Sankranti Gobbillu 2023: భోగి, సంక్రాంతికి ఇంటి ముందు గొబ్బిళ్లు ఎందుకు పెడతారు, ఆ పాటల వెనుకున్న ఆంతర్యం ఏంటి!
Sankranti Special 2023: సంక్రాంతి మూడు రోజులు పాటించే ప్రతి పద్ధతి, సంప్రదాయం వెనుక మన జీవనశైలి, కుటుంబ వ్యవహారాలు అన్నీ ఇమిడి ఉంటాయి. అందులో భాగమే సంధ్య గొబ్బిళ్లు...ఇవెందుకు పెడతారంటే...
Sankranti Gobbillu 2023: సంక్రాంతి పండుగ ప్రారంభానికి నెల ముందు నుంచే పండుగ శోభ మొదలైపోతుంది. ధనుర్మాసం ప్రారంభంలోనే వేడుకలు, సంబరాలు ప్రారంభమవుతాయి. తెలుగు లోగిళ్లన్నీ రంగవల్లులతో కళకళలాడుతుంటాయి. రంగులు నింపిన ముగ్గుల మధ్య గొబ్బిళ్లు చేసి వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి..పసుపు-కుంకుమతో గౌరీ దేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం కన్నె పిల్లలంతా ఈ గొబ్బిళ్ల చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. గొబ్బి అనే మాట గర్భా అనే మాట నుంచి ఉద్భవించిందని చెబుతారు జానపద పరిశోధకులు. గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు. అందుకే గొబ్బెమ్మగా గౌరవిస్తూ పసుపుకుంకుమలతో పూజిస్తారు.
సుబ్బీ గొబ్బెమ్మా సుఖములీయవే
చామంతి పువ్వంటి చెల్లిల్నియ్యవే
తామర పువ్వంటి తమ్ముడ్నీయ్యవే
మొగలీ పువ్వంటీ మొగుడ్నియ్యవే
అంటూ సాగే గొబ్బి పాట కన్నెపిల్లల కోర్కెలను వారి భవిష్యత్ ను, పుట్టినిల్లు,మెట్టినింటి సౌభాగ్యాన్ని కోరుకునే ఆడపడుచుల మనసులు తెలియజేస్తుంది.
Also Read: ''భోగి' రోజున ఇది చూస్తే కళ్యాణ యోగం, వైవాహిక జీవితంలో ఆనందం!
కొలని దోపరికి గొబ్బిళ్ళో యదు కుల స్వామికిని గొబ్బిళ్ళో
కొండ గొడుగుగా గోవుల గాచిన కొండొక శిశువునకు గొబ్బిళ్ళో
దండగంపు దైత్యుల కెల్లను తల గుండు గండనికి గొబ్బిళ్ళో
పాప విధుల శిశుపాలుని తిట్టుల కోపగానికిని గొబ్బిళ్ళో
యేపున కంసుని యిడుమల బెట్టిన గోప బాలునికి గొబ్బిళ్ళో
దండి వైరులను తరిమిన దనుజుల గుండె దిగులునకు గొబ్బిళ్ళో
వెండిపైడి యగు వేంకట గిరిపై కొండలయ్యకును గొబ్బిళ్ళో
అంటూ పదకవితా పితామహుడు అన్నమయ్య శ్రీకృష్ణుడు గోవర్థనగిరిని గొడుగుగా పట్టి గోవుల్ని సంరక్షించడం, శిశుపాలుని, కంసుడిని వధించడం లాంటి సాహసాలను వివరించడం ద్వారా శ్రీ కృష్ణుడే వెంకటేశ్వరునిగా జన్మించాడని అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించాడు.
Also Read: భోగి పళ్లు ఎందుకు పోస్తారు, రేగుపళ్లనే ఎందుకు పోయాలి!
గొబ్బిపాటల్లో ఎక్కువగా గోవిందుడు, శ్రీకృష్ణుడి గురించి పురాణ కథలున్నాయి. గొబ్బిపాటల్లో కృష్ణుడిని ఉద్దేశించే ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో గోదాదేవి పాశురాల్లో కూడా గొబ్బిళ్ల ప్రస్తావన ఉంటుంది. ఇంకా అత్తాకోడళ్లు, మామాఅల్లుళ్లు, అన్నదమ్ములు, అక్కచెళ్లెళ్లు వియ్యపురాళ్ల పరువులు పట్టుదలలు, ఆప్యాతలు, అనుబంధాలు ఇలా ఎన్నో విషయాలు ఈ గొబ్బిపాటల్లో ఉంటాయి. రాయలసీమ ప్రాంతంలో ప్రచారంలో ఉన్న పాటేంటంటే గాజులు అమ్ముకునే వ్యాపారి కంచి వెళ్లి గాజులు తీసుకొస్తే..మహిళలంతా చేరి కంచి కామాక్షమ్మ గురించి అడిగి తెలుసుకోవడమే ఈ గొబ్బిపాటలోని ఇతివృత్తం.
గంగమ్మ గౌరమ్మ అప్పసెల్లెండ్రూ .. గొబ్బియళ్లో ..
ఒక తల్లి బిడ్డలకు వైరమూ లేదు.. గొబ్బియళ్లో
మంచి మంచి పూలేరి రాసులు పోసిరి...గొబ్బియళ్లో ...
అనే పాట ఎటువంటి వైరాలు వైషమ్యాలు లేకుండా కలిసి మెలిసి జీవనం సాగించాలనే ధర్మాన్ని బోధిస్తుంది.
గొబ్బియల్లో కంచికి పోయేటి గాజులశెట్టి గొబ్బియల్లో...
గొబ్బయళ్ళో గొబ్బియని పాడరమ్మ
కంచి వరదరాజునే గొబ్బియళ్లో
గొబ్బియళ్లో అంచులంచురగుల మద
పంచవన్నె ముగ్గుల్లో గొబ్బియళ్లో... అనే పాటలో ముంగిట్లోని ముగ్గుల ప్రాముఖ్యాన్ని వాటికి దైవత్వాన్ని ఆపాదించడమూ కనిపిస్తుంది.
ఇంటి ముందు కళకళ లాడే ముగ్గు లను వర్ణిస్తూ వాటికి దైవత్వాన్ని ఆపాదిస్తూ
గొబ్బియళ్ళో, గొబ్బి యని పాడారమ్మ
కంచి వరద రాజునే గొబ్బియళ్ళో
గొబ్బియ్యళ్ళో అంచు లంచుల అరుగుల మీద
పంచవన్నె ముగ్గులే గొబ్బియళ్ళో..
అంటూ సాగే పాటల్లో శ్రీ కృష్ణ లీలలకు సంబంధించిన పాటలెన్నో ఉన్నాయి. పట్టణాల్లో అరుదుగా కనిపించే ఈసంప్రదాయం..పల్లెల్లో అడుగడుగునా కనిపిస్తుంది...