్ శ్రీమఠం కార్యకలాపాలన్నింటినీ చూసుకున్నారు. ఇప్పుడు ఆ బాధ్యతలు మరో తెలుగుబ్రాహ్మణ కుటుంబానికి చెందిన గణేష్ శర్మకు అప్పగించారు విజయేంద్ర సరస్వతి.
అక్షయ తృతీయ రోజు బంగారం కొనేవారు తప్పనిసరిగా ఇది తెలుసుకోవాలి

వెయ్యి ఏళ్లుపైబడ్డ కంచి కామకోటి పీఠం
వేల సంవత్సరాల చరిత్ర గల కంచి కామకోటి పీఠాన్ని ఆదిశంకరాచార్య స్వయంగా స్థాపించారని చెబుతారు. మొదట్లో కుంభకోణంలో ఉన్న ఈ పీఠాన్ని తర్వాత కంచికి మార్చారు. ప్రపంచవ్యాప్తంగా కంచి పీఠానికి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కోట్ల సంఖ్యలో భక్తులు ఉన్నారు. ఇక్కడి పీఠాధిపతిని సాక్షాత్తు శివుని అవతారంగా భావిస్తారు. ఈ పీఠానికి 68వ అధిపతిగా 1907 నుంచి1994 వరకూ 87 ఏళ్ల పాటు బాధ్యతలు నిర్వహించి చంద్రశేఖరేంద్ర సరస్వతి రికార్డు సృష్టించారు. ఆయన తర్వాత జయేంద్ర సరస్వతి 2018 వరకూ ఆపైన ప్రస్తుత పీఠాధిపతి శంకర విజయేంద్ర సరస్వతి పీఠం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కంచి కామకోటి పీఠానికి కాబోయే పీఠాధిపతిగా అన్నవరానికి చెందిన గణేష్ శర్మను తన వారసుడిగా ఎన్నుకున్నారు విజయేంద్ర సరస్వతి.
ప్రస్తుతం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరిస్తున్న గణేష్ శర్మ భవిష్యత్తులో కంచి కామకోటి పీఠానికి 71వ పీఠాధిపతిగా మారనున్నారు. కంచి పీఠంలో తెలుగు వ్యక్తికి అపురూప గౌరవం దక్కింది. కంచి కామకోటి పీఠం ఉత్తరాధికారిగా అన్నవరానికి చెందిన పండితుడు గణేష్ శర్మ బాధ్యతలు చేపట్టనున్నారు.

అక్షయ పాత్ర ఎలా ఉంటుంది , ఇప్పుడు ఎక్కడుంది - అక్షయపాత్ర గురించి ఆసక్తికర విషయాలివి!





















