Narmada Pushkaralu 2024: వ్యతిరేక దిశలో ప్రవహించే నర్మదా నది ప్రేమకథ తెలుసా!
Narmada Pushkaralu 2024: మే 1 నుంచి నర్మదా నది పుష్కరాలు మొదలవుతున్నాయి. మనదేశంలో నదులన్నింటి కన్నా నర్మదలో చాలా ప్రత్యేకతలున్నాయి...అవేంటంటే...
Love Story of Rivers Narmada and Sonbhadra: భారతదేశంలో పవిత్రంగా పూజించే ఎన్నో నదులున్నాయి. ఆ నదులకు 12 ఏళ్లకోసారి పుష్కరాలు జరుగుతుంటాయి. ఈ సంవత్సరం బృహస్పతి వృషభ రాశిలో ప్రవేశించడంతో నర్మద పుష్కరాలు ప్రారంభమవుతాయి. అయితే ప్రముఖ నదులైన గంగా, యమునా, గోదావరి, కృష్ణా సహా చాలా ముఖ్యనదులు తూర్పు దిశగా ప్రవహించి బంగాళాఖాతంలో కలుస్తాయి. కానీ నర్మదా నది మాత్రం తూర్పు నుంచి పడమర దిశగా ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది. ఈ నదికి మరో పేరు రేవా. ఇలా ప్రవహించే మరో రెండు నదులు తపతి, మహి. నర్మదా నది మధ్యప్రదేశ్ , గుజరాత్ లో ప్రధాన నది. అన్ని నదులకు భిన్నంగా నర్మదా నది రివర్స్ లో ప్రవహించడం వెనుక చాలా ఆసక్తికర విషయాలు చెబుతారు. అందులో ముఖ్యమైనది నర్మదా నది - సోనభద్ర ప్రేమకథ....
Also Read: నర్మదా నది పుష్కరాలు ప్రారంభమవుతున్నాయ్ - 12 రోజుల్లో ఏ రోజు ఏ దానం చేయాలో తెలుసా!
నర్మదా నది జన్మస్థలం
మధ్యప్రదేశ్‌లోని అనుప్పూర్ జిల్లాలో ఉన్న అమర్ కంటక్ నర్మదా నది జన్మస్థానం. ఈ నది ఎక్కడ పుట్టిందో అక్కడే నర్మదా మాత ఆలయం ... దీనికి ఎదురుగా పార్వతీదేవి ఆలయం ఉంది. ఏటా శివరాత్రికి, నర్మదా జయంతికి, వైశాఖ పూర్ణిమకు ఇక్కడ ఘనంగా జాతర జరుగుతుంది. అమర్‌కంఠక్ పర్వతాల్లో పుట్టిన నర్మదా నది కొండకోనల్లో మెలికలు తిరుగుతూ జబల్‌పూర్ వద్ద పాలరాళ్ల గుండా ప్రవహిస్తూ వింధ్య, సాత్పూరా శ్రేణుల మధ్యనున్న నర్మదా లోయలోకి అడుగు పెడుతుంది. అక్కడి నుంచి పశ్చిమంగా మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల గుండా ప్రవహించి గుజరాత్ లోని బారూచ్ జిల్లాలో అరేబియా సముద్రంలో కలుస్తుంది. నర్మదా నది 1,289 కిలోమీటర్లు పొడవున ప్రవహిస్తుంది...దీనికి 41 ఉపనదులున్నాయి.
Also Read: ఈ ఏడాది మే 1 నుంచి నర్మదానది పుష్కరాలు - ఘాట్ల వివరాలివే!
పడమర దిశలో ప్రవహించడం వెనుకున్న భౌగోళిక కారణం
ఉత్తర, దక్షిణ భారతానికి సరిహద్దుగా చెప్పుకునే నర్మదా నది వెనుకకు ప్రవహించడానికి ప్రధాన కారణం రిఫ్ట్ వ్యాలీ. రిఫ్ట్ వ్యాలీ వాలు వ్యతిరేక దిశలో ఉండడం వలనే నర్మదానది తూర్పు నుంచి పడమర వైపు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తుంది.
Also Read: ఏప్రిల్ 23 చైత్ర పూర్ణిమ రోజు హనుమాన్ జయంతి కాదు హనుమాన్ విజయోత్సవం - ఈ రెండింటికి వ్యత్యాసం తెలుసా!
నర్మదా ప్రేమ కథ
నర్మదా నది సోనభద్రను వివాహం చేసుకోవాలని భావించింది. కానీ సోనభద్ర...నర్మద స్నేహితురాలు జూహిలాను ప్రేమించాడు. ఈ విషయం తెలిసి ఆగ్రహంతో కూడిన అలకవహించిన నర్మదా నది ఇక వివాహం చేసుకోకుండా కన్యగా ఉండిపోవాలని నిర్ణయించుకుని వెనక్కు మళ్లిందట. అలా సోనభద్రపై తనను తిరస్కరించాడనే కోపంతో దిశ మార్చుకుని ప్రవహిస్తోంది. ఇది నిజమే అన్నట్టు.. ఓ ప్రదేశంలో సోనభద్ర నది నుంచి విడిపోతున్నట్లు మనకు కనిపిస్తుంది. నేటికీ ఈ నది ఇతర నదుల్లా కాకుండా వ్యతిరేక దిశలో ప్రవహిస్తుంది
Also Read: సమ్మర్ హాలీడేస్ లో మీ పిల్లలకు ఇవి తప్పనిసరిగా నేర్పించండి!