Ramateertham: చెరువులో దొరికిన రాముడు- అందుకే ఆ క్షేత్రానికి ఆ పేరు వచ్చింది
ఉత్తరాంధ్ర భద్రాద్రిగా పేరుపొందిన రామతీర్థం రెండేళ్ల తర్వాత భక్తుల మధ్య శ్రీ రామనవమి జరుపుకోవడానికి సిద్దమైంది. రామతీర్థం అనే పేరు ఎలావచ్చింది, ఈ ఆలయం ప్రత్యేకత ఏంటి...
రామతీర్థం అనే పేరు ఎలావచ్చిందంటే..
విజయనగరం జిల్లాలోని నెల్లిమర్ల మండలంలో ఉన్న రామతీర్ధం ఆలయానికి చాలా ప్రాముఖ్యత ఉంది. మొదటి విక్రమేంద్రవర్మ పుత్రుడు ఇంద్రభట్టారక వర్మ 469-496 AD మధ్యకాలంలో ఇక్కడ రాజ్యపాలన చేసినట్లు, ఆ సమయంలోనే ఇక్కడో చిన్న ఆలయం ఉండేదని చరిత్ర చెబుతుంది. కొన్నేళ్ల తర్వాత ఆ ఆ ఆలయ జాడ కనుమరుగైపోయిందట. మళ్లీ 16వ శతాబ్దంలో ఓ వృద్ధురాలికి ఇక్కడి చెరువులో శ్రీరామునితో సహా ఇతర దేవతా మూర్తులు విగ్రహాలు దొరికాయి . ఈ విషయం తెలుసుకున్న అప్పటి పూసపాటి వంశానికి చెందిన మహారాజు భారీ ఆలయం నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించారు. చెరువులో దొరికిన విగ్రహాలు కావడం వల్లే రామతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ఆలయాన్ని నిర్మించి విగ్రహాలు ప్రతిష్టించడమే కాదు...ఆలయ నిర్వహణకోసం కొన్ని భూములు ఇనానంగా ఇచ్చారు. అప్పటి నుంచి ఆయన ఇచ్చిన ఆ భూముల ఆదాయంతోనే ఇప్పటివరకూ ఆలయంలో పూజలు నిర్వహిస్తున్నారు. ఏటా ఇక్కడ జరిగే శ్రీరామనవమి ఉత్సవాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. నీలాచల కొండకు ,భాస్కర పుష్కరిణి మధ్య పచ్చటి వాతావరణం మధ్యలో ఈ దేవాలయం నిర్మించారు . పురాతన విజయనగర వాస్తు కళకు ఈ ఆలయం ఒక ఉదాహరణ. ఇక్కడ ఉగాది నుంచి శ్రీరామనవమి వరకూ జరిగే ఉత్సవాలకు ఉత్తరాంధ్ర నుంచే కాదు పక్క రాష్ట్రాల నుంచి కూడా భారీగా భక్తులు హాజరవుతారు.
Also Read: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
- రామతీర్ధం ఆలయం రెండుభాగాలుగా ఉంటుంది. మొదటిభాగం కొండకింద విజయనగర రాజులు నిర్మించిన రామతీర్ధం ఆలయం కాగా దాని ఎదురుగా ఉన్న ఎత్తైన కొండపై కోదండరామ స్వామి ఆలయం ఉంటుంది . ఈ కొండనే నీలాచలం అనీ బోధి కొండని కూడా పిలుస్తారు .
- ద్వాపరయుగంలో పాండవులు వనవాస సమయంలో ఈ ప్రాంతంలో సంచరించారని ప్రతీతి. ఆ సమయంలో కృష్ణుడిని కూడా తమతో రమ్మని పాండవులు కోరితే.. సీతారామలక్ష్మణుల విగ్రహాలను వారికి అందజేసి తన బదులుగా పూజించమని చెప్పాడట. ఇక్కడి భీముని గృహం ఉండడం వారు సంచరించరనడానికి ఆనవాళ్లని చరిత్రకారులు చెబుతారు.
- రాముడు ఇక్కడ కొంతకాలం వనవాసం చేశాడని, అప్పుడు శివుడి మంత్రం జపించాడని పురాణాల్లో ఉంది. అందుకే శివరాత్రితో పాటూ కార్తికమాసంలోనూ ఈ ఆలయం కన్నులపండువగా ఉంటుంది.
- ఈ ఆలయానికి ఉత్తరాన రెండు కిలోమీటర్ల పొడవూ 600 మీటర్లు ఎత్తున్న ఏకశిలా పర్వతం కనిపిస్తుంది. దీనిపైన సీతారాములు, పాండవులు సంచరించారని చెబుతారు.
- రామాలయం పక్కనే ఉన్న కోనేరులోని నీరు ఏ కాలంలోనైనా ఇంకిపోవంటారు. ఆ నీటి మడుగు నుంచి పశ్చిమం వైపు వెళ్తే భీముని బుర్ర, గాడీ పొయ్యి, బుద్ధ విగ్రహం, పర్ణశాల, పలుకురాయి, సీతమ్మ పురిటి మంచం తాలూకు చిహ్నాలు కనిపిస్తాయి
- ఈ ప్రాంతంలో జైనులు, బౌద్ధులు కూడా నివసించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి.
- ఈ క్షేత్రాన్ని ఆనుకుని చంపావతీ నదీ ప్రవహిస్తూ ఉంటుంది.
- విగ్రహాలు దొరికాయని చెప్పే 13 ఎకరాల విస్తీర్ణం లో ఏర్పడ్డ పుష్కరిణి ఎంతో ప్రత్యేకం .
- ప్రధాన ఆలయంలో శ్రీరామ స్వామి ఎదురుగా ఆంజనేయ స్వామి ఆలయం ఉంది .
- పర్వదినాల్లో గ్రామమంతా ఊరేగించే ఉత్సవ మూర్తులు ,వివిధ వాహనాలు ,తులాభారాలు నిర్వహించే త్రాసు లాంటివి ఈ ఆలయ ప్రాంగణంలో భక్తులకు దర్శనం ఇస్తుంటాయి.
రెండేళ్లుగా కోవిడ్ కారణంగా ఇక్కడ శ్రీరామ నవమి ఉత్సవాలు జరగలేదు . ఏకాంతంగానే అర్చకులు పూజలు జరిపించారు . అయితే ఈసారి కోవిడ్ ఉధృతి తగ్గడం తో భక్తుల సమక్షంలో శ్రీరామ నవమి జరపడానికి అధికారులు ఏర్పాట్లు చేశారు . వాస్తవానికి రాష్ట్ర విభజన జరిగిన సమయంలో తెలంగాణ కు భద్రాచలం వెళ్ళిపోవడంతో ఆంధ్రా భద్రాద్రిగా రామ తీర్ధాన్ని ప్రకటించాలనే డిమాండ్ వినిపించింది. కానీ కొన్ని కారణాల వల్ల అది ఒంటిమిట్టకు తరలిపోయింది. ఇక్కడ మరో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ శ్రీరామ నవమి వేడుకలు మాత్రమే కాదు శివరాత్రి కూడా కన్నులపండువగా జరుగుతుంది. ఇప్పటికీ ఈ ఆలయానికి పూసపాటి వంశీయులే ధర్మకర్తలుగా ఉన్నారు .
Also Read: ఈ లక్షణాలుంటే మీరు కూడా రాముడే-దేవుడే