Spirituality: భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఆచరించకూడని విధులివే!
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త కొన్ని పనులు ఆచరించకూడదని పెద్దలు చెబుతుంటారు. ఎందుకు? అవి పాటించడం వెనుకున్న ఆంతర్యం ఏంటో తెలుసా?
Spirituality : పెళ్లి చేసుకుని మెట్టినింట్లో అడుగుపెట్టిన స్త్రీ...అమ్మ అయ్యే క్షణం కోసం తపించిపోతుంది. అప్పటి వరకూ ఆ కుటుంబంలో ఒకరిగా ఉండే ఆమె అమ్మగా మారిన తర్వాత ఆ కుటుంబానికి అన్నీ తానే అవుతుంది. రెండు కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతుంది. అందుకే ఆమె నెలతప్పింది అని తెలిసినప్పటి నుంచీ పుట్టినింట్లో-మెట్టినింట్లో సందడే సందడి. సీమంతం లాంటి వేడుకలు ఆ సంతోషాన్ని రెట్టింపు చేస్తాయి. అయితే ఈ తొమ్మిది నెలల పాటూ భర్త కొన్ని పనులు చేయకూడదని చెబుతారు పెద్దలు. అలా చేస్తే పుట్టబోయే బిడ్డకు అరిష్టం అంటారు. ఇంతకీ భార్య కడుపుతో ఉన్నప్పుడు భర్త ఏ విధులు ఆచరించకూడదు? ఈ నియమాల వెనుకున్న ఆంతర్యం ఏంటి?
Also Read: ప్రేమికుల దినోత్సవం రోజే వసంతపంచమి, ఆ రోజుకున్న విశిష్టత ఇదే!
భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త ఈ పనులు చేయకూడదు
- భార్య గర్భవతిగా ఉన్నప్పుడు భర్త సముద్ర స్నానం చేయకూడదు
- చెట్లు కొట్టడం, మొక్కలకు పురుగుల మందు చల్లడం చేయరాదు ( ఓ ప్రాణిని చంపడంతో సమానం అని భావిస్తారు)
- 7 నెలలు నిండినప్పటి నుంచి ప్రసవం అయ్యేవరకూ క్షవరం చేసుకోకూడదు..కొందరు భార్య గర్భవతి అని తెలిసినప్పటి నుంచీ క్షవరం చేసుకోరు
- ఈ తొమ్మిది నెలల పాటూ శవాన్ని మోయరాదు, అంతిమయాత్రలో పాల్గొనకూడదు, ప్రేతకర్మలు నిర్వహించరాదు
- భార్య కడుపుతో ఉందని తెలిసిన తర్వాత తీర్థయాత్రలు, విదేశీ యాత్రలు చేయకూడదు
- పడవలు ఎక్కడం, పర్వతారోహణ చేయడం అస్సలు కూడదని పురాణాలు చెబుతున్నాయి
- శంకుస్థాపనలు, గృహ ప్రవేశాలు లాంటి కార్యక్రమాలకు కూడా దూరంగా ఉండాలి
- చెట్ల నుంచి సరిగా పండని పండ్లు, పూర్తిగా విచ్చుకోని పూలు కోయరాదు
- ఎట్టి పరిస్థితుల్లోనూ ఆమెను విడిచి దూరంగా వెళ్లకూడదు
Also Read: అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే
ఈ నియమాలెందుకు
ఈ నియమాలన్నీ పురాణాల్లో చెప్పారన్న విషయం పక్కనపెడితే.. వాస్తవానికి గర్భవతి ఇంట్లో ఉన్నప్పుడు ఏ క్షణం ఏ అవసరం వస్తుందో చెప్పలేం. ఆమె ఆరోగ్యం ఎప్పుడెలా ఉంటుందో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో భర్త పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంటే ఇల్లాలికి ధైర్యంగా ఉంటుంది. సమస్య వస్తుందేమో అనే భయం కానీ, వచ్చినా ఏం జరుగుతుందో అనే భయం లేకుండా నా వెంటే ఉన్నారులే అనే ధైర్యం ఆమెను, కడుపులో బిడ్డను మరింత ఆరోగ్యంగా ఉంచుతాయి. పైగా తీర్థయాత్రలు, కొండలెక్కడం, పడవ ప్రయాణాల కోసం దూరప్రాంత ప్రయాణాలు చేస్తే ఏదైనా జరగరానిది జరిగితే ఆ కుటుంబం జీవితాంతం బాధపడాల్సి ఉంటుంది. బయటకు వెళ్లిన భర్త ఎప్పటికి వస్తాడో అనే టెన్షన్ కడుపుతో ఉన్న సమయంలో ఏమాత్రం మంచిదికాదు. అందుకే అవకాశం ఉన్నంతవరకూ ఆ 9 నెలలు భార్య దగ్గరే ఉండి భరోసా ఇస్తే తల్లి, బిడ్డ క్షేమంగా ఉంటారని అంటారు.
ఇవన్నీ చాదస్తాలు కాదు..ఓ బంధాన్ని పటిష్టం చేసే ఆరోగ్యకరమైన మార్గాలు... ఇవొక్కటే కాదు పెద్దలు పాటించాలని చెప్పే ప్రతినియమం వెనుకా, జరుపుకునే పూజలు, పండుగల సమయంలో పాటించే నియమాలు అన్నింటి వెనుకా ఆంతర్యం ఇదే..
Also Read: సరదాగా శివుడి కళ్లు మూసిన పార్వతీ దేవి - ఆ క్షణం ఏం జరిగిందంటే!