Happy Ram Navami 2024: ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తు రామచంద్రుడే' అంటాం - రాముడిలో అంత గొప్పదనం ఏంటి!
Sri Rama Navami 2024:అలసి కూర్చుంటే రామా అని, కష్టం వస్తే రామచంద్రా అని, ఆశ్చర్యకరమైన మాటవింటే 'అయ్యో రామా' అని, ఎవరినైనా పొగిడినప్పుడు 'సాక్షాత్తూ శ్రీరామచంద్రుడే' అని అంటారు..అన్నిటికీ రాముడే ఎందుకు
రావణ సంహారం వరకూ ఎన్నో కష్టాలు పడ్డాడు. పోనీ వనవాసం పూర్తై వచ్చిన తర్వాతైనా జీవితం సంతోషంగా గడిచిందా అంటే... ఇలా పట్టాభిషిక్తుడు అయ్యాడో లేదో భార్య సీతను లోకుల నిందలకు తలొంచి అడవికి పంపించేయాల్సి వచ్చింది. లవకుశలు కళ్లముందుకి వచ్చినప్పుడు కూడా తన పిల్లలే అని తెలుసుకోలేకపోయాడు...చివరకు వారితో యుద్ధానికి దిగినప్పుడు కానీ వాళ్లే తన సంతానం అని అర్థంకాలేదు...ఇలా చెప్పుకుంటే..శ్రీరాముడి జీవితంలో ఆహా అనిపించే ఒక్కరోజు కూడా లేదు...కానీ ఎప్పుడూ కుంగిపోలేదు..ధర్మాన్ని వీడలేదు. లోకమంతా రాముడిని దేవుడు అని పూజిస్తోన్నా..రాముడు మాత్రం 'అహం దశరథాత్మజః' దశరథుని కుమారుడైన రాముడిని మాత్రమే’ అని ప్రకటించాడు… అయినా లోకమంతా ఆయన్నే ఆదర్శంగా తీసుకుంది..ఎందుకంటే..సందర్భమేదైనా కానీ ధర్మాన్ని విడిచిపెట్టలేదు.
Also Read: శ్రీరామనవమి రోజు ఈ రాశులవారిపై రాముడి కరుణా కటాక్షాలుంటాయి - సమస్యలు దూరం , అనుకోని ఆదాయం!
శాస్త్ర ధర్మాన్ని వీడలేదు
శ్రీరాముడు వనవాసానికి వెళ్లినప్పుడు దశరథుడు ప్రాణాలు విడిచాడు. అప్పటివరకూ మేనమామ ఇంట్లో ఉన్న భరతుడు వచ్చి అంత్యక్రియలు పూర్తిచేశాడు. ఆ వార్త తెలిసిన రాముడు పెద్ద కుమారుడిగా తండ్రికి కర్మకాండలు జరిపించలేకపోయాననే బాధతో...అక్కడికక్కడే శాస్త్రబద్ధంగా తండ్రి రూపానికి ఉత్తర క్రియలు నిర్వహించాడు. పిండితో పిండాలు చేసి పెట్టాడు.. ఆ సమయంలో స్వయంగా దశరథుడి హస్తం వచ్చి ఆ పిండాలు చేతిలో పెట్టు రామా అని అడిగినా...శాస్త్రప్రకారం దర్భలపైనే ఉంచాడు.
Also Read: వనవాసానికి వెళ్లేముందు తల్లిదండ్రులు, రాజగురువుతో రాముడి సంభాషణ ఇదే!
స్నేహ ధర్మం పాటించాడు
రావణుడు సీతాదేవిని ఎత్తుకుపోతున్నప్పుడు జటాయువు అడ్డుకుంటుంది. తన శక్తిమేరకు రావణుడితో పోరాడి రెక్కలు తెగి నేలకూలుతుంది. అయినప్పటికీ రాముడికి సమాచారం చెప్పేవరకూ ప్రాణాలు నిలుపుకుని..తన కార్యం నెరవేర్చిన తర్వాతే రామచంద్రుడి చేతుల్లో కన్నుమూసింది. వాస్తవానికి జటాయువు దశరథుడి స్నేహితుడు. దశరథుడి మరణం తర్వాత రాముడితో అదే స్నేహాన్ని కొనసాగించాడు జటాయువు. ఆ స్నేహధర్మంతోనే జటాయువు ఉత్తరక్రియలు స్వయంగా నిర్వహించాడు రాముడు.
Also Read: జై శ్రీరామ్ - మీ బంధు మిత్రులకు శ్రీరామ నవమి శుభాకాంక్షలు చెప్పయండిలా!
ధర్మ యుద్ధమే చేశాడు
వాలిని చెట్టుచాటునుంచి చంపడం ధర్మమేనా అనే సందేహం చాలామందిలో ఉంది...అయితే వాలి వానరం..మనిషి కాదు..కాబట్టి ఏ జంతువును అయినా క్షత్రియుడు చెట్టుచాటు వధించినట్టే వాలిని సంహరించాడు. పైగా..వాలి తన తమ్ముడైన సుగ్రీవుడి భార్య రుమను చెరబట్టాడు. వాస్తవానికి వదిన అమ్మతో సమానం అయితే తమ్ముడి భార్య కూతురితో సమానం. తండ్రిలా కాపాడాల్సిన వాలి కామంతో రుమను కోరుకున్నాడు. పైగా ఎదుటివారి బలాన్ని తగ్గించే వరమాల వాలి మెడలో ఉంటుంది...ఆ సమయంలో ఎంతటి శక్తివంతుడు ఎదురునిలబడినా శక్తి క్షీణిస్తుంది. అందుకే వెనుక నుంచి బాణం ప్రయోగించాడు..ఇది యుద్ధంలో క్షత్రియుడు పాటించాల్సిన ధర్మం...
శత్రువుని దగ్గరకు తీసుకునే దయాగుణం
సీతను రాముడికి అప్పగించమని చెప్పిన విభీషణుడికి రాజ్యబహిష్కరణ శిక్ష వేస్తాడు రావణుడు. అప్పుడు రామచంద్రుడిని ఆశ్రయిస్తాడు. శత్రువు సోదరుడు అని తెలిసినా అభయం ఇచ్చిన రాముడు..రావణ సంహారం తర్వాత లంకకు అధిపతిని చేస్తానని మాటిస్తాడు. ఆ సమయంలో సుగ్రీవుడు సహా వానర సేన అంతా రాముడి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తారు. రావణదూత అని అనుమానిస్తారు. అప్పుడూ రాముడి నుంచి వచ్చిన సమాధానం ఏంటంటే...ఇప్పుడు స్వయంగా రావణుడే వచ్చి శరణుకోరినా అభయం ఇస్తానన్నాడు.
Also Read: ఈ తరం పిల్లలకి రామాయణం గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయానికి వెళ్లండి!
దేవుడిని కాదని చెప్పేశాడు
యుద్ధం తర్వాత రావణుడు నేలకొరుగుతాడు. వానరసేన సందడి చేస్తుంది..ముల్లోకాలు ఆనందించాయి. దేవతలంతా ప్రత్యక్షమై.. రాముడిని విష్ణు స్వరూపంగా స్తుతిస్తారు. కానీ..అప్పుడు కూడా రాముడు..తాను సాధారమ మానవుడిని మాత్రమే అని స్పష్టం చేశాడు. ఇదీ శ్రీరాముడు పాటించిన మనుష్యధర్మం.
పరస్త్రీ నీడ కూడా సోకనీయలేదు
రావణ వధ జరిగింది. ఇరువైపులా మిగిలిన సైన్యం... యుద్ధం ఆపేసి ఎక్కడివారక్కడ నిల్చుని ఉండిపోయారు. రాముడు కూడా ఒక బండ రాయిపై కూర్చున్నాడు. సూర్యకిరణాలు పడడం వల్ల తన నీడ దూరంగా కనిపిస్తోంది. అదే సమయంలో దూరం నుంచి వస్తోన్న మరో నీడ కనిపించింది. అది స్త్రీమూర్తి నీడ అని అర్థమైంది. ఆ నీడ..తన నీడకు దగ్గరగా వస్తోందని గమనించి...అది స్త్రీమూర్తి నీడ కావడంతో ఠక్కున లేచి పక్కకు తప్పుకున్నాడు . అంత బాధలో యుద్ధభూమిలో అడుగుపెట్టిన మండోదరి..రాముడి చర్యను గమనించింది. తన వ్యక్తిత్వం చూసి ఆశ్చర్యపోయింది. రాముడి ఆత్మ సౌందర్యాన్ని అర్థం చేసుకుంది. అప్పటివరకూ రాముడిపై ఉన్న కోపం, ఆగ్రహం, ఆవేశం అన్నీ ఆ ఒక్క చర్యతో మాయమైపోయాయి. ఇదీ పరస్త్రీలపై రాముడు చూపించే సోదర ధర్మం
ఏ క్షణం ఎలాంటి పరిస్థితులు ఎదురుకావొచ్చు..అప్పటివరకూ అద్భుతంగా ఉన్న జీవితం ఒక్కసారి తల్లకిందులు కావొచ్చు..కానీ.. జీవితంలో ఎదురయ్యే ప్రతి పరీక్షను ధర్మంగా ఎదుర్కొని విజయాన్ని ఎలా సొంతం చేసుకోవాలో రాముడిని చూసి నేర్చుకోవాలి.
అందుకే రాముడిని పూజించవద్దు..అనుసరించండి...