Padma Awards 2023 Chinna Jeeyar: ఆధ్యాత్మిక ప్రపంచంలో ఆచార్యుడు ఈ తరానికి సమతా మూర్తి చినజీయర్ స్వామి!
చిన జీయర్ స్వామికి పద్మభూషణ్: ధర్మం నాలుగు పాదాల మీద నడవాలంటే ముందు ప్రతి ఒక్కరి మనసులో , మాటలో, చూపులో, చర్యలో నడవాలి. మానవ జీవన సూత్రం సమతా ధర్మం...ఆ సమతకు దారి దీపమే చినజీయర్ స్వామీజీ.
Chinna Jeeyar Padma Bhushan: గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం 2023 ఏడాదికిగానూ పలు రంగాల్లో సేవ చేసిన, రాణించిన మొత్తం 106 మంది ప్రముఖులకు పద్మ పురస్కారాలు ప్రకటించింది. ఆధ్మాత్మికం విభాగంలో శ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, కమలేష్ డి పటేల్ లు పద్మభూషణ్ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా సామాన్యుడి నుంచి స్వామీజీగా ఆధ్యాత్మిక ప్రపంచంలో తనదైన ముద్ర వేసిన చిన జీయర్ గురించి కొన్ని విషయాలు...
ఆచరించి చెప్పేవాడు, చెప్పిందే ఆచరించే వాడే ఆచార్యుడు కనుక ఆచార్య అనే నామాన్ని సార్థకం చేస్తున్న రామానుజాభి మతాచార్యుడు, మొదటి రామానుజ జీయర్ స్వామిని పెద్ద జీయర్ అంటూ శాశ్వతంగా చిన జీయర్ నామాన్ని ధరించిన నిరాడంబరుడు శ్రీమన్నారాయణ రామానుజాచార్యుడు. భవబంధాలనుంచి ముక్తి కల్పించేది భక్తి అన్న రామానుజ సిద్ధాంతాన్ని మనసా వచసా కర్మణా పాటిస్తున్న త్రికరణశుద్ధి ఆయనది. దేశదేశాలలో దివ్యోపదేశాలు చేస్తూ ప్రపంచానికి ‘ఈదేశం సందేశం’ అని చెప్పుకోతగ్గ భారతీయుడు.
Also Read: చినజీయర్‌కు పద్మభూషణ్, కీరవాణికి పద్మశ్రీ - తెలుగు రాష్ట్రాలకు ఎన్ని అవార్డులంటే !
శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చినజీయర్ స్వామిజీ..23 సంవత్సరాల వయసులో ఐహిక సుఖాలను త్యజించి జీయర్ అయ్యారు. 1984లో వేద విద్య, ఆగమ శాస్త్రాలు నేర్పించే జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ (జెట్)ను స్థాపించారు. శంషాబాద్‌లో జిమ్స్ దవాఖాన స్థాపించి ఉచిత వైద్యం అందిస్తున్నారు. శంషాబాద్‌లోని సమతా స్పూర్తి కేంద్రంలో 216 అడుగుల ఎత్తైన రామానుజాచార్య విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈయన చేస్తున్న సేవలను గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారాన్ని ప్రకటించింది..
‘మానవ సేవే మాధవ సేవ’,అని ప్రపంచానికి చాటి చెప్పిన సమతా మూర్తి అడుగుజాడల్లో నడుస్తున్నఈ తరం సమతామూర్తి చిన జీయర్ స్వామి. 1956 నవంబర్ 3 దీపావళి పండుగ రోజున రాజమండ్రి సమీపం అర్తమూరులో అలమేలు మంగతాయారు, వేంకటాచార్యుల దంపతులకు ప్రధమ సంతానంగా జన్మించారు. తల్లి తండ్రులు వారికి పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు. గౌతమ విద్యాపీఠంలో వేదం, వైష్ణవ సంప్రదాయాలలో శిక్షణ పొందారు. తర్క శాస్త్రం, సంస్కృత భాషను నల్లాన్ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద అభ్యసించారు. రాజముండ్రిలోని ఓరియంటల్ పాఠశాలలో పదో తరగతి వరకు సాధారణ విద్యను అభ్యసించారు. అదే సమయంలో వారి తండ్రి స్వర్గస్తులు కావడంతో కుటుంబ పోషణ భారం మోయాల్సి వచ్చింది. ఉద్యోగ అన్వేషణలో చేతి సంచితో ఒంటరిగా హైదరాబాద్ చేరుకున్నారు. కొంత ప్రయత్నం తర్వాత చిన్న ఉద్యోగం సంపాదించారు. అదే సమయంలో టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకుని ఉద్యోగంలో ఇంకో మెట్టు ఎక్కారు. మరి కొంతకాలానికి మరో కంపెనీలో ఇంకొంత మంచి ఉద్యోగంలో చేరారు. ఆ సమయంలోనే 1975 లో పెద జీయర్ స్వామి కాకినాడ రావడం చిన జీయర్ గమ్యం మారింది.
Also Read: పద్మ అవార్డుల్లో మరోసారి తెలుగు చిత్రసీమకు అన్యాయం - కైకాల, జయసుధ ఎక్కడ?
తల్లి అనుమతితో 23 ఏళ్లకి సన్యాసం
యజ్ఞ క్రతువు సాగిస్తున్న సమయంలో... పెద జీయర్ స్వామితో..చిన జీయర్ స్వామికి పరిచయం ఏర్పడింది. ఓ సందర్భంలో పెద జీయర్ స్వామి..తమకు ఒక స్టెనో గ్రాఫర్ కావాలని కోరడంతో...అప్పటికే టైపు,షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నా తానే ఆ పని చేస్తానని ముందు కొచ్చారు. అలా తల్లి అనుమతి తీసుకుని పెద జీయర్ వెంట ప్రయాణం ప్రారంభించారు. అప్పటి నుంచి పెద జీయర్ అడుగులో అడుగులేస్తూ...23 ఏళ్ల వయసులో తల్లి అనుమతితో సన్యాసాశ్రమంలోకి అడుగుపెట్టారు.
గీతాజ్యోతి ఉద్యమం
సన్యాస స్వీకరణ తర్వాత కొన్నేళ్లకు గీతాజ్యోతి ఉద్యమాన్ని చేపట్టారు. గీతాజ్యోతి ఉద్యమం కేవలం భగవద్గీత ప్రాచుర్య రూపకాన్నే కాక, సమాజంలో ఉన్న సోమరితనాన్ని తొలగించే, సౌభ్రాతృత్వ భావనను ప్రతి ఒక్కరిలో మేల్కొల్పగలిగే వ్యూహంగా కూడా రూపుదిద్దుకుంది. విశ్వకోటికి విజ్ఞానాన్ని అందించేది, మోక్ష సాధనకు పునాది అయిన విద్య వేదం. అలాంటి వేద విద్యని సమస్త సమాజానికి విస్తరింపజేయడానికి, ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు. విద్య అనేది ఒక వర్గానికో, వర్ణానికో కాక, మానవాళికంతటికి అందాలనే ఉద్దేశంతో ఆ వేద పాఠశాలలనే గురుకుల పాఠశాలలుగా మలచి, అన్ని రకాల విద్యలనీ బోధించే సౌకర్యాన్ని కల్పించారు.
12 నెలల్లో 12 భాషలు
12 నెలల్లో 12 భాషలు నేర్చుకున్న ఘనత చిన జీయర్ స్వామి సొంతం. దీన్నిబట్టి స్వామివారి పట్టుదల, స్వామివారికి విద్యపై ఉన్న గౌరవం, ప్రేమ అర్థం చేసుకోవచ్చు. ధార్మిక సైనికులను తయారు చేయడంలో కీలకపాత్ర పోషించారు. శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆస్పత్రిలో ఉచిత వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి సేవలో మరో మెట్టు అధిరోహించారు. ఇంకా ఎన్నో సామాజిక, సాంస్కృతిక కార్యక్రమాలనిర్వహించిన తర్వాత... రామానుజాచార్యుల వారి సహస్రాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు.
కుటుంబ పోషణ కోసం హైదరాబాద్ లో అడుగుపెట్టిన చిన జీయర్ స్వామీజీ..ఈ రోజు ఆధ్యాత్మిక ప్రపంచంలో ఈ తరానికి ఆచార్యుడిగా, సమతామూర్తిగా ఉన్నత శిఖరాలను అధిరోహించారు. ఈ సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారం ప్రకటించింది..
జై ..శ్రీమన్నారాయణ