Ramanarayanam Temple: రాముడి కోదండం ఆకారంలో ఆలయం, చుట్టూ రామాయణ ఘట్టాలు, ఈ అద్భుత ఆలయాన్ని ఒక్కసారైనా చూసితీరాల్సిందే
మన దేశంలో ప్రాచీన ఆలయాలు మాత్రమే కాదు..ఈ మధ్యకాలంలో నిర్మించిన ఆలయ నిర్మాణాలు సైతం కళ్లు చెదిరేలా ఉంటున్నాయ్. ఆధ్యాత్మితకతు ఆధునిక టెక్నాలజీ తోడైతే ఎంత అద్భుతంగా ఉంటుందో తెలియజేస్తుంది రామనారాయణం...
రామబాణం ఎక్కుపెట్టినట్టు నిర్మించిన ఈ ఆలయం ఉత్తరాంధ్ర జిల్లాలకు ప్రత్యేక ఆకర్షణ అని చెప్పొచ్చు. విజయనగరం నుంచి కోరుకొండ వెళ్ళే దారిలో విజయనగరం రైల్వే స్టేషన్ కు 9 కిలోమీటర్ల దూరంలో NCS ట్రస్ట్ నిర్మించిన దేవాలయం ఇది. ఆ ట్రస్ట్ వ్యవస్థాపకులు నారాయణం నరసింహ మూర్తి కోరిక మేరకు ఆయన కుమారులు ఈ ఆలయాన్ని కట్టించారు. 2014 మార్చి 22 న గరికపాటి నరసింహారావు ,చాగంటి కోటేశ్వర రావు సహా పలువురు ప్రముఖులు ఈ ఆలయాన్ని ప్రారంభించారు. 15 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ కట్టడాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దారు.
ఆలయంలో ప్రత్యేకతలు
- ధనుస్సు ఆకారంలో నిర్మించి ఆలయంలో వాల్మీకి విరచిత రామాయణం లోని ముఖ్య భాగాలను 72 ఘట్టాలుగా విభజించి , వాటికి సంబంధించి 72 విగ్రహాలను ఏర్పాటు చేసారు.
- శ్రీ మహా విష్ణువు ఆలయం తో మొదలయ్యే ధనుస్సు ఆకారం మరో చివర సీతా లక్ష్మణ ఆంజనేయ సహిత శ్రీ రామ ఆలయం ఉంటుంది . అంటే శ్రీ మహా విష్ణువే రామునిగా అవతరించాడు అనే సంకేతాన్ని భక్తులకు ఇవ్వడం అన్నమాట .
- ధనుస్సు మధ్యలో 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహాన్ని నిర్మించారు . ఈ ఆలయపు ధనుస్సు ఆకారం ఎంత విశిష్టమైందో ... ఆ 60 అడుగుల ఆంజనేయ స్వామి విగ్రహం కూడా అంతే ప్రత్యేకమైంది .
- ఈ ఆలయాన్ని మామూలుగా చూస్తే ఒకే ఆకారంలా కనపడినప్పటికీ నిజానికి ఇది రెండంతస్తులుగా నిర్మితమైంది . పైన ఆలయాల బయట జయ విజయులు, గరుత్మంతుడు, శుకుడు, నారద తుంబురుల విగ్రహాలు ఉన్నాయి.
- కింద మెట్లకు ఇరువైపులా 16 అడుగుల ఎత్తు ఉన్న శ్రీ మహాలక్ష్మి, శ్రీ సరస్వతుల విగ్రహాలు శోభాయ మానంగా ఉంటాయి. ఈ రెండు విగ్రహాల వద్ద కుడా ఫౌంటెన్ లు ఉన్నాయి.
- మెట్లకు ముందు ఈ ఆలయం కట్టించిన నారాయణం నరసింహమూర్తి విగ్రహం, పూలతోట ఉంది
- కింద అంతస్తులో అల్పాహార శాల, అన్న ప్రసాద శాల, గ్రంథాలయం, వేద పాథశాల, ధ్యాన మందిరం, కళ్యాణ మండపం, గోశాల -- కూడా నిర్మాణంలో ఉన్నాయి. వీటన్నిటికి, శబరీ, సుగ్రీవ, -- ఇలా రామాయణంలో వినిపించే పాత్రల పేర్లే పెట్టారు.
Also Read: ఫిబ్రవరి 16 బుధవారం మాఘ పౌర్ణమి, ఇలాచేస్తే పాపాలు నశించి ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందట
ఇతర విశేషాలు
రామనారాయణం ఆలయం రాముడికే అంకితం చేసినప్పటికీ నిజానికి ఇది కొన్ని ఆలయాల సముదాయం అని చెప్పవచ్చు . ఎందుకంటే ఇక్కడ ఇతర దేవతలకు చెందిన చిన్న చిన్న ఆలయాలు అనేకం ఉన్నాయి . ఆయా దేవతా మూర్తుల జన్మ నక్షత్రాన్ని బట్టి వారికి ఆయా రోజుల్లో అభిషేకాలు .. ప్రత్యేక పూజలూ జరుగుతుంటాయి . రామాయణం ఘట్టాలను తెలిపే ఆయా విగ్రహాల వద్ద నిల్చొని ఆ ఘట్టం గురించి తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో తెలుసుకునే విధంగా ఏర్పాటు చేసారు. ఇలాంటి అవకాశం దేశంలోని అతి తక్కువ ఆలయాల్లో మాత్రమే ఉంది . రామాయణ ఘట్టాలను తెలిపే శిల్పాలు ఎంతో ప్రేరణ ఇస్తాయి అంటారు ఇక్కడకు వచ్చిన సందర్శకులు ,భక్తులు.
నిత్యాన్నదానం-వేదాధ్యయనం
ఆలయ ప్రాంగణంలో వేదపాఠశాల నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఈ పాఠశాలలో 65 మంది పిల్లలు వేదం నేర్చుకుంటున్నారు. అలాగే ఈ ఆలయాన్ని చూడడానికి వచ్చే భక్తులు ,సందర్శకులకు మధ్యాహ్నం భోజనం ఉచితంగా అందిస్తుంటారు . ప్రధాన రహదారికి కాస్త దూరంగా ఉండడం వల్ల ఇక్కడ మధ్యాహ్నం పూట ఆహార వసతులు దొరకడం కష్టమే . అందుకే ఇక్కడకు వచ్చే భక్తులకోసం నిత్యాన్నదానం జరుగుతుందని ఆలయ ప్రతినిధులు చెబుతారు .
Also Read: పగ నాలుగు రకాలు, ఎవ్వరిపైనా అతివిశ్వాసం వద్దు, ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన కథ ఇదే
ప్రత్యేక ఆకర్షణ -లేజర్ షో
మామూలుగా చూస్తేనే అందంగా కనపడే ఈ ఆలయ నిర్మాణం కాస్త ఎత్తునుంచి చూస్తే అద్భుతం అనిపిస్తుంది . ఆధునిక డ్రోన్ ల సాయంతో తీసిన వీడియోలు, చిత్రాలు చూస్తే ఈ దేవాలయ నిర్మాణం వెనుక ఎంతటి కళా నైపుణ్యం ,పట్టుదలా దాగున్నాయో అర్ధమవుతుంది . ఇక పగలంతా అద్భుతం లా కనపడే రామనారాయణం రాత్రి పూట విద్యుత్ కాంతుల్లో మహాద్భుతం అనిపిస్తుంది ధనుస్సు ఆకారం మధ్యనున్న 60 అడుగుల ఆంజనేయ స్వామిపై ప్రదర్శించే 3D మ్యాపింగ్ లేజర్ షో చూసేందుకు నిత్యం భారీగా తరలివస్తారు భక్తులు. శ్రీ రామ నవమి వచ్చిందంటే మాత్రం ఆ వైభవాన్ని మాటల్లో వర్ణించలేం అంటారు.
తప్పక దర్శించాల్సిన క్షేత్రం
ప్రశాంత వాతావరణంలో .. అద్భుతంగా నిర్మించిన రామనారాయణం ఆలయం ఉత్తరాంధ్రకు ప్రత్యేక ఆకర్షణగా మారింది. ఇప్పుడిప్పుడే ఈ ఆలయం గురించి తెలుసుకుని పర్యాటకులు తరలివస్తున్నారు. ఇంకా చెప్పాలంటే ఈ తరానికి ఇతిహాసాల గురించి అర్థమయ్యేలా చెప్పాలంటే ఈ ఆలయ సందర్శన ద్వారా సాధ్యమవుతుందంటారు భక్తులు.