Magh Punrima 2022: ఫిబ్రవరి 16 బుధవారం మాఘ పౌర్ణమి, ఇలాచేస్తే పాపాలు నశించి ఐశ్వర్యం, ఆరోగ్యం సిద్ధిస్తుందట
హిందూ పురాణాల ప్రకారం, మాఘ మాసం అత్యంత పవిత్రమైన మాసంగా భావిస్తారు. రథసప్తమి, జయ భీష్మ ఏకాదశి, శ్రీ పంచమి మహాశివరాత్రి ఇలా నెలంతా పర్వదినాలే. ఈ మాసంలో పౌర్ణమికి మరింత విశిష్టత ఉంది.
న సమం భవితా కించిత్తేజః సౌరేణ తేజసా।
తద్వత్ స్నానేన మాఘస్య నా సమాః క్రతుజాః క్రియాః।।
సూర్యుని తేజస్సుకు సాటి వచ్చే కాంతి మరొకటి లేనట్టే, మాఘ స్నానానికి సాటి వచ్చే క్రతువు గాని, క్రియ గాని మరొకటి లేదు అని దీని భావం.
మాఘ పౌర్ణమినే మహా మాఘి అని కూడా వ్యవహరిస్తారు. ఈ ఏడాది ఫిబ్రవరి 16 బుధవారం మాఘ పౌర్ణమి వచ్చింది. హిందువులు పౌర్ణమి తిథిని చాలా పవిత్రంగా భావిస్తారు . మాఘమాసంలో దేవతలు తమ సర్వ శక్తులు, తేజస్సులను జలాల్లో ఉంచుతారు. అందువల్ల మాఘ స్నానం చాలా గొప్పది. నది దగ్గరలో లేని వారు కనీసం చెరువులో గానీ, కొలనులోగానీ, లేక బావి దగ్గర గానీ స్నానం ఆచరించాలి. సాధారణంగా ఏడాదిలో నాలుగు నెలలు సాగరంలో స్నానానికి అనుకూలం. వాటిలో ఆషాఢం, కార్తీకం, మాఘం, వైశాఖ మాసాల్లో ప్రవహిస్తున్న నీటిలో స్నానం చేస్తే శుభఫలితాలు వస్తాయంటారు. ఈ నాలుగు నెలల్లో సాగరం చుట్టూ ఉష్ణోగ్రతలు స్నానానికి తగినట్టుగా ఉంటాయని, ఆ సమయంలో సముద్రం మీద పడే చంద్రకిరణాలు కూడా ఔషధ తత్వాన్ని కలిగి ఉంటాయని చెబుతారు. ముఖ్యంగా నదులు సముద్రంలో కలిసేచోట స్నానం చేసేందుకు భారీగా భక్తులు తరలివెళతారు.
Also Read: పగ నాలుగు రకాలు, ఎవ్వరిపైనా అతివిశ్వాసం వద్దు, ధర్మరాజుకి భీష్ముడు చెప్పిన కథ ఇదే
స్నానాంతరం సమస్త జీవరాశికి ఆధారమైన సూర్యభగవానుడికి ఆర్ఘ్యం సమర్పించాలి. ఈ రోజున పవిత్ర గంగా నదిలో స్నానం చేసి దానం చేయడం ద్వారా మోక్షం పొందుతారని విశ్వాసం. మాఘ పూర్ణిమ రోజున కాశీ, ప్రయాగ్రాజ్, హరిద్వార్ వంటి పుణ్యక్షేత్రాలలో స్నానం చేయాలని పురాణాల్లో ఉంది. ఈ రోజున గొడుగు, నువ్వులు దానం చేస్తే విశేష ఫలితం లభిస్తుంది. దీని వల్ల జన్మజన్మలుగా వెంటాడుతోన్న పాపాలు, దోషాలు నశించి, అశ్వమేథ యాగం చేసినంత ఫలితం దక్కుతుందని సాక్షాత్తు శ్రీ కృష్ణుడే ధర్మరాజుతో చెప్పాడంటారు. స్నానం, దానం అనంతరం వైష్ణవ ఆలయానికి కానీ శివాలయానికి గానీ వెళ్లి దర్శనం చేసుకోవాలి.
స్నానం చేసేటప్పుడు పఠించాల్సిన శ్లోకం
‘గంగేచ యమునేచైవ గోదావరి సరస్వతి
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధింకురు
కేవలం మాఘపౌర్ణమి రోజే కాదు నిత్యం స్నానేం చేసేటప్పుడు ఈ శ్లోకాలు చదవడం చాలా మంచిదంటారు పండితులు.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే